అమరావతి : ఏపీ మద్యం కేసులో ( AP liquor case) సుప్రీంకోర్టు ( Supreme Court) శుక్రవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ హయాంలో మద్యం కొనుగోళ్లలో అవినీతి, అక్రమాలు జరిగాయని వీటిలో అధికారులు కీలకంగా ఉన్నారని ఆరోపిస్తూ ఏపీలో కేసులు నమోదయ్యాయి. ఇందులో భాగంగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది.
విచారణలో పలువురి పేర్లు బయటకు రాగా వీరిలో అప్పటి ప్రభుత్వంలో ఓఎస్డీగా పనిచేసిన కృష్ణ మోహన్‌రెడ్డి( Krishna Mohanreddy) , ధనుంజయరెడ్డి ( Dhanunjay Reddy ) హైకోర్టు ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నారు. హైకోర్టు బెయిల్ నిరాకరించడంతో ఈ తీర్పును సవాల్ చేస్తూ వీరిద్దరూ సుప్రీంకోర్టులో బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
శుక్రవారం వీరి దరఖాస్తును సుప్రీం పరిశీలించి ముందస్తు బెయిల్‌కు నిరాకరిస్తూ పిటిషన్లను కొట్టేసింది. దర్యాప్తు కీలకదశలో ఉన్నందున ముందస్తు బెయిల్ ఇవ్వలేమని విచారణ జరిపిన జస్టిస్ పార్థీవాలా నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. ముందస్తు బెయిల్ ఇస్తే విచారణాధికారి చేతులు కట్టేసినట్లు అవుతుందని వెల్లడించింది.
ప్రస్తుత పరిస్థితుల్లో ముందస్తు బెయిల్ కుదరదని తేల్చి చెప్పింది . అయితే దర్యాప్తులో జాగ్రత్తలు తీసుకోవాలని,థర్డ్ డిగ్రీ చర్యలు ఉండకూదని ధర్మాసనం సూచించింది. రెగ్యులర్ బెయిల్‌కు అప్లై చేస్తే హైకోర్టు, ట్రయల్‌కోర్టులు నిర్ణయించాలని పేర్కొంది.