(గుండాల కృష్ణ)
Sunkishala | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): నాగార్జునసాగర్ జలాశయం డెడ్‌స్టోరేజీ ఆధారంగా హైదరాబాద్‌కు కృష్ణాజలాల తరలింపు కోసం చేపట్టిన సుంకిశాల పథకంలో పెను ప్రమాదం తప్పింది. పథకంలో భాగంగా సొరంగాల్లోకి సాగర్ జలాలు రాకుండా ఉండేందుకు రక్షణగా నిర్మించిన కాంక్రీట్ గోడ (రిటెయినింగ్ వాల్) ఒక్కసారిగా కుప్పకూలడంతో సుంకిశాల పంపుహౌస్ నీట మునిగింది. నిత్యం వందమందికిపైగా కూలీలు పని చేసే ఆ ప్రదేశం కండ్ల ముందే క్షణాల్లో జలదిగ్బంధమైంది. ఇక్కడ మూడు షిఫ్టుల్లో వందల మంది కూలీలు పనిచేస్తుంటారు.
సరిగ్గా కూలీలు షిఫ్టు మారే సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడంతో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదు. ఈ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు ఈ ఘటన చోటుచేసుకున్నప్పటికీ, జలమండలి అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. అర గంట ముందు… ఆర గంట తర్వాతగానీ ఈ ప్రమాదం జరిగి ఉంటే భారీగా ప్రాణ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని ప్రత్యక్షసాక్షులు భయంభయంగా చెప్తున్నారు. నాగార్జునసాగర్‌కు లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, నీటిమట్టం కూడా భారీగా ఉన్న సమయంలో రక్షణ గోడ వెనక గేటును ఏర్పాటు చేసి… సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు భావిస్తున్నారు. గేటు ఏర్పాటు పనులు పూర్తిస్థాయిలో చేయలేదని తెలుస్తున్నది. సాగర్‌లో నీటిమట్టం భారీగా తగ్గిన తర్వాతగానీ సుంకిశాల పనులు మొదలయ్యేలా లేవు. ఎండకాలం వరకు పనులు చేపట్టే అవకాశం లేదని స్పష్టమవుతున్నది.
హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం జలమండలి రోజుకు 270 మిలియన్ గ్యాలన్ల కృష్ణాజలాలను తరలిస్తున్నది. ఇందుకోసం నాగార్జునసాగర్ నుంచి జలాలను ఏఎమ్మార్పీ ద్వారా అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు ఎత్తిపోస్తారు. అక్కడి నుంచి కోదండాపూర్ వద్ద నిర్మించిన నీటిశుద్ధి కేంద్రంలో శుద్ధి చేసిన తర్వాత పైప్లైన్ల ద్వారా నగరానికి తరలిస్తారు. అయితే నాగార్జునసాగర్‌లో కనీసంగా 510 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఏఎమ్మార్పీ మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయడం సాధ్యమవుతుంది. అందుకే తరచూ వేసవిలో అత్యవసర మోటర్ల ద్వారా నీటిని పంపింగ్ చేయాల్సిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో నాగార్జునసాగర్ జలాశయ డెడ్‌స్టోరేజీ సుమారు 492 అడుగుల నీటిమట్టం నుంచి కూడా జలాలను తరలించేందుకు వీలుగా సుంకిశాల పథకాన్ని చేపట్టారు. వాస్తవానికి ఇది 1980 దశకంలో రూపొందించిన పథకం కాగా.. స్థానిక రైతుల ఆందోళనలతో పక్కకుపెట్టారు. 2001-03లో చంద్రబాబు హయాంలో సుంకిశాల పథకాన్ని పక్కనపెట్టి, ఏఎమ్మార్పీ ద్వారా నగరానికి కృష్ణాజలాల తరలింపు పథకం మొదటి దశ పనులను పూర్తి చేశారు. అనంతరం కాలక్రమేణా మరో రెండు దశలు పూర్తయినా… సుంకిశాల పట్టాలెక్కలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.2,215 కోట్లతో ఈ పథకం పనులు మొదలయ్యాయి. గత ఏడాది డిసెంబర్ వరకు పనులు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులు మందకొడిగా సాగుతున్నాయి.
నీటిమట్టం పెరిగేకొద్దీ పెరిగిన ఒత్తిడి
నాగార్జునసాగర్ డెడ్‌స్టోరేజీ నుంచి సొరంగ మార్గం ద్వారా సుంకిశాల వద్ద నిర్మించిన పంపుహౌజ్ వరకు నీటిని తరలించి, అక్కడ మోటర్లతో లిఫ్టు చేసి, పైప్లైన్ల ద్వారా కోదండాపూర్ వరకు జలాలను తరలించడమనేది ఈ పథకం స్వరూపం. నాగార్జునసాగర్‌లో నీటిమట్టం ఆధారంగా తెరిచేందుకుగాను మూడు స్థాయిల్లో (ఒక్కో లెవల్లో ఒక్కోటి చొప్పున) మూడు సొరంగ మార్గాలను నిర్మించారు. అయితే మొత్తం పథకం పనులు పూర్తయి, మోటర్లను బిగించిన తర్వాత సొరంగాలను వంద శాతం పూర్తి చేస్తారు. అప్పటివరకు నాగార్జునసాగర్ వైపు కొంతమేర తవ్వకుండా వదిలివేస్తారు. తద్వారా సాగర్‌లోని నీళ్లు సొరంగంలోకి రాకుండా ఉంటాయి. అదేవిధంగా సొరంగాల ద్వారా పంపుహౌజ్‌లోకి నీళ్లు వచ్చే ప్రాంతంలో ముందు జాగ్రత్త చర్యగా భారీస్థాయి రక్షణ గోడ (రిటెయినింగ్ వాల్) నిర్మించారు. ఇప్పటికే పథకంలో భాగంగా సుంకిశాల నుంచి కోదండాపూర్ వరకు పైప్‌లైన్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.
ఎనిమిది మీటర్ల డయా (వ్యాసం)తో సొరంగ నిర్మాణ పనులు కూడా పూర్తయ్యాయి. 82 మీటర్ల లోతులో ఉన్న పంపుహౌజ్‌లో మోటర్ల ఏర్పాటుకుగాను ప్రాథమిక పనులను ఇటీవల మొదలుపెట్టారు. రానున్న రెండు నెలల్లోనే కొన్ని మోటర్ల ద్వారా నీటిని ఎత్తిపోయాలనే ఉద్దేశంతో అధికారులు పది, పదిహేను రోజుల కిందట మధ్యస్థాయిలో ఉన్న సొరంగంలో రక్షణగోడకు వెనక భాగాన గేట్‌ను అమర్చారు. ఎలాగూ గేటు, రక్షణ గోడ ఉన్నదనే భావనతో ఆ సొరంగాన్ని పూర్తిస్థాయిలో ఓపెన్ చేశారు. దీంతో సాగర్‌లో రోజురోజుకీ నీటిమట్టం పెరుగుతుండటంతో గేటుపై జలాల ఒత్తిడి తీవ్రమైంది. ఈ పరిణామాన్ని ఇంజినీర్లు సరిగ్గా అంచనా వేయలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
క్షణాల్లోనే కుప్పకూలిన గోడ
పంపుహౌజ్‌లో ప్రస్తుతం మోటర్ల బిగింపునకు సంబంధించిన సివిల్ పనులు జరుగుతున్నట్టు తెలిసింది. ఇందుకోసం పంపుహౌజ్‌లో వందమందికిపైగా కార్మికులు పని చేస్తున్నారు. మూడు షిఫ్టుల్లో ఈ సంఖ్యలోనే కార్మికులు ఉంటారు. ఉదయం ఆరు గంటలకు పనిలోకి వచ్చిన వారు సాయంత్రం ఆరు గంటలకు, అప్పుడు పనిలోకి వచ్చిన వారు మరుసటి రోజు ఉదయం ఆరు గంటలకు పని నుంచి వెళ్లిపోతారు. ఈ క్రమంలో ఈ నెల ఒకటో తేదీన ఉదయం ఆరు గంటలకు వందమందికిపైగా కార్మికులు షిఫ్టు ముగించుకొని పంపుహౌజ్ నుంచి వాహనంలో బయటికి వస్తున్నారు.
వారు పంపుహౌజ్ నుంచి బయటికి వచ్చిన సమయంలోనే పెద్ద పెద్ద శబ్దాలతో ఒక్కసారిగా రక్షణ గోడ కుప్పకూలిపోయింది. అంటే సొరంగంలో నుంచి కృష్ణాజలాలు ఉవ్వెత్తున ఎగిసి వచ్చి గేటును తన్నుకొని, రక్షణ గోడను కూల్చి పంపుహౌజ్‌లోకి తన్నుకొచ్చాయి. షిఫ్టు మారే సమయం కావడంతో అప్పటివరకు పని చేసిన కార్మికులు వెళ్లిపోతున్నారు… వచ్చే వారు ఇంకా రాలేదు. అర గంట ముందైనా, తర్వాతనైనా ఈ ఘటన జరిగి ఉంటే ప్రాణ నష్టం భారీగా ఉండేదని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు. కండ్ల ముందే రక్షణ గోడ కుప్పకూలి పంపుహౌజ్ మొత్తం జలమయం అయిందని తెలిపారు. అప్పటికే అందులో ఒక భారీ క్రేన్, టిప్పర్లు, ఇతర పరికరాలు ఉన్నట్టు తెలిసింది. దీంతో రూ.కోట్లల్లోనే నష్టం వాటిల్లినప్పటికీ, అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
అంచనా లోపంతోనే ప్రమాదమా?
ప్రమాదం జరగడం వెనక ఇంజినీర్లు అంచనా లోపమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వాస్తవానికి నాగార్జునసాగర్‌లో ఇంతస్థాయిలో నీటిమట్టం ఉండటంతోపాటు లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతున్న సమయంలో సొరంగం పూర్తిస్థాయిలో ఓపెన్ చేయకుండా ఉండాల్సిందని పలువురు సూచిస్తున్నారు. ఆ సమయంలో సాగర్‌లో సుమారు 528 అడుగుల నీటిమట్టం ఉండటంతోపాటు శ్రీశైలం నుంచి రెండు లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చి చేరుతున్నది. ఈ సమయంలో దాదాపు 462-580 అడుగుల స్థాయిలో ఉండే సొరంగంలో గేటు అమర్చి, పూర్తిస్థాయిలో ఓపెన్ చేయడం వల్లనే జలాల ఒత్తిడికి అవి తాళలేకపోయాయని ప్రత్యక్షసాక్షులు చెప్పారు. మరోవైపు మిడిల్ టన్నెల్లో రక్షణ గోడ వెనక గేటు అమర్చిన అధికారులు… పంపుహౌజ్ స్లాబ్ పూర్తయిన తర్వాత దాని నుంచి గేటుకు టైబీమ్స్ నిర్మించాల్సి ఉన్నదని, ఆ పనులు పూర్తయిన తర్వాత సొరంగం పూర్తిస్థాయిలో ఓపెన్ చేస్తే బాగుండేదని మరికొందరు ఇంజినీర్లు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి సాగర్‌లో ఇంత నీటిమట్టం, ఈస్థాయి వరద ఉన్న సమయంలో చేపట్టాల్సిన ప్రక్రియ కాదని మాత్రం పలువురు చెప్తున్నారు. పంపుహౌజ్‌లో పూర్తిస్థాయిలో నీళ్లు ఉండటం, మరోవైపు నానాటికీ సాగర్‌లో నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండటంతో రానున్న సమీప కాలంలో పంపుహౌజ్ ఖాళీ అయ్యే అవకాశం లేదు. ఎగువ నుంచి వస్తున్న వరదల వల్ల ఈసారి సాగర్ పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉన్నది. దీంతో వచ్చే ఎండాకాలంలోగానీ ప్రాజెక్టులో నీటిమట్టం 510 అడుగులకు దిగిరాదు. ఆ సమయంలో మాత్రమే పంపుహౌజ్‌లో నీటిని ఖాళీ చేసే అవకాశం ఉంటుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. ఇలా కాకుండా అధునాతన పద్ధతుల్లో భారీ మోటర్ల ద్వారా నీటిని తోడాలన్నా… ముందుగా సొరంగంలోకి నీళ్లు రాకుండా అడ్డుకట్ట వేయడమనేది పెను సవాల్వంటిదని అంటున్నారు. ఘటన జరిగి వారం రోజులైనా జలమండలి అధికారులు మాత్రం విషయాన్ని బయటికి పొక్కనీయకుండా గోప్యంగా ఉంచారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ సంబంధిత ఇంజినీర్లు అందుబాటులోకి రాలేదు.