– రైతు ఉత్పాదక సంస్థల ఏర్పాటుకు సహకారం
– రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా
– నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం, బ్రాహ్మణగూడెంలో బత్తాయి తోటల పరిశీలన
కొండామల్లేపల్లి, ఫిబ్రవరి 19 : బత్తాయి సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర ఉద్యాన శాఖ డైరెక్టర్ యాస్మిన్ బాషా అన్నారు. బత్తాయి రైతులతో రైతు ఉత్పాదక సంస్థ ఏర్పాటు ద్వారా వారికి లాభం చేకూర్చేందుకు ఉద్దేశించి గురువారం నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లి ఉద్యాన పరిశోధన కేంద్రంలో బత్తాయి రైతులతో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో పాల్గొనేందుకు జిల్లాకు వచ్చిన ఆమె గుర్రంపోడు మండలం, బ్రాహ్మణగూడెంలో బత్తాయి రైతు శ్రీనివాస యాదవ్ జీవ ఎరువులను వినియోగించి అధిక దిగుబడులను సాధిస్తున్నారని తెలుసుకుని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్‌తో కలిసి బత్తాయి తోటను పరిశీలించారు.

‘బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి’
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లా బత్తాయి సాగుకు ప్రసిద్ధి అన్నారు. అయితే వివిధ కారణాల వల్ల ఇటీవల కాలంలో జిల్లాలో బత్తాయి సాగు పూర్తిగా తగ్గిపోయిందని, రైతులు పడుతున్న ఇబ్బందులను క్షేత్రస్థాయిలో తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించేందుకు, అలాగే నాబార్డు సహకారంతో రైతు ఉత్పాదక సంస్థలను ఏర్పాటు చేసి రైతులకు మేలు చేసేందుకు, అధిక లాభాలు పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

‘బత్తాయి రైతుల సమస్యల పరిష్కారానికి కృషి’
బత్తాయిలో జీవ ఎరువులు వాడడం వల్ల లాభాలు పెరిగే అవకాశం ఉందని శ్రీనివాస్ యాదవ్ బత్తాయి క్షేత్రాన్ని పరిశీలించిన తర్వాత అర్థమైందన్నారు. అందువల్ల రైతులు బత్తాయి సాగులో సేంద్రీయ ఎరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రైతు శ్రీనివాస యాదవ్ తన 8 ఎకరాల పొలంలో జీవ ఎరువులను ఉపయోగించి బత్తాయి సాగు చేస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఈ సందర్భంగా వర్మి కంపోస్టు, జీవ ఎరువులు, పురుగులను నియంత్రించే మందులను వీరు పరిశీలించారు. ప్రొఫెసర్ ఆరిఫ్ ఖాన్, జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిని, ఉద్యాన అధికారి అనంతరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా, జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ కు రైతులు బత్తాయి, జామ, వాటర్ ఆపిల్ ఫలాలను బహూకరించారు.