Hyderabad | హైదరాబాద్ సిటీబ్యూరో/కుత్బుల్లాపూర్, అక్టోబరు 21 (నమస్తే తెలంగాణ): విద్యా వ్యవస్థను, విద్యా విలువలను నాశనం చేస్తున్నదని అంటూ ఇప్పటికే శ్రీ చైతన్య విద్యా సంస్థలపై ఆరోపణలు రాగా.. ఆ సంస్థ అనుమతులు లేని భవనాల్లో కాలేజీలు నడుపుతున్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్‌కు ఫిర్యాదులు అందాయి. కమిషనర్ కర్ణన్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారులు 30 సర్కిళ్లలో శ్రీ చైతన్య విద్యా సంస్థలు(స్కూల్స్, కాలేజీల)పై స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
కూకట్పల్లి జోన్ పరిధిలోని కుత్బుల్లాపూర్‌లో మంగళవారం శ్రీచైతన్య కాలేజీకి నోటీసులు ఇవ్వడంతోపాటు స్కూల్‌ను సీజ్ చేశారు. రెసిడెన్షియల్ అనుమతులు తీసుకొని కమర్షియల్‌కు వినియోగిస్తున్నట్టు తేల్చిన అధికారులు ఆ భవనాన్ని సీజ్ చేశారు. దీంతో దాదాపు 300 మంది విద్యార్థుల భవిష్యత్తు నడిరోడ్డున పడింది. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలోని అయోధ్యనగర్ నుంచి సుచిత్ర వైపునకు వెళ్లే ప్రధాన రోడ్డు పక్కన రెండేండ్ల కిందట శ్రీచైతన్య స్కూల్‌ను దాదాపు 300 మంది విద్యార్థులతో ప్రారంభించారు. ఆ భవనానికి అన్నీ ఉన్నాయంటూ స్థానిక టౌన్‌ప్లానింగ్ అధికారులు కండ్లు మూసుకొని అనుమతులు ఇచ్చేశారు.
ఇప్పుడు ఒక్కసారిగా కుత్బుల్లాపూర్ సర్కిల్ ఉప కమిషనర్, టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులు ఆగమేఘాల మీద వచ్చి స్కూల్ భవనాన్ని సీజ్ చేశారు. దీనిపై సంబంధిత టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారి సురేందర్‌రెడ్డిని వివరణ కోరగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సీజ్ చేసినట్టు తెలిపారు. పండుగ సెలవుల తరువాత స్కూల్‌కు వచ్చిన విద్యార్థులు గేటుకు తాళం చూసి తిరిగి ఇంటిముఖం పట్టారు. యాజమాన్యం అనధికారికంగా విద్యార్థులకు సెలవులు ప్రకటించడం పట్ల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.