న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో ఖాళీగా ఉన్న న్యాయమూర్తుల ఖాళీల భర్తీకి సుప్రీం కొలీజియం సిఫారసు చేసిన పేర్లలో త్వరలోనే ఐదుగురి పేర్లను ఎంపిక చేస్తామని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. సుప్రీం, హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం చేసిన సిఫారసులను కేంద్రం సుదీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టిన వ్యవహారంపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరుపుతున్నది. శుక్రవారం ఈ విషయాన్ని విచారించిన జస్టిస్ ఎస్కే కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాతో కూడిన ధర్మాసనం ముందు అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి హాజరై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలిపారు. ఐదుగురు న్యాయమూర్తులను అతి త్వరలో నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా కేంద్రం తీరుపై ధర్మాసనం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇది చాలా సీరియస్ అంశమని, కేంద్రం తీవ్ర కాలయాపన చేయటం సరికాదని పేర్కొన్నది. న్యాయస్థానానికి అసౌకర్యం కలిగించే పని చేయరాదని సూచించింది.