న్యూఢిల్లీ: ఆలయ గర్భగుడిలోకి ప్రవేశించడానికి నిరాకరించినందుకు ఓ క్రైస్తవ సైనికాధికారిని ఉద్యోగం నుంచి తొలగించడాన్ని సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. ఆర్మీని లౌకికవాద వ్యవస్థగా అభివర్ణించిన సుప్రీంకోర్టు దాని క్రమశిక్షణలో ఎటువంటి రాజీ ఉండరాదని స్పష్టం చేసింది. మీ సైనికుల మనోభావాలను మీరు గాయపరిచారు అంటూ పిటిషనర్‌పై సుప్రీంకోర్టు మండిపడింది. సంబంధిత ఆర్మీ అధికారి శామ్యూల్ కమలేసన్ తీవ్ర క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినట్లు వ్యాఖ్యానించిన కోర్టు.. ఆయన సైన్యంలో పనిచేయడానికి పనికిరాడని మండిపడింది. 2017లో సైన్యంలో లెఫ్టినెంట్‌గా చేరిన కమలేసన్కు సిక్కు స్కాడ్రన్‌లో చోటు కల్పించారు.
ఆలయంలోకి ప్రవేశించాలని తనపై ఒత్తిడి తీసుకువచ్చి తన మత స్వేచ్ఛను ఉల్లంఘించారని ఆరోపిస్తూ తనపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడాన్ని కమలేసన్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. కాగా, కమలేసన్ ప్రవర్తను అవిధేయతగా చీఫ్ జస్టిస్(సీజేఐ) సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. పింఛను, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు లేకుండా 2021లో భారతీయ సైన్యం నుంచి కమలేసన్ను తొలగించడాన్ని ఢిల్లీ హైకోర్టు 2025 మేలో ఇచ్చిన తీర్పులో సమర్థించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కమలేసన్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరిస్తూ హైకోర్టు తీర్పును సమర్థించింది. ఈ పని చేసినందుకు ఆయనను బయటకు విసిరేయాలి. ఓ సైనికాధికారి చేయకూడని అత్యంత తీవ్రమైన క్రమశిక్షణారాహిత్యం అంటూ ధర్మాసనం వ్యాఖ్యానించింది.