హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): రోడ్లు, ఫుట్‌పాత్‌లు, పేవ్మెంట్స్ లాంటి బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలను ఏర్పాటు చేయరాదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ మార్గదర్శకాలను అమలు చేయని అధికారుల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇలాంటి అధికారులపై చర్యలు చేపట్టి, సుప్రీంకోర్టు మార్గదర్శకాలు అమలయ్యేలా చూడాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్రశర్మ, జస్టిస్ ఏ రాజశేఖర్‌రెడ్డితో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటైనట్టు తమ దృష్టికి వస్తే.. ఉదాసీనంగా వ్యవహరించిన అధికారులపై సుమోటోగా కోర్టు ధికరణ చర్యలు చేపడతామని హెచ్చరించింది. రోడ్ల పకన రాజకీయ నాయకుల విగ్రహాల ఏర్పాటును నిషేధిస్తూ 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ విచారణను ముగించింది.