హైదరాబాద్, సెప్టెంబర్ 1 (నమస్తే తెలంగాణ) : కల్వకుంట్ల కవితకు కేసీఆర్ జన్మనిస్తే, బీఆర్ఎస్ రాజకీయ జన్మనిచ్చిందని, అలాంటి పార్టీ పునాదులను విస్మరించి బీఆర్ఎస్ నాయకులపై విమర్శలు చేయడం సరికాదని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళారం తెలంగాణ భవన్లో మహిళా నేతలు చారులత రాథోడ్, రజితారావుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా సుమిత్రానంద్ మాట్లాడుతూ.. పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెన్నంటి ఉన్న నాయకులను కవిత టార్గెట్ చేస్తున్నారని పేర్కొన్నారు. కావాలనే పార్టీ లైన్ అతిక్రమించి తండ్రికి దూరం జరిగారని, కేసీఆర్‌కు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన్ను తకువ చేసి మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
సీఎం రేవంత్‌రెడ్డి విచక్షణ మరచి కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు దిగుతుంటే కవిత ఎందుకు ప్రశ్నించడం లేదని సుమిత్రానంద్ నిలదీశారు. తెలంగాణ ప్రయోజనాల కోసమే పార్టీ పెడితే, బీఆర్ఎస్ కంటే రెట్టింపు స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేయాలని సూచించారు. ‘కవిత ఏ లక్ష్యంతో, ఏ ఉద్దేశంతో కొత్త పార్టీ పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎవరి ప్రయోజనాలు ఆశించి పార్టీ స్థాపించారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.
ఉద్యమకారుడైన మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక, ఆయనపై వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ కవిత అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఇప్పటికైనా కవిత ఆత్మవిమర్శ చేసుకోవాలని సుమిత్రానంద్ హితవు పలికారు. కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న చెరగని అభిమానాన్ని తుడిచివేయాలని చూస్తున్నారని, ఆమె మాటలను ప్రజలు ఎప్పటికీ నమ్మబోరని సుమిత్రానంద్ తేల్చిచెప్పారు.