Suchirindia : సుచిరిండియా ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా 32వ జాతీయ & రాష్ట్ర స్థాయి సైన్స్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్‌ను నిర్వహించింది. యువ మెదళ్లను పెద్దగా కలలు కనేలా, తెలివిగా ఆలోచించేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో సుచిరిండియా ఏటా విద్యార్థులతో ఈ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ రాయిస్తోంది. ఈ టాలెంట్ సెర్చ్ పరీక్షలో అనేక అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. యువ ప్రతిభను శోధించి, గుర్తించడమే ఈ పరీక్ష ఉద్దేశం. గత 32 ఏళ్లుగా సుచిరిండియా ఈ టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహించి, ప్రతిభావంతులకు అవార్డులను ప్రదానం చేస్తోంది.
ఈ మేరకు నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లోని లలిత కళాతోరణంలో ‘సర్ సీవీ రామన్ యంగ్ జీనియస్ అవార్డ్స్ – 2025’ పేరుతో సుచిరిండియా ఫౌండేషన్ తన వార్షిక వేడుకలు జరుపుకుంది. ఈ సంవత్సరం రాష్ట్రవ్యాప్తంగా 1,00,000 కంటే ఎక్కువ మంది విద్యార్థులు టాలెంట్ సెర్చ్ పరీక్షలో పాల్గొన్నారు. వెయ్యికి పైగా పాఠశాలల్లో ఈ ప్రతిభ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా 20 బంగారు పతకాలు ప్రదానం చేశారు. 40 రాష్ట్ర స్థాయి ర్యాంకర్లకు, 400 జిల్లా స్థాయి ర్యాంకర్లకు అవార్డులు అందించారు. 10 చిత్రాలయ పురస్కారాలు అందజేశారు. అదేవిధంగా యువ విద్యార్థులను తీర్చిదిద్దడానికి కృషి చేసిన కొన్ని సంస్థలు, అధ్యాపకులకు 11 గురుబ్రహ్మ అవార్డులను కూడా ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమం అనంతరం సుచిరిండియా ఫౌండేషన్ కాఫీ టేబుల్ పుస్తకాన్ని కూడా విడుదల చేసింది. రాష్ట్రంలోని ఉన్నత స్థాయి ప్రముఖులు, మేథావులు, తల్లిదండ్రులు, విద్యార్థులు సహా మొత్తం 2000 మంది ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత మోటివేషనల్ స్పీకర్ శ్రీ అభిషేక్ సన్నిధి మోటీవేషనల్ ప్రసంగం చేశారు. ఈ కార్యక్రమానికి సుచిరిండియా ఫౌండేషన్ ఎండీ, సీఈవో డాక్టర్ వై కిరణ్‌తోపాటు తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చీఫ్ గెస్టుగా, నటుడు రావు రమేశ్ గౌరవ అతిథిగా హాజరయ్యారు.