న్యూఢిల్లీ: ధార్‌లోని వివాదాస్పద భోజ్‌శాల-కమల్ మౌలా కాంప్లెక్స్‌ను హిందూ దేవాలయంగా ప్రకటిస్తూ మధ్యప్రదేశ్ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. అయితే ప్రతి శుక్రవారం దేవాలయానికి పక్కన ఉన్న ఖాళీ స్థలంలో ముస్లింలు ప్రార్థనలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఎంపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మీద పలు ముస్లిం పక్షాలు చేసిన అప్పీలుపై ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
ఈ పిటిషన్‌పై తమ సమాధానాలు ఇవ్వాలని కోరుతూ పలు హిందూ పక్షాలకు, కేంద్రం, మధ్యప్రదేశ్ ప్రభుత్వాలకు, ధార్ జిల్లా కలెక్టర్‌కు, పురావస్తు శాఖకు నోటీసులు జారీచేసింది. భోజ్‌శాల ప్రాంగణంలో నమాజ్ చేసుకోవడానికి అనుమతినివ్వడానికి నిరాకరించింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం ఆలయానికి వెలుపల ఉన్న ఖాళీ స్థలంలో ప్రార్థనలు చేసుకోవచ్చని తెలిపింది. పురావస్తు శాఖ పరిరక్షణలో ఉన్న ఈ కట్టడం వాగ్దేవి (సరస్వతి) ఆలయమని మధ్యప్రదేశ్ హైకోర్టు మే 15న తీర్పు వెలువరించింది.