నటన అనేది ప్రయత్నపూర్వకంగా రాదు. కథలోని భావోద్వేగాలు, సంఘర్షణ వల్ల క్యారెక్టర్స్ ఎలివేట్ అవుతాయి. ఏ నటుడైనా పాత్రను అర్థం చేసుకోవడంలోనే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాలి.
విజయానికి వినయం తోడైతే అది మనిషి వ్యక్తిత్వానికి ఓ పరిపూర్ణతను తీసుకొస్తుంది. చక్కటి అలంకారమై భాసిల్లుతుంది. రామ్‌చరణ్ ను చూస్తే ఆ మాటలు అక్షర సత్యమనిపిస్తాయి. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలన్నది ఆయన నైజం. ‘ఆర్ఆర్ఆర్’ అపూర్వ విజయంతో పాన్ఇండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్నారాయన. తండ్రి చిరంజీవితో కలిసి రామ్‌చరణ్ నటించిన తాజా చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దర్శకుడు. ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆదివారం రామ్‌చరణ్ పాత్రికేయుల తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ
విశేషాలివి..
ఈ సినిమాకు కేవలం నిర్మాతగా మాత్రమే బాధ్యతలు నిర్వర్తించాలనుకున్నా. నటించాలనే ఆలోచన లేదు. దర్శకుడు కొరటాల శివ తొలుత సిద్ధ పాత్రను పదిహేను నిమిషాలు ఉండే అతిథి పాత్రగా డిజైన్ చేశారు. ఆ తర్వాత దానిని నలభై నిమిషాల నిడివికి పెంచారు. సినిమా ద్వితీయార్థంలో నా పాత్ర వస్తుంది. ‘మిర్చి’ సినిమా నుంచే కొరటాల శివతో పనిచేయాలనుకున్నా. కానీ వరుస కమిట్మెంట్స్ వల్ల కుదరలేదు. ఇప్పుడు ‘ఆచార్య’లో ఏకంగా నాన్నగారితో కలిసి తెరను పంచుకునే అదృష్టాన్ని కల్పించారాయన.
దారేదైనా ధర్మం గెలవాలనుకునే యోధుడు ఆచార్య. ఇక సిద్ధ గురుకుల విద్యార్థి. చిన్నతనం నుంచే ధర్మపరిరక్షణే అతని ధ్యేయం. వీరిద్దరి దారులు వేరైనా ఓ లక్ష్యసాధన కోసం కలిసి పోరాడుతారు. ధర్మం అధర్మం అయినప్పుడు తప్ప సిద్ధకు ఏ విషయంలోనూ కోపం రాదు. వాస్తవానికి ఆచార్య, సిద్ధ పాత్రల్ని ఏ ఇద్దరు నటులు పోషించినా సూపర్‌హిట్ అవుతాయి. మేమిద్దరం తండ్రీకొడుకులం కాబట్టి సినిమాకు ఎక్స్ట్రా బోనస్‌లా మారింది.
ఇష్టంతో చేసే ఏ పని ఏమంత కష్టంగా అనిపించదు. ఈ రెండు పాత్రలూ అలాంటివే. స్క్రిప్ట్ దశలోనే సిద్ధ క్యారెక్టర్‌ను కొరటాల శివ అద్భుతంగా డిజైన్ చేశారు. ఆయన రైటింగ్‌లోనే తెలియని మేజిక్ ఉంటుంది. దాంతో స్క్రిప్ట్‌లోనే సగం పని అయిపోయిందనే భావన కలిగింది. షూటింగ్ చేయడాన్ని మా టీమ్ అంతా ఓ బోనస్‌గా భావించాం.
ఈ సినిమా షూటింగ్ కోసం నాన్న, నేను 25 రోజుల పాటు మారెడుమిల్లి ఫారెస్ట్‌లో ఉన్నాం. నాన్న షూటింగ్స్‌తో బిజీగా ఉంటారు కాబట్టి ఆయనతో ఎక్కువ సమయం గడిపే వీలుండేది కాదు. ఈ ఇరవై ఐదు రోజుల్లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నా. రోజూ ఇద్దరం ఒకే సమయంలో నిద్రలేచేవాళ్లం. మేకప్ కూడా కలిసే వేసుకునేవాళ్లం. ఇక సెట్లో తన కుమారుడిలా కాకుండా ఓ సహనటుడిగా నాన్న నాకు మర్యాదనిచ్చారు. నాకు సంబంధించిన కొన్ని టేక్‌లు సరిగా రాకపోయినా ఆయన ఓపికగా ఎదురుచూసేవారు. సీన్లో పర్ఫెక్షన్ రావడానికి ఏం చేయాలో సలహాలిచ్చేవారు.
‘ఆచార్య’ సినిమా సెకండాఫ్‌లో నలభై నిమిషాలు నాన్నతోనే కలిసి ఉంటాను. ఈ స్థాయిలో పాత్ర దొరకడమే అదృష్టంగా భావిస్తున్నా. నా దృష్టిలో ఏ సినిమా అయినా డిజైన్ చేస్తే సెట్ అవదు. పరిస్థితులు అనుకూలిస్తేనే సినిమాలు సాధ్యమవుతాయి.
సమయాభావం వల్ల పాన్ ఇండియా రిలీజ్ గురించి ఆలోచించలేదు. మూడునాలుగు నెలల తర్వాత ఆ విషయం గురించి ఆలోచిద్దామనుకుంటున్నాం. దర్శకుడు శివ కేవలం దక్షిణాదిని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ సినిమా చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ విజయంతో పాన్ ఇండియా రిలీజ్ ఆలోచన వచ్చింది. పాన్ఇండియా రీచ్ గురించి నిదానంగా ఆలోచించాలనుకుంటున్నా.
ఈ ప్రాజెక్ట్ సెట్ చేయడం వరకే నేను బాధ్యత తీసుకున్నా. మిగతా విషయాలన్నీ నిర్మాత నిరంజన్‌రెడ్డి, దర్శకుడు కొరటాల శివ దగ్గరుండి పర్యవేక్షించారు. సినిమాకు గొప్ప టీమ్ కుదిరింది కాబట్టే నేను ప్రశాంతంగా ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్లో పాల్గొ న్నా. ‘సైరా’ ‘ఆచార్య’ వంటి మంచి సబ్జెక్ట్స్ వస్తేనే ఇక ముందు సినిమా ప్రొడక్షన్లో పాలుపంచుకుంటా. భవిష్యత్తులో ఎక్కువగా నటనపైనే దృష్టిపెట్టాలనుకుంటున్నా.
గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేయబోయే సినిమా ఎప్పుడు సెట్స్‌మీదకు వెళ్తుంది?
ప్రస్తుతం శంకర్ డైరెక్షన్లో చేస్తున్న సినిమా చిత్రీకరణ జరుగుతున్నది. అరవై రోజులు షూట్ చేశాం. ఈ ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత గౌతమ్ తిన్ననూరి సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.
‘ఆర్ఆర్ఆర్’ విజయంతో కథలు ఎంచుకోవడంలో నాపై మరింత బాధ్యత పెరిగింది. కథాంశాల ఎంపికలో మరింత శ్రద్ధ పెట్టాలనుకుంటున్నా. రాశిపరంగా కాకుండా వాసి పరంగా ప్రేక్షకులకు మంచి సినిమాల్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నా.
సినిమాల విషయంలో ప్లాన్ చేస్తే ఏదీ జరగదు. ఈ మధ్య ఓ పెద్ద దర్శకుడు తన వద్ద మూడునాలుగు కథలున్నాయి.. సినిమా చేద్దామని నన్ను కలిశాడు. కథల విషయంలో నాకు ఆప్షన్స్ ఇవ్వొద్దని ఆయనకు సూచించా. ‘మీరు చాలా పెద్ద డైరెక్టర్. మీకున్న సృజన తో నాకు ఏ కథ సరిపోతుందో ఆలోచించుకోండి. అంతేకాని ఫలానా జోనర్ కథ మాత్రమే సిద్ధం చేస్తానంటే వర్కవుట్ కాదు’ అని చెప్పాను. నేను ఇప్పటివరకు చేసిన సినిమాల్లో దర్శకులు ఎంతగానో ఇష్టపడ్డ కథలే విజయాల్ని అందించాయి. నా కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేసిన సినిమాలు ఆడలేదు.
ప్రతి సంవత్సరం ఆరంభంలో, చివరలో తప్పకుండా మాల వేసుకుంటాను. నా పుట్టిన రోజు మార్చిలో వస్తుంది. అది అయిపోయిన వెంటనే మాల ధరించాల్సి ఉంది. ‘ఆర్ఆర్ఆర్’ విడుదల ఉండటంతో కొంచెం ఆలస్యంగా మాల వేసుకున్నా.
ఎక్కువ ఎమోషనల్‌గా ఫీలైతే మాటలు కరువవుతాయంటారు. మా అమ్మగారు కూడా అదే స్థితిలో ఉన్నారు. మా ఇద్దరిని స్క్రీన్‌పై చూసి అమ్మ చాలా ఆనందపడింది. ఈ సినిమాను అమ్మకే అంకితమిస్తున్నాం.
‘రంగస్థలం’ సినిమా నుంచే కొరటాల శివతో సినిమా చేయాలనే సన్నాహాల్లో ఉన్నా. రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’, కొరటాల శివ సిద్ధం చేసిన సబెక్ట్స్ రెండూ ఒకేసారి ఓకే అయ్యాయి. కొరటాల శివ పెద్ద మనసుతో నేను ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేయడమే కరెక్ట్ అని చెప్పారు. ఓ సినీ అభిమానిగా రాజమౌళి సినిమాలో నన్ను చూడాలనుకుంటున్నానని ఆయన అన్నారు. ‘మనిద్దరం కలిసి భవిష్యత్తులో భారీ ప్రాజెక్ట్ చేద్దాం. ఏదో కంగారులో సినిమా చేస్తే బాగుండదు’ అని కొరటాల శివ అనడంతో నేను ‘ఆర్ఆర్ఆర్’ సెట్స్‌మీదకు ప్రశాంతంగా అడుగుపెట్టాను. ఆ తర్వాత నాన్నగారిని దృష్టిలో పెట్టుకొని కొరటాల శివ ప్రత్యేకంగా ‘ఆచార్య’ కథ సిద్ధం చేశారు.