న్యూఢిల్లీ, అక్టోబర్ 5: మహిళలు, పిల్లలపై లైంగిక నేరాలకు పాల్పడే అసాంఘిక శక్తులను నిరోధించడానికి ఢిల్లీలో మరింత కఠినమైన, పటిష్టమైన పోలీసింగ్ వ్యూహం అవసరమని సుప్రీంకోర్టు సోమవారం పిలుపునిచ్చింది. నేరాలకు పాల్పడేవారిలో సమర్థవంతమైన పోలీసింగ్ భయాన్ని కలిగించాలని కూడా న్యాయస్థానం నొక్కిచెప్పింది. నేషనల్ క్యాపిటల్ రీజియన్(ఎన్సీఆర్)లోని వివిధ ప్రాంతాల నుంచి ఇటీవల వెలుగుచూసిన వరుస లైంగిక దాడి ఘటనలను పరిగణనలోకి తీసుకున్న కొద్ది రోజులకే న్యాయస్థానం నుంచి ఈ వ్యాఖ్యలు వెలువడ్డాయి.
నేరాలను నిరోధించే చర్యలు అత్యవసరమని, క్షేత్రస్థాయిలో పోలీసుల గస్తీని మరింత బలోపేతం చేయాలని విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు సూచించింది. సంఘ వ్యతిరేక శక్తుల గుండెల్లో భయం పుట్టించాలి అని న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పర్దీవాలా, జస్టిస్ కే వినోద్ చంద్రన్తో కూడిన ధర్మాసనం ఢిల్లీ పోలీసులకు సూచించింది. నేరాలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని నేరస్తులు నమ్మేలా చేయాలి అని జస్టిస్ పర్దీవాలా పేర్కొన్నారు.
ఇప్పుడు ఏదైనా చేస్తే చచ్చిపోతాం అని వారు(సంఘ వ్యతిరేక శక్తులు) భయపడేలా ఉండాలి అని ఆయన అన్నారు. అవసరమైన సమయంలో కఠిన చర్యలు తీసుకోవడానికి పోలీసులు వెనుకాడకూడదని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. కాస్త కఠినంగా, కచ్చితంగా వ్యవహరించడానికి వెనుకాడవద్దు. ఆర్టికల్ 21 గురించి కొందరు గగ్గోలు పెట్టవచ్చు. కానీ అవసరమైన చర్యలు తీసుకోండి అని పోలీసులకు ధర్మాసనం సూచించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను పరిరక్షిస్తుంది.
ఢిల్లీ పోలీసుల తరఫున కోర్టులో హాజరైన సీనియర్ పోలీసు అధికారిని ఉద్దేశించి జస్టిస్ పర్దీవాలా మాట్లాడుతూ, మిమ్మల్ని మేము ఎంతో ఆశతో కోరుతున్నాము. దయచేసి సందర్భానికి తగినట్లుగా బాధ్యతాయుతంగా వ్యవహరించండి. లైంగిక వేధింపులకు లేదా దాడులకు గురైన ప్రతి బాలిక మన సోదరి లాంటిదే. ఇది పోలీసులకు ఒక సవాలు అని పేర్కొన్నారు. మా అంచనాలకు అనుగుణంగా వ్యవహరించండి. కొన్ని లోపాలు ఉన్నాయన్న కారణంతో ఇలాంటివి జరగనివ్వకండి అని జస్టిస్ పర్దీవాలా పోలీసులకు సూచించారు.