న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు ఓ కేసులో కీలక తీర్పును వెలువరించింది. ఒకవేళ అవివాహిత గర్భం దాల్చితే, ఆ గర్భాన్ని 24 వారాల సమయంలోనూ తొలగించుకునే అవకాశాన్ని సుప్రీం కల్పించింది. దీనికి సంబంధించి గురువారం ఓ కేసులో తీర్పునిచ్చింది. ఇష్టపూర్వక సంబంధం వల్ల ఏర్పడిన గర్భాన్ని తొలగించేందుకు అవకాశం ఇవ్వాలని ఆదేశించింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, సూర్య కాంత్, ఏఎస్ బొప్పన్నలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. ఓ అవివాహిత మహిళ తన 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఆ కేసులో సుప్రీం తీర్పునిస్తూ.. ఆ మహిళ సమస్యను పరిష్కరించేందుకు ఇద్దరు డాక్టర్లతో మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించారు.
24 వారాల గర్భాన్ని తొలగిస్తే అప్పుడు ఆ మహిళ ప్రాణాలకు ఏదైనా ముప్పు వాటిల్లుతుందా అని కోర్టు ఆ బోర్డును ప్రశ్నించింది. ఎంటీపీ యాక్ట్ ప్రకారం గర్భాన్ని తొలగించండి అంటూ కోర్టు తన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఎంటీపీ చట్టంలో సవరణ చేయాలని, భర్త స్థానంలో భాగస్వామి అనేపదాన్ని కూడా జోడించాలని కోర్టు సూచించింది. పార్లమెంట్ చట్టం ప్రకారం అవివాహితను చేర్చేందుకు భాగస్వామి అన్న పదాన్ని ఎంటీపీ యాక్ట్‌లో వాడాలని కోర్టు తెలిపింది. అవివాహిత అన్న ఒకే ఒక్క ఉద్దేశంతో ఆమెకు అన్యాయం చేయరాదు అని కోర్టు తన తీర్పులో చెప్పింది.