హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ జాతి చరిత్రను ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి అని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. ఆయన అందించిన సేవలు భవిష్యత్తు తరాలకు సైతం స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో సురవరం జయంతి వేడుకలను ప్రతి సంవత్సరం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ ఏడాది 126వ జయంతి సదర్భంగా శనివారం ఉదయం ట్యాంక్‌బండ్‌పై ఉన్న సురవరం విగ్రహానికి నివాళులర్పించి ఉత్సవాలను ప్రారంభిస్తామన్నారు. సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతిలో భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా దశాబ్దాల కాలంగా వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ఐదుగురు మహనీయులను సన్మానించుకోవడంతో పాటు, సురవరం ప్రతాపరెడ్డి రాసిన కథలపై నిర్వహించిన షార్ట్‌ఫిల్మ్ పోటీల్లో విజేతలకు నగదు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు. కవులు, సాహితీవేత్తలు, రచయితలు అధిక సంఖ్యలో పాల్గొని జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి 126వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం రవీంద్రభారతిలో పలువురికి అవార్డులు ప్రదానం చేయనున్నారు. శాంతా బయోటెక్ వ్యవస్థాపకుడు పద్మభూషణ్, డాక్టర్ కేఐ వరప్రసాద్‌రెడ్డి, ప్రముఖ పురావస్తు పరిశోధకుడు ఈమని శివనాగిరెడ్డి, రచయితలు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, ఆర్ శేషశాస్త్రి, తెలంగాణ సారస్వత పరిషత్తు జనరల్ సెక్రటరీ డాక్టర్ జుర్రు చెన్నయ్యకు పురస్కారాలను అందజేస్తామని తెలంగాణ భాష, సాంస్కృతిక శాఖ తెలిపింది. షార్ట్‌ఫిల్మ్ కాంటెస్ట్‌లో పది బహుమతులు, నగదు ప్రోత్సాహకాలు ప్రదానం చేయనున్నట్టు పేర్కొన్నది.