హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( Revanth Reddy ) కి బహిరంగలేఖ ( Letter ) రాశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్నా ,ఇప్పటికీ హామీల్లో ( Promises ) 95 శాతం పెండింగ్‌లోనే ఉన్నాయని ఆరోపించారు. ఈ సారైన బడ్జెట్ ( Budget ) లో కేటాయింపులు చేయాలని లేనిపక్షంలో తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేశారు.ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చి వాటి అమలను పక్కన పెట్టారని, ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన రెండు బడ్జెట్లో కేటాయింపులు చేయలేదని ఆరోపించారు. ఆరు గ్యారెంటీలో హామీ ఇచ్చిన మహిళలు, వృద్ధులు, విద్యార్థి, యువత, రైతన్నల కోసం భారీగా నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. డిక్లరేషన్ల పేరుతో హామీలు ఇచ్చిన మేరకు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఈ బడ్జెట్లో నిధులు కేటాయించాలి. ఆయా వర్గాలకు రెండు సంవత్సరాలుగా ఎగ్గొట్టిన హామీలను, కాంగ్రెస్ ఇస్తామని చెప్పిన నిధుల బకాయిలకు ఈ బడ్జెట్లో కేటాయింపులు చేయాలని డిమాండ్ చేశారు. ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం దాని నిలబెట్టుకోవాలన్నారు. ఈసారి కూడా హామీల అమలకు నిధులు కేటాయించకుంటే ప్రజల తరఫున ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామని , మోసకారి కాంగ్రెస్‌ను ప్రజలపక్షాన నిలదీస్తామని హెచ్చరించారు.
బహిరంగ లేఖ పూర్తి పాఠం..
‘ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారికి..నమస్కారం..
2026-2027 సంవత్సరానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతున్న ఈ తరుణంలో 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మీరిచ్చిన హామీల గురించి తెలంగాణ ప్రజల పక్షాన గుర్తుచేసేందుకే ఈ లేఖ రాస్తున్నాను. తెలంగాణ ప్రజలకు ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట మభ్యపెట్టి రెండేళ్లు గడిచినా ఇప్పటికీ అమలుకు నోచుకోని నేపథ్యంలో, కనీసం ఈ సారి బడ్జెట్ లోనైనా అవసరమైన నిధులు కేటాయించాలని కోరుతూ నాలుగు కోట్ల ప్రజల పక్షాన మిమ్మల్ని కోరుతున్నాను.
వృద్ధులు, వితంతువులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్‌ను నాలుగు వేలకు పెంచడానికి ఎన్ని నిధులు కావాలో లెక్కగట్టి ప్రతి పైసాను ఈ సారి బడ్జెట్లో కేటాయించాల్సిన బాధ్యత మీపై ఉంది. అలాగే రాష్ట్ర జనాభాలో సగభాగంగా ఉన్న ప్రతి ఒక్క మహిళకు మహాలక్ష్మి కింద నెలకు రూ. 2500లు అందజేస్తామని హామీ ఇచ్చి 25 నెలలు గడిచినా ఇప్పటికీ ఒక్క లబ్దిదారుకు ఒక్క పైసా దక్కలేదు. అందుకే ఈసారి బడ్జెట్ కేటాయింపుల్లో ఈ గ్యారెంటీ అమలుకు అడుగులు పడకపోతే ఆడబిడ్డలు ఊరుకునే ప్రసక్తే లేదనే విషయాన్ని గుర్తుచేస్తున్నాను. అలాగే కేసీఆర్ గారి హయాంలో తెలంగాణను పంజాబ్ నే తలదన్నేలా, దేశానికే ధాన్యాగారంగా తీర్చిదిద్దిన రైతులకు అందిన రైతుబంధును 15 వేలకు పెంచుతామని మాటిచ్చి మోసం చేసినందుకు ముందు క్షమాపణలు చెప్పి, ఆ మొత్తాన్ని బడ్జెట్ లో కేటాయించాలని అన్నదాతల పక్షాన కోరుతున్నాను. అలాగే ఇప్పటికే మూడుసార్లు పెండింగ్‌లో పెట్టిన రైతుబంధు పాత బకాయిలను కూడా చెల్లించాలన్న రైతుల డిమాండ్‌ను మీ ముందు ఉంచుతున్నాను. అలాగే కౌలు రైతులకు, రైతు కూలీలకు కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వారి ఖాతాల్లో నిధులు జమ చేయాలని కోరుతున్నాను.
కేవలం రైతులు, మహిళలకే కాదు, నిరుద్యోగులకిచ్చిన ప్రతి హామీ కూడా రెండేళ్ల నుంచి పెండింగ్ లోనే ఉంది. తొలి ఏడాదే రెండులక్షల ఉద్యోగాల భర్తీతోపాటు, జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి వంటి హామీల అమలుకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు చేయాలని తెలంగాణ యువతీ యువకుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న ఆర్థిక సహాయం అందజేయడానికి 2026-2027 బడ్జెట్లో తగిన నిధులు కేటాయించాలని కోరుతూ బీఆర్ఎస్ పక్షాన కోరుతున్నాను.
ఈ బహిరంగ లేఖను రాయడానికి ప్రధాన కారణం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చి దాదాపు సగం కాలం పూర్తవుతున్నా, ఇప్పటికీ మీరిచ్చిన హామీల్లో 95 శాతం పెండింగ్ లోనే ఉన్న నేపథ్యంలో.. ఈ సారైన బడ్జెట్లో కేటాయింపులు చేయాలని, లేకపోతే తెలంగాణ సమాజం ఇంకా ఓపికపట్టే ప్రసక్తే లేదని గుర్తుచేస్తున్నాను.
ప్రస్తుతం మీడియాలో, ఇతర మాధ్యమాల ద్వారా వస్తున్న వార్తలు, సమాచారం ప్రకారం రానున్న బడ్జెట్లో కూడా అభయహస్తంలో హామీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలకు నిధుల కేటాయింపు చేస్తున్నట్లు కనబడటం లేదు. ప్రజాపాలన పేరిట మరొక్కసారి ప్రజలను మభ్యపెట్టడానికి, నిట్టనిలువునా మోసగించడానికే సన్నాహాలు చేస్తున్నట్లు కనబడుతోంది. అలాగే పనికిరాని అంశాలను తెరపైకి తెచ్చి ప్రతిసారి అటెన్షన్ డైవర్ట్ చేయాలని మీరు చేస్తున్న కుట్రలు తెలంగాణ సమాజానికి అర్థమైపోయాయి.
2023 ఎన్నికల సందర్భంగా ఏఐసీసీ మాజీ అధ్యక్షులు, ప్రస్తుత లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ అభయహస్తం పేరిట దాదాపు 420 హామీలు ఇచ్చిన విషయాన్ని గాలికొదిలేయడం అత్యంత దుర్మార్గం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలను తూచా తప్పకుండా అమలు చేస్తామని, మొదటి క్యాబినెట్ లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత తీసుకువస్తామని నాడు పీసీసీ అధ్యక్షుడిగా మీరు హామీ ఇచ్చిన విషయాన్ని మీరు మరిచిపోయినట్టు నటించినా, ప్రజలకు మాత్రం అన్నీ గుర్తున్నాయనే విషయాన్ని స్పష్టంచేస్తున్నాను.
ఢిల్లీ నేతల సమక్షంలో మ్యానిఫెస్టోను విడుదల చేయడమే కాకుండా చివరికి ఇంటింటికీ గ్యారెంటీ కార్డులను కూడా పంపిణీ చేసి, ఇన్నేళ్లపాటు దగా చేయడాన్ని తెలంగాణ సమాజం సహించదు. అప్పటి సీఎల్పీ నాయకుడు, ప్రస్తుత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ గ్యారంటీ కార్డులను భద్రంగా దాచిపెట్టుకోవాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ గ్యారంటీ కార్డులో ఉన్న ప్రతి ఒక్క గ్యారంటీని తూచ తప్పకుండా అమలు చేస్తామని చేసిన వాగ్దానానికి ఇన్నాళ్లు పాతరేయడం ప్రజలకు వెన్నుపోటు పొడవడమే.
నాటి గ్యారంటీ కార్డులే ఇవాళ బాకీ కార్డులై మీ పాపాలను ప్రజాక్షేత్రంలో ప్రశ్నిస్తున్నాయి.. ప్రజల నోట్లో మట్టి కొట్టిన మీ పాపాల ప్రక్షాళన జరగాలంటే కనీసం ఈ సారి బడ్జెట్ లోనైనా మ్యానిఫెస్టోలో హామీల ఆధారంగా బడ్జెట్ కేటాయింపులు చేయాల్సిన బాధ్యత మీపై ఉంది. తెలంగాణలోని ఒక్కో అక్క చెల్లెమ్మకే కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా రూ. 62,500 లు బాకీ పడింది. అవ్వ తాతలకు, బీడీ కార్మికులకు నెలకు రూ. 4 వేలు పెన్షన్ చేస్తామన్నారు. కానీ, ఈ 25 నెలల్లో ఒక్కొక్కరికి రూ. లక్ష రూపాయల వరకూ బాకీ పడ్డారు.
దివ్యాంగులను దారుణంగా దగాచేశారు.. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ కింద ఈ రెండేళ్లలో పెళ్లి చేసుకున్న ఆడిబిడ్డల తల్లులందరికీ తులం బంగారం బాకీ పడ్డారు. యువ వికాసం కింద రూ. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇవ్వనే లేదు. విద్యార్థినులకు స్కూటీలు రానేలేదు. ఫీజు రీయింబర్స్మెంట్ కూడా వేల కోట్లు బాకీ పేరుకుపోవడంతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడే ప్రమాదం పొంచి ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే 42 పేజీల అభయహస్తం మేనిఫెస్టోలోని 420 హామీల్లో 5 శాతం కూడా అమలు చేయకుండా తెలంగాణ ప్రజలను దగా చేసిన ఘనచరిత్ర కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ( KCR ) గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతుల కోసం అనేక ప్రతిష్ఠాత్మక పథకాలు అమలుచేసిన విషయం గుర్తుచేస్తున్నాను. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఖరీఫ్, రబీ సీజన్లు ప్రారంభానికి ముందే క్రమం తప్పకుండా రైతుబంధును వారి ఖాతాల్లో నేరుగా జమ చేసిన విషయం మీకు గుర్తులేనట్టు నటించినా , తెలంగాణలోని ప్రతి రైతుకు గుర్తుంది.
ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలకు ముందు మీరు ఓ సభలో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలు ముగిసిన వెంటనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేస్తామని వాగ్దానం చేశారు. మున్సిపల్ ఎన్నికలు ముగిసి 10 రోజులు కావొస్తున్నా ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కాలేదు. మీ ప్రకటనలన్నీ గాలి మాటలేనని, ప్రజలను మోసం చేయడమే కాంగ్రెస్ సర్కారు నైజమని అని మరొకసారి రుజువైంది.
హైదరాబాద్ యూత్ డిక్లరేషన్‌లో అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీని మాట మార్చి ఐదేళ్లలో భర్తీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొనడం నిరుద్యోగ యువత గొంతుకోయడమే . అంతేకాదు నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 4 వేల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న వాగ్దానాన్ని పూర్తిగా గంగలో కలిపి ఇప్పటివరకు నయా పైసా కూడా చెల్లించకుండా యువతను మోసగించారు. కేసీఆర్ గారి హయాంలో నియామకప్రక్రియ పూర్తిచేసిన వాటికి కాగితాలిచ్చి ఫోటోలకు ఫోజులివ్వడం తప్ప పట్టుమని పదివేల కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం అత్యంత దారుణం.
ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ప్రతి ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ. 12 వేల ఆర్థిక సహాయం అందజేస్తామని, ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సామాజిక భద్రత కల్పిస్తామన్నారు. ఈ రెండేళ్లలో ఈ హామీల అమలుకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఉపాధి లేక రోడ్డునపడ్డ ఒక్కోఆటో డ్రైవర్ కు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 24 వేలు బాకీ పడిన నేపథ్యంలో.. ఆ బకాయిలను కూడా ఈ బడ్జెట్ లో కేటాయించాలని కోరుతున్నాను.
అభయహస్తంలో పొందుపరిచిన గ్యారెంటీలు, 420 హామీల అమలుకు ఎన్ని నిధులు అవసరమో ప్రకటించి బడ్జెట్ లో ప్రతి పైసాకు లెక్క కట్టాలని తెలంగాణలోని సకల జనుల తరపున డిమాండ్ చేస్తున్నాను. 2026-2027 బడ్జెట్లో మరోసారి 6 గ్యారెంటీలు, 420 హామీలు, డిక్లరేషన్ల కింద ఇచ్చిన వాగ్దానాల అమలుకు తగిన నిధులు కేటాయించకపోతే, ఎక్కడికక్కడ మోసకారి కాంగ్రెస్ ను ప్రజలపక్షాన నిలదీస్తామని గుర్తుచేస్తున్నాను. తెలంగాణ ప్రజాగ్రహానికి ముఖ్యమంత్రితోపాటు, మంత్రులు ప్రజాక్షేత్రంలో తిరగలేరనే విషయాన్ని కూడా స్పష్టంచేస్తున్నాను.’ అని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు.