e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, January 26, 2022
Home News ఈవారం కథ : ఊషర క్షేత్రం

ఈవారం కథ : ఊషర క్షేత్రం

నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజా గ్రంథాలయం సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2020’లో ప్రచురణకు ఎంపికైన కథ.

“ఈ మధ్య వార్తాపత్రికల్లోనూ, టి.వి.ల్లోనూ ‘వాటర్‌ షెడ్‌’ పథకాల గురించి చూస్తున్నాం కదా! వాటిని మన గ్రామంలో అమలుపరచి, మనం ఏమన్నా అలా మన ఊరికి ఉపయోగపడగలమా! అని బుర్ర తొలిచేస్తుంటే నీ దగ్గరికి వచ్చాను. మన గ్రామానికి మనం ఏదో ఒకటి చెయ్యాలిరా.”

- Advertisement -


‘మంచివారి స్నేహం’లా నీడలు పొడుగ్గా సాగుతున్నాయి.
కంకర రోడ్డు మీదుగా లేచిన ‘గోధూళి’ ఎర్రగా పరుచుకుంటోంది.
“రావోయ్‌! పార్థసారథి రా!” అంటూ కుర్చీ చూపించి..
“ఏమోయ్‌! సారథి వచ్చాడు కాఫీ పెట్టు” అని లోనికి కేకేశాడు లక్ష్మీపతి.
“అన్నయ్యా! బావున్నారా? ఎవరన్నా ఇంటికొస్తే చిన్న పిల్లాడైపోతారనుకో!”.. పైటచెంగుతో చేతులు తుడుచుకుంటూ వచ్చింది వసుంధర.
“ఆ అది.. ఇంకోసారి కాఫీ తాగొచ్చని చెల్లెమ్మా!” నవ్వుతూ మేలమాడాడు సారథి.
“ఊరుకోవోయ్‌! నువ్వు మరీను. ఏదో నాలుగిళ్లవతల నుంచి కష్టపడి మేనీడ్చుకొచ్చి అలసిపోయావని కాఫీ ఇద్దామనుకుంటే.. నువ్వు మీ చెల్లెమ్మ పక్షాన చేరిపోయావు” మూతి బిగించి అన్నాడు లక్ష్మీపతి.
“సరేలెండి! మీ ఇద్దరికీ ఎప్పుడూ ఉన్నదేగా!” అని నవ్వుతూ లోనికెళ్లింది వసుంధర.
“ఆఁ.. ఏంటోయ్‌! నిన్న మంచి వర్షం పడిందిగా! పొలంవేపు ఏమన్నా వెళ్లావా?”.
“వర్షం అంటే వర్షమా! రెండు ‘మడికట్ల వాన’ పడింది. కానీ ఏం లాభం? ఒక్కచుక్క నిలవలేదు. అంతా కిందికే పోయింది. ఈ ఊరి గ్రహచారమే అంత”.. సారథి మాటల్లో నైరాశ్యం తొంగిచూసింది.
“ఎందుకంత బాధ పడతావు? మన ఒక్కరి పొలాలే కాదు, ఊరంతా అలానే ఉంది కదా!”.
“అవునురా పతీ! దశాబ్దాలుగా ఇలానే ఉంది. ఎదుగూ బొదుగూ లేకుండా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్లుగా”.. మరింత విరక్తితో అన్నాడు సారథి.
“దీని భౌగోళిక పరిస్థితికి మనమేం చేయగలం చెప్పు”

అది ఓదార్పో.. లేక నిరాశో మరి.
“అన్నయ్యా.. కల్యాణ్‌ ఫోన్‌ చేస్తున్నాడా?” కాఫీ కప్పు అందిస్తూ అడిగింది వసుంధర.
“చేస్తున్నాడమ్మా. ఏమిటో ఈ పరుగులు? ఒక్కగానొక్క కొడుకు. వందలమైళ్ల దూరం. వాళ్లిక్కడికి రాలేరు. మనం అక్కడ ఇమడలేం”.. దీర్ఘంగా నిట్టూర్చాడు సారథి.
“సర్లేరా! మనిద్దరివీ రైలు పట్టాల్లా సమాంతరంగా సాగిన జీవితాలు. ఇద్దరం ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగి, ఇక్కడే చదువుకున్నాం. ఉద్యోగం పేరుతో నువ్వు, కాంట్రాక్టర్‌ అవతారం ఎత్తి నేను.. పట్టణాల బాట పట్టాం. మన ఆశల్ని చంపుకొని, పిల్లల మీద ఆశలు పెంచుకొని వాళ్లను మోశాం. రెక్కలొచ్చాక.. ఇప్పుడిక
మన రెక్కల అవసరం లేదని ఎగిరిపోయారు. మనకు సాయంత్రం అయింది. భూమి గుండ్రంగా ఉంది అన్నట్లు మనం తిరిగి మన గూటికే చేరుకున్నాం ప్రశాంతంగా! ఇంతకూ ఏదో చెబుదామని వచ్చినట్లున్నావు. చల్లకొచ్చి ముంత దాచడమెందుకు చెప్పు” నవ్వుతూ అన్నాడు లక్ష్మీపతి .
“ఏం లేదురా పతీ.. ఇందాకే చెప్పాను కదా! ఉదయం పొలానికి వెళ్తే భూమి తడిగా ఉందికానీ ఎక్కడా నీరు నిలవలేదు. అంత వానా ఎక్కడికి పోయిందో మరి. ప్రాణం ఉసూరుమంటోంది. ఈ మధ్య వార్తాపత్రికల్లోనూ, టివీల్లోనూ ‘వాటర్‌ షెడ్‌’ పథకాల గురించి చూస్తున్నాం కదా! వాటిని మన గ్రామంలో అమలుపరచి, మనం ఏమన్నా అలా మన ఊరికి ఉపయోగపడగలమా! అని బుర్ర తొలిచేస్తుంటే నీ దగ్గరికి వచ్చాను. మన గ్రామానికి మనం ఏదో ఒకటి చెయ్యాలిరా. మన జీవిత సాయంసంధ్యని ఈ గ్రామ ఉదయసంధ్యగా మార్చలేమా? అవసరమైతే నా ఆస్తి మొత్తాన్నీ ఖర్చుచేయడానికి సిద్ధమే!”.. సారథి ప్రతిమాటలోనూ ఆవేదన, గ్రామంపట్ల ఆరాధన లక్ష్మీ
పతిని కుదిపేస్తున్నాయి.


‘ఆ పల్లెటూరిలో ఏముంది డాడీ? ఎప్పుడూ కలవరిస్తుంటారు?’.. కొడుకు సుదర్శన్‌ ఈ
సడింపు చెవుల్లో మోగుతోంది.
‘గ్రామానికి ఏదో ఒకటి చెయ్యాలిరా..’
సారథి పరివేదన.
‘పుట్టిన ఊరికి సేవ చేసే అదృష్టం అందరికీ రాదు’.. వసుంధర ప్రోత్సాహం.
భోజనం చేసి, మంచంపై మేను వాల్చినా.. ఆ ఆలోచనల్లో పరిభ్రమిస్తూనే ఉన్నాడు లక్ష్మీపతి. మంచం దిగి, వెంటనే లాప్‌టాప్‌ తెరిచాడు.
***
తొలకరి నుండి కురుస్తున్న వర్షాలతో భూమి ఆకుపచ్చ తివాచీ పరుచుకొంది. మెత్తని గడ్డి పాదాలకు మృదువుగా తగులుతోంది. లక్ష్మీపతి, పార్థసారథి పాత జ్ఞాపకాలను తవ్వుకుంటూ పొలం గట్ల వెంట తిరుగుతున్నారు. పంచాయతీ ప్రెసిడెంట్‌ మహాలక్ష్మి నాయుడు, నీటిపారుదల ఏఈ మాధవరావు మరికొంతమంది గ్రామ
పెద్దలు వారితో మధ్యమధ్యలో ఏవేవో గుణించుకుంటూ చర్చలు సాగిస్తూ నడుస్తున్నారు. వాననీరు నేలపై కాలువలుగా మారి విడిచిన నీటి జాడలను గమనిస్తూ.. నడుస్తున్నాడు మాధవరావు.
ఉదయం ప్రారంభమైన వారి నడక.. మధ్యాహ్నం ఒక గమ్యానికి చేరింది. ఆలోచనలు ఒక రూపానికి ఆకారాన్ని కూర్చసాగాయి. దారిలో మైదానంగా మారిన చేలలో ఊరి యువకులు క్రికెట్‌ ఆడుతున్నారు. మధ్యలో నడుస్తున్న వీళ్లను చూసి కొద్దిసేపు ఆట ఆపి, మళ్లీ తమ ఆటలో మునిగిపోయారు.
అందరూ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడికి గ్రామపెద్దలు కూడా చేరారు. అందరినీ ఉద్దేశించి పార్థసారథి మాట్లాడటం మొదలుపెట్టాడు.
“అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు.. మనందరం ఇప్పుడు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో. మన గ్రామానికి అనేక సమస్యలున్నాయి. ముఖ్యంగా నీటి సమస్య. ఆధునిక పద్ధతులను ఉపయోగించుకొని, వినూత్నంగా ఆలోచిస్తూ చౌడుబారిన ఊషర క్షేత్రాలను కూడా సస్యశ్యామలం చేసుకుంటున్నాయి చాలా గ్రామాలు. మరి ‘మనం మన గ్రామానికి ఏమీ చేయలేమా?’ అని లక్ష్మీపతితో నా ఆలోచనలను పంచుకున్నాను. ఇద్దరమూ కలిసి ‘వాటర్‌ షెడ్‌’ పథకాల గురించి పరిశోధించాం. ఆ తరువాత ప్రెసిడెంట్‌తో కలిసి నీటిపారుదల శాఖ అధికారులను సంప్రదించాం. మన ఉత్సాహాన్ని గుర్తించి ఈ రంగంలో నిపుణులైన మాధవరావును పంపారు. గ్రామ నైసర్గిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఒక ‘రూట్‌ మ్యాప్‌’ను తయారు చేశాం. అందరి సహకారంతో మన గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా మలుచుకుందాం” ఉద్వేగంగా చెప్పాడు సారథి.
తరువాత మరిన్ని విషయాలు చర్చించి కార్యాచరణ ప్రణాళికను తయారు చేసుకున్నారు. ఆ సమావేశం అక్కడున్న అందరిలోనూ నూతనోత్తేజం కలిగించింది. మబ్బు తెరల చాటు నుంచి సూర్యుడు ఒక్కసారి తళుక్కుమన్నాడు.


ఒక్క అడుగు.. గ్రామ ప్రగతివైపు.
గ్రామంలో చైతన్యం రాజుకుంది. మాధవరావు సూచనల ప్రకారం వాననీరు నిలవడానికి అనువైనచోట కందకాలు తవ్వి, గట్లు కట్టారు. ఇండ్లలోనూ ఇంకుడు గుంతలు తీయించారు.
ఊరిలో ఓ కొత్త ఉత్తేజం కదను తొక్కుతోంది. ఓ రోజు లక్ష్మీపతి, పార్థసారథి ఏదో విషయాన్ని చర్చించుకొంటున్నారు కాఫీ తాగుతూ.
అదే సమయంలో కొంతమంది యువకులతో కలసి వచ్చాడు గ్రామపెద్ద పురుషోత్తమరెడ్డి కొడుకు శ్రీహరి.
“ఏంటోయ్‌ శ్రీహరి! ఈరోజు క్రికెట్‌ ఆటకు వెళ్లలేదా? అందరూ కలసి ఇటొచ్చారు?” చిరునవ్వుతో అన్నాడు సారథి.
“ఆ ఆట ఎప్పుడూ ఉండేదే అంకుల్‌. మీతో మాట్లాడదామనే వచ్చాం” అన్నాడు శ్రీహరి .
“అవునండీ.. పాతికేళ్లు ఊరికి దూరంగా ఉండి వచ్చిన మీరే గ్రామం గురించి ఇంత పాటుపడుతుంటే.. పాతికేళ్లుగా గ్రామంలో ఉండి కూడా ఏమీ పట్టనట్లు మా ఆటలు మేం ఆడుకోవటం గిల్టీగా అనిపిస్తోంది. మేం కూడా మీతో చేయి కలుపుతాం. చెప్పండి ఏం చేయాలో” ఆవేశంగా అన్నాడు మురహరి అనే యువకుడు.
“మీలో ఈ ఆలోచన వచ్చినందుకు సంతోషం అబ్బాయిలూ! చేయీ చేయీ కలిస్తే ఏదైనా సాధించొచ్చు” అన్నాడు లక్ష్మీపతి.
“సార్‌.. మీరు రైతుల గురించి ఆలోచిస్తున్నారు బాగుంది. అలాగే మన ఊరి గ్రంథాలయాన్ని కూడా పునరుద్ధరిస్తే మేం ఊరికే ఊసుపోని ఆటలు మాని పోటీ పరీక్షలకు ప్రిపేర్‌ అవుతాం” అన్నాడో యువకుడు ఆవేదనతో.
“అవును సార్‌.. స్టడీ మెటీరియల్‌ అందుబాటులో ఉంటే మాకు ఎంతో ఉపయోగపడుతుంది”.. ఇంకో యువకుని అభ్యర్థన.
“మరి మన ఊరి గ్రంథాలయానికి భవనం లేకనే కదా.. పంచాయతీ కార్యాలయంలో ఒక మూల గదిలో పెట్టారు?” అనుమానం వ్యక్తం చేశాడు లక్ష్మీపతి.
“అవును సార్‌. అదేకదా మా బాధ. అసలే ఆ గది చీకటి గుయ్యారంలా ఉంటుంది. దానికితోడు ఎప్పుడూ ఎవరో ఒకరు వస్తూపోతూ ఉంటారు. ఇంక ఏకాగ్రత ఏం ఉంటుంది?” నిరాసక్తంగా అన్నాడు శైలేశ్‌.
‘ఏం చేద్దాం?’ అన్నట్లు పార్థసారథి వైపు చూశాడు లక్ష్మీపతి.
“ఇదీ ఆలోచించాల్సిందే! సరే.. దానికీ ఒక మార్గం చెబుతాను. మా ఇల్లు పైపోర్షన్‌ ఎలాగూ ఖాళీగా ఉంది. మావాడు వచ్చినప్పుడు తడుముకోకుండా ఉంటుందని కట్టించాను. వాడు ఎప్పుడో ఏడాదికోసారి వస్తాడు. అప్పటి సంగతి అప్పుడే చూసుకోవచ్చు. అందాక దాన్ని గ్రంథాలయంగా చేసుకుందాం. ఏమంటావు?” అప్పటికప్పుడే తన ఆలోచనను చెప్పాడు సారథి.
“సరే అయితే! అవసరమైన మోడిఫికేషన్స్‌ ఏమన్నా ఉంటే చేద్దాం” అన్నాడు లక్ష్మీపతి.
యువకులందరూ చప్పట్లు కొట్టారు ఆనందంతో. మనసుంటే.. మార్గాన్ని చూపుతుంది.
అందరి సహకారంతో కావలసిన కుర్చీలు, బెంచీలు, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలతోపాటు జనరల్‌ నాలెడ్జ్‌, పిల్లల పుస్తకాలు కూడా కొలువయ్యాయి అక్కడ.
‘ఈ పయనం ఆగదు’, ‘ఆకాశం మన హద్దు’, ‘ఎవరో వస్తారని ఎదురు చూడొద్దు’, ‘నీ భవిత నీ చేతుల్లోనే’.. మొదలైన సూక్తులు గ్రంథాలయ గదిలో గోడలను అలంకరించి, కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉన్నాయి నిరంతరం. గ్రామాభ్యుదయంలో మరో అంకం చేరింది.
గ్రామంలో ఉన్న పాఠశాలలు కూడా జవసత్వాలు పుంజుకుని, చదువుల గుడులుగా మారాయి. ఎంత దూర ప్రయాణానికైనా మొదటి అడుగే ముఖ్యం. అది పడిన తరువాత గమ్యం అదే చేరువ అవుతుంది.


విజయం ఒక గమ్యం కాదు. విజయం ఒక ప్రయాణం.. ఆ ఏడాది వర్షం ఇబ్బడిముబ్బడిగా కురిసింది. అందరి చూపూ తాము చేపట్టిన
‘వాటర్‌ షెడ్‌’ పైనే. క్రమంగా హేమంతం నుండి శిశిరానికి మారింది. ఆశ్చర్యం! ఎప్పటిలా బోర్లు నోరు తెరచి బావురుమనలేదు. నీటి గలగలలు వినిపిస్తూ ఆనందాన్ని పంచుతున్నాయి. ‘శ్రమయేవ జయతే!’ ఒక స్వప్నం సాకారమైంది. వాటర్‌ షెడ్‌ ఫలించింది. అందరిలోనూ ఒక
రకమైన ఉద్వేగం ఊసులాడ సాగింది. అదే సమయంలో ఓ నేషనల్‌ బ్యాంక్‌కు పీఓగా సెలక్ట్‌ అయ్యాడు శైలేశ్‌. మంచి ర్యాంక్‌ తెచ్చుకొని ఐఐటీ సీటు సాధించాడు మురహరి. అంతే.. గ్రామ రూపురేఖలే మారిపోయాయి. యువకుల్లో ‘మేమూ గెలుస్తాం’ అన్న ఆత్మస్థయిర్యం పెరిగింది. రైతుల్లో ‘మా పొలాల్లో బంగారం పండుతుంది’ అనే నమ్మకం కలిగింది. ఆ ఏడాదే శ్రీహరి అగ్రికల్చర్‌ బి.ఎస్సీ. కోర్సు పూర్తయ్యింది. వ్యవసాయంలో వస్తున్న కొత్త పద్ధతులను ఆకళింపు చేసుకొని, తన గ్రామాన్నే ప్రయోగశాలగా మార్చుకున్నాడు. అవసరమైన సహకారం అందించడానికి సారథి, లక్ష్మీపతి ఉండనే ఉన్నారు.
‘మనం ఒకడుగు విజయంవైపు వేస్తే.. విజయం పదడుగులు మనవైపు వస్తుంది’ అన్నట్టు.. ఎందుకూ పనికిరావు అనుకొన్న భూముల్లో ధాన్యపురాశులు కురుస్తున్నాయి.


ఓరోజు ఉదయం పది గంటల సమయం. రోడ్డుపైన ఎర్రని ధూళిని రేపుకుంటూ వచ్చిన ఇన్నోవా కారు పంచాయతీ కార్యాలయం ఎదుట ఆగింది. కారుదిగిన వ్యక్తి సరాసరి వీఆర్వో గదిలోకి దారితీశాడు. తలెత్తి చూసిన వీఆర్వో, లేచి నిల్చొని తన సీటులోకి ఆహ్వానించి, పక్కనే వినయంగా నిలుచున్నాడు.
ఆయన జిల్లా కలెక్టర్‌ ఆనంద కుమార్‌. చిన్న వయసులోనే ఉత్తమ కలెక్టర్‌గా పేరుపొందిన వ్యక్తి. నెలలో ఒకరోజు ఎవరికీ చెప్పకుండా తనదైన సడన్‌ విజిట్స్‌ చేస్తుంటారు. అలా ఈరోజు ఈ గ్రామాన్ని ఎంచుకున్నారు.
నిమిషాల్లో ఆ వార్త గ్రామమంతా పాకిపోయి, అరగంటలో ఊరిపెద్దలందరూ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు.
“జిల్లాలో మీ గ్రామం గురించి, స్వావలంబన కోసం మీ గ్రామస్తులంతా కలసికట్టుగా చేస్తున్న కార్యక్రమాల గురించి విని ఈరోజు ఇక్కడికి వచ్చాను. కృష్ణార్జునుల్లా మీకు లక్ష్మీపతి, పార్థసారథి లభించారు. చాలా సంతోషం. కలెక్టర్‌గా నానుండి మీరు ఏమైనా కోరుకుంటున్నారా? చెప్పండి నా పరిధిలో అయితే వెంటనే చేస్తాను” హామీ ఇచ్చారు కలెక్టర్‌ ఆనంద కుమార్‌.
“కలెక్టర్‌ గారూ! ఇలా మీరు మా ఊరికి అనుకోని అతిథిగా రావడం మాకు ఎనలేని ఆనందాన్ని కలగజేసింది. గ్రామానికి ‘పాడి – పంట’ రెండూ రెండు కండ్లలాంటివి. గ్రామస్తుల సహకారంతో చేపట్టిన ‘వాటర్‌ షెడ్‌’ ఫలించింది. దానికి పాడి పరిశ్రమ కూడా తోడైతే గ్రామం స్వావలంబన దిశగా ప్రగతి సాధిస్తుంది” నర్మగర్భంగా చెప్పాడు పార్థసారథి.
“యస్‌! యు ఆర్‌ రైట్‌! మీరు ఒక గ్రూపుగా ఏర్పడి ఒక సహకార సంఘం (మిల్క్‌ కో – ఆపరేటివ్‌ సొసైటీ) రిజిస్టర్‌ చేయండి. కొన్ని ఆవులు, గేదెలకు సబ్సిడీపై లోన్‌కు నా పరిధిలో నేను సహకరిస్తాను” హామీ ఇచ్చారు కలెక్టర్‌.
ఆరోజే ‘గోపబాల పాల సహకార సంఘం’ రిజిస్టర్‌ అయింది. కొద్దిరోజుల్లోనే కలెక్టర్‌ సహకారంతో ఆ కల కూడా సాకారమైంది. మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ను ప్రారంభించడానికి పాడిపరిశ్రమల మంత్రి వచ్చారు. దారి పొడుగునా రేగుతున్న కంకరరోడ్డు ధూళి ఎర్రగా పరుచుకోవడం మంత్రిగారికి చికాకు తెప్పించింది.
ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటుచేసిన సభలో అదే విషయాన్ని ప్రస్తావించి, గ్రామానికి తనవంతుగా బీటీ రోడ్డు మంజూరు చేశారు.


“ఏమోయ్‌! సారథి వచ్చాడు. కాఫీ కలుపుతావేంటి”.. లోనికి కేకేశాడు లక్ష్మీపతి.
“చాల్లేవోయ్‌! నీకు కావాలనుకుంటే చెల్లెమ్మ కలపదా? ఊరికే పేరు నాది” నవ్వుతూ వచ్చి కూర్చున్నాడు పార్థసారథి.
“సరేలెండి.. మీ ఇద్దరికీ రోజూ ఉన్నదేగా! కూర్చో అన్నయ్యా! అయిదు నిమిషాల్లో తెస్తాను” లోపల్నుంచే చెప్పింది వసుంధర.
“పతీ.. నాకెంతో ఆనందంగా ఉందిరా! ఒకప్పుడు ఈ ఊరి పేరు చెబితే పిల్లనివ్వడానికి కూడా జంకేవారు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఆదర్శ గ్రామంగా ప్రశంసలు అందుకుంటోంది”.. సారథి సంతృప్తి నిండిన కండ్లతో అన్నాడు.
“నిజమే సారథీ! కానీ ఈ ప్రయాణం ఇక్కడితో ఆగకూడదు. డెయిరీ వ్యర్థాలతో ‘గ్యాస్‌ ప్లాంట్‌’, అలాగే ‘సోలార్‌ ప్లాంట్‌’ ఏర్పాటు చేసుకొని కరెంటు తెచ్చుకోవాలి. శీతల గిడ్డంగి నిర్మించుకుంటే.. మన పంటలను మనమే ధరవరుల నుంచి, దళారుల నుంచి రక్షించుకోవచ్చు..” లక్ష్మీపతి కండ్లలో కలల మెరుపులు.
“అంకుల్‌.. సరిగ్గా మా విజన్‌ కూడా అదే! మీ తోడ్పాటుతో అవన్నీ సాధిస్తాం” అన్నాడు మిత్రబృందంతో వచ్చిన శ్రీహరి.
వారానికి ఒకసారైనా అందరూ కలసి చర్చించుకోవడం ఆనవాయితీగా మారింది.
“తథాస్తు.. సాయంకాలం ఆకాశంలో తథాస్తు దేవతలు తిరుగుతుంటారట. అప్పుడు తలచినవి నెరవేరాలని దీవిస్తారట” లోపలి నుంచి వచ్చిన వసుంధర అన్నది.
“మన జీవితాలకు సాయంత్రం అయ్యింది అనుకొని, ప్రశాంతంగా గడుపుదామని ఇక్కడికి వచ్చాం” అన్నాడు లక్ష్మీపతి.
“కాదంకుల్‌! మీ రాక దైవ నిర్ణయం” అన్నాడు శైలేశ్‌.
“అవును! మీరాక గ్రామానికి మహోదయం” అన్నాడు మురహరి.
“ఈ పయనం ఆగదు” అన్నాడు అప్పుడే వచ్చిన ప్రెసిడెంట్‌ మహాలక్ష్మి నాయుడు.
జీవితం ఎప్పుడు ఎవరికి ఏమిస్తుందో ఎవరికి తెలుసు?

పి.వి. రమణ
పోతుబరి వెంకట రమణ స్వస్థలం విజయనగరం జిల్లా సాలూరు. ఎంఏ (సంస్కృతం), ఎంఏ (తెలుగు) ఎంఈడీ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ గురుకుల విద్యాలయ సంస్థలో ప్రిన్సిపాల్‌గా విధులు నిర్వహించి, 2018లో విరమణ పొందారు. ప్రస్తుతం ‘సాహో’ మాసపత్రిక సంపాదక వర్గంలో పనిచేస్తూ, సాహిత్యసేవలో పాల్గొంటున్నారు. 1980 నుంచి కథా రచనలు చేస్తున్నారు. మనసు కదిలినప్పుడు, మనసుకు నచ్చినప్పుడు కథలు రాస్తుంటారు. కృతజ్ఞత (ఆంధ్రభూమి నేటికథ), అమ్మా నన్ను క్షమించవూ (ఈనాడు ఆదివారం), నాన్నా మన్నించు (చిరుగాలి), ఈ బండల మాటున (కథా మంజరి) కథలు ఈయనకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇప్పటివరకూ 80కిపైగా కథలు, ఒక సీరియల్‌ వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. కృతజ్ఞత పేరుతో కథా సంకలనాన్ని వెలువరించారు. మరొక సంకలనం ప్రచురణకు సిద్ధంగా ఉన్నది. కథా రచనలో పంతుల జోగారావు, డాక్టర్‌ బీఎస్‌ఎన్‌ మూర్తి, పోతుబరి నారాయణరావుతోపాటు తన శ్రీమతి చంద్రకళ సహకారం మరువలేనిదని వెంకట రమణ చెబుతున్నారు.

‘జిల్లాలో మీ గ్రామం గురించి,
స్వావలంబన కోసం
మీ గ్రామస్తులంతా కలసికట్టుగా చేస్తున్న కార్యక్రమాల గురించి
విని ఈరోజు ఇక్కడికి వచ్చాను.
కృష్ణార్జునుల్లా మీకు లక్ష్మీపతి,
పార్థసారథి లభించారు.
చాలా సంతోషం. కలెక్టర్‌గా నానుండి మీరు ఏమైనా
కోరుకుంటున్నారా?’

– పి.వి. రమణ,
87906 39446

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement