హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకానికి సంబంధించిన కేసును సుప్రీంకోర్టు మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. బీఆర్ఎస్ హయాం లో గవర్నర్ కోటా కింద దాసోజు శ్రవణ్, సత్యనారాయణలను నామినేట్ చేస్తూ నాటి రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నది. మంత్రివర్గం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి నాటి గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్‌కు పంపించారు. అయితే, గవర్నర్ సహేతుకమైన కారణాలు లేకుండానే, ఆ నియామకంపై నిర్ణయం తీసుకోకుండా చాలాకాలం తన వద్ద ఉంచుకొని తిరిగి వెనక్కు పంపారు. అప్పటికి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రొఫెసర్ కోదండరాం, అమీర్అలీ ఖాన్ పేర్లను సిఫారసు చేసింది.
దీనిపై అప్పుడే డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు దాసోజు శ్రవణ్, కుర్ర సత్యనారాయణ వాదనలతో ఏకీభవించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సుప్రీంకోర్టులో కేసు ఇంకా పూర్తికాకముందే రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోదండరాం, క్రికెటర్ అజారుద్దీన్‌ల పేర్లను గవర్నర్ కోటాలో సిఫారసు చేసింది. దీనిపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో కేసు వేసింది. మంగళవారం ఈ కేసును సుప్రీంకోర్టులో జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా బెంచ్ విచారణకు స్వీకరించింది. కోదండరాం, అమీర్అలీల నియామకాన్ని రద్దు చేస్తూ గత ఆగస్టు 13న ఇచ్చిన తీర్పు తదుపరి నియామకాలకు అడ్డు కాదని తెలిపింది. విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): శాసనమండలి భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సంబంధిత కాంట్రాక్టర్‌కు స్పష్టం చేశారు. ఆ నిర్మాణ పనులు ఆలస్యమైతే కాంట్రాక్టును రద్దు చేస్తామని పురోగతిపై సమీక్షలో హెచ్చరించారు.