న్యూఢిల్లీ, మార్చి 15 : యుద్ధ సంక్షోభంలో కూరుకుపోయిన ఇరాన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి తరలించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించింది. ఆదివారం 70 మందికిపైగా భారతీయ విద్యారులు ఇరాన్ నుంచి దుబాయ్‌కు వచ్చి, అక్కడ్నుంచి ఢిల్లీకి చేరుకున్నారు. వైద్య విద్యను అభ్యసించేందుకు ఇరాన్‌కు వెళ్లిన వీళ్లంతా యుద్ధ సంక్షోభంలో చిక్కుకోవటంతో, భారత ప్రభుత్వ సమన్వయంతో విద్యార్థులను సురక్షితంగా తరలించే ప్రక్రియను ఇరాన్‌లోని మన రాయబార కార్యాలయం చేపట్టింది.
ఇందులో అత్యధిక మంది జమ్ముకశ్మీర్‌కు చెందిన వాళ్లే ఉన్నట్టు మీడియా కథనాలు తెలిపాయి. వీరంతా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత తమ స్వస్థలాలకు బయల్దేరారు. ఆల్ ఇండియా మెడికల్ స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ ఉపాధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ మోమిన్ ఖాన్ తెలిపిన వివరాల ప్రకారం, టెహ్రాన్ యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో సుమారు 1,200 మంది భారతీయులు విద్యనభ్యసిస్తున్నారు.