Supreme Court | ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై శుక్రవారం విచారణ జరిపిన ధర్మాసనం.. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై విచారణ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఇప్పటికే ఏడుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ నిర్ణయం ప్రకటించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. స్పీకర్ కంటి ఆపరేషన్ చేయించుకున్నారని.. అలాగే సెక్రటరీ జనరల్ మారారని తెలిపారు. దీనివల్ల జాప్యం జరుగుతోందని.. మిగిలిన ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకునేందుకు మరికొంత సమయం ఇవ్వాలని కోరారు. దీనిపై సుప్రీం ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపింది. స్పీకర్‌కు చివరి అవకాశం ఇస్తున్నామని.. రెండు వారాల్లో మిగతా ఎమ్మెల్యేలపై కూడా నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత వేటుపై తీసుకున్న చర్యలపై రెండు వారాల్లో అఫిడవిట్ ఇవ్వాలని సూచించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.