కారేపల్లి, ఏప్రిల్ 20 : ఖమ్మం జిల్లా సింగరేణి(కారేపల్లి) మండల కేంద్రంలో గల మండల విద్యా వనరుల కార్యాలయ భవన మరమ్మతులు నాసిరకం పనులకు నిదర్శనంగా నిలుస్తుంది. పంచాయతీ రాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే కాంట్రాక్టర్లు ఇష్టానుసారంగా పనులు చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండల ప్రజా పరిషత్ సాధారణ నిధులు రూ.4.50 లక్షలతో ఆరు నెలల కిందట ఎంఈఓ కార్యాలయ మరమ్మతు పనులు జరిగాయి. చేపట్టిన పనులన్నీ కూడా పూర్తిగా నాసిరకంగా ఉండడంతో పనులు ఎంత పట్టిష్టంగా జరిగాయో ఆరు నెలల్లోనే అర్థమయిపోయింది. మరుగుదొడ్డి నిర్మించక పోవడంతో పాటు కిటికీలు కూడా సక్రమంగా బిగించలేదని కాంట్రాక్టర్ నాసిరకంగా పనులు చేపట్టితే అందుకు పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు తూతూ మంత్రంగా పర్యవేక్షణ చేసి ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి వారు కూడా చేయూత అందించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షించిన తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ అధికారులు పనుల నాణ్యతను పరిశీలించి పనులు సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించి బిల్లులు చెల్లించాలి. పనులు జరుగుతున్నచోట అధికారులు ఎవరూ కూడా కనిపించకపోవడంతో కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా నాసిరకం పనులు చేస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్లకు అలవాటు పడ్డ అధికారులు వారు ఏ విధంగా పనులు కొనసాగించినప్పటికీ సై అంటూ చెప్పడంతో కళ్లముందే భవనాలు నాశనం అవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని పలువురు ఆరోపిస్తున్నారు.

నాసిరకంగా సింగరేణి ఎంఈఓ కార్యాలయ భవన మరమ్మతులు
కాంట్రాక్టర్ చేపట్టాల్సిన భవన నిర్మాణం మరమ్మతు పనులన్నీ పూర్తి చేయలేదని మండల విద్యాశాఖ అధికారి జయరాజు నమస్తే తెలంగాణకు తెలిపారు. తలుపులు, కిటికీలు బిగించాలని, అన్ని గదులలో టైల్స్ వేయాలని, కార్యాలయానికి వచ్చే ఉపాధ్యాయుల సౌకర్యార్థం మరుగుదొడ్డి నిర్మించాలని, నూతనంగా విద్యుత్ వైరింగ్ చేయాలని, ఫ్యాన్లు బిగించాలని కాంట్రాక్టర్కు సూచించామన్నారు. అవేమి చేయకుండానే పనులు పూర్తయ్యాయని చేతులు దులుపుకున్నట్లు చెప్పారు. ఇటీవల కార్యాలయానికి వచ్చిన ఓ ఉపాధ్యాయురాలు కుంగిపోయి, పగిలిన టైల్స్ తగిలి గాయమై తీవ్రంగా రక్తం కారిందన్నారు. ఈ విషయమై సంబంధిత శాఖ అధికారుల దృష్టి కూడా తీసుకెళ్లినట్లు చెప్పారు.
దీనిపై పంచాయతీరాజ్ ఏఈ రాజశేఖర్ ను వివరణ కోరగా నాసిరకపు పనులను మళ్లీ చేయిస్తామన్నారు. విద్యాశాఖ కార్యాలయ భవన మరమ్మతు పనుల్లో కాంట్రాక్టర్ కొన్నింటికి నాణ్యత ప్రమాణాలు పాటించలేదని తమ దృష్టికి వచ్చిందన్నారు. నాణ్యత లోపించిన ప్రతి పనిని తిరిగి మళ్లీ కాంట్రాక్టర్ చేత చేపిస్తామని ఆయన వెల్లడించారు.

నాసిరకంగా సింగరేణి ఎంఈఓ కార్యాలయ భవన మరమ్మతులు