చలికాలం.. చర్మానికి గడ్డుకాలం. చల్లదనానికి చర్మం పొడిబారుతుంది. మెరుపును కోల్పోతుంది. దీనికి విరుగుడు ‘సున్నిపిండి’. ముఖ్యంగా ఆడవాళ్లు, చిన్నారుల సున్నితమైన చర్మానికి ‘సున్నిపిండి’ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని పోషకాలు చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. సున్నిపిండి తయారీలో ఉపయోగించే శనగ పిండి, పెసర పిండి, బియ్యప్పిండి.. చర్మాన్ని సంరక్షిస్తాయి. పసుపు, తులసి ఆకులు, వేపాకుల్లోని యాంటి బ్యాక్టీరియల్ గుణాలు.. చర్మంపై ఉండే ఫంగస్, బ్యాక్టీరియాను తొలగిస్తాయి. సున్నిపిండిలో వాడే గులాబీ రేకులు.. ట్యాన్‌ని తగ్గిస్తాయి. నిమ్మరసం, పాలు.. చర్మం జిడ్డుగా మారకుండా కాపాడుతాయి. దీనిలో వాడే సహజ నూనెలు.. మాయిశ్చరైజర్‌గా పనిచేస్తాయి. చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి. ‘సున్నిపిండి’తో చర్మాన్ని రుద్దడం వల్ల మురికి తొలగిపోవడంతోపాటు రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. చర్మం కొత్తకాంతిని సంతరించుకుంటుంది. ప్రతిరోజూ సున్నిపిండితో స్నానం చేయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. మొటిమలు, ముడతలు తగ్గి.. చర్మం యవ్వనంగా కనిపిస్తుంది.
శనగ పప్పు – పావు కేజీ
పెసర పప్పు – పావుకేజీ
ఉలవలు – పావు కేజీ
ముల్తానీ మట్టి- పావుకేజీ
పసుపు- 50 గ్రా.
వేపాకులు- 50 గ్రా.
తులసి ఆకులు- 50 గ్రా.
గులాబీ రెక్కలు- 50 గ్రా.
నారింజ తొక్కలు- 50 గ్రా.
మెంతులు- 30 గ్రా.
బియ్యప్పిండి- 50 గ్రా.
గోధుమ పిండి- 50 గ్రా.
బాదం పప్పులు- నాలుగు
ముందుగా సేకరించిన పప్పులన్నిటినీ ఎండలో బాగా ఎండబెట్టాలి. తరువాత మెత్తని పిండిలా మర పట్టించి.. అన్నిటినీ కలగలుపుకోవాలి. ఆ తర్వాత బాదం పప్పులు, వేపాకులు, మెంతులు, తులసి ఆకులు, గులాబీ రెక్కలు, నారింజ తొక్కలు, ముల్తానీ మట్టిని కూడా ఎండబెట్టి.. మెత్తని పొడిగా చేసుకోవాలి. వీటన్నిటితోపాటు గోధుమ పిండిని కూడా ఒకసారి జల్లెడ పట్టుకోవాలి. వీటికి బియ్యప్పిండి జతచేయాలి. పొడులన్నీ బాగా కలుపుకొని.. గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.