హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తేతెలంగాణ): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ52 ప్రయోగం విజయవంతమైంది. ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రంలోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి సోమవారం ఉదయం 5.59 గంటలకు ఈ ప్రయోగాన్ని చేపట్టారు. 17.34 నిమిషాల ప్రయాణం అనంతరం భూపరిశీలన ఉపగ్రహం ఈవోఎస్-04తో పాటు మరో రెండు ఉపగ్రహాలు ఇన్‌స్పైర్‌శాట్-1, ఐఎన్ఎస్టీ-2టీడీను రాకెట్ విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టినట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. ఇస్రో పగ్గాలు చేపట్టాక ఈయన నేతృత్వంలో జరిగిన తొలి ప్రయోగం ఇదే. అలాగే, ఈ ఏడాది ఇస్రోకు ఇదే తొలి ప్రయోగం. మిషన్‌లో పాల్గొన్న శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ, సోమనాథ్, మిషన్ డైరెక్టర్ ఎస్ఆర్ బిజు, శాటిలైట్ డైరెక్టర్ శ్రీకాంత్ శుభాకాంక్షలు తెలిపారు.