Supreme Court : సీబీఎస్ఈ బోర్డు (CBSE Board) పరిధిలో ప్రస్తుతం ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులకు త్రిభాషా విధానం (Three Language Principle) నుంచి మినహాయింపు ఇవ్వాలని సుప్రీంకోర్టు (Supreme Court) కేంద్రాన్ని ఆదేశించింది. ఈ ఏడాది 7, 8, 9వ తరగతి విద్యార్థులకు కల్పించినట్లుగానే.. ఈ విధానం నుంచి ఆరో తరగతికి కూడా మినహాయింపు ఇవ్వాలని ఆదేశించింది. 2027 ఏప్రిల్ 1 నుంచి త్రిభాషా విధానాన్ని అమలు చేయాలని సూచించింది.
సీబీఎస్ఈ త్రిభాషా విధానంలోని అంశాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఈ ఆదేశాలు జారీచేసింది. అకస్మాత్తుగా సీబీఎస్ఈ భాషా విధానం మార్చడంపై సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఇప్పటికే ఇతర భాషలు ఎంచుకున్న విద్యార్థులు మధ్యలో మరో భాషకు మారాలంటే ఇబ్బందిపడే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ విషయంపై పిటిషన్ దాఖలు చేసిన పాఠశాలలను సంప్రదించి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకోవాలని కేంద్రాన్ని కోరారు. ఇందుకోసం ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆదేశించారు.