విద్యార్థుల్లో సృజనాత్మకత, వ్యాపార నాయకత్వ లక్షణాలు పెంపొందించేందుకు ఢిల్లీ ప్రభుత్వం కళాశాల స్థాయిలో ప్రారంభించిన ఓ పథకం ఇప్పుడిప్పుడే ఫలితాలను అందిస్తున్నది. దేశ రాజధానిలోని కాలేజ్ స్టూడెంట్స్ చదువుతోపాటు సొంత స్టార్టప్‌తో దూసుకెళ్తున్నారు. చీరెలు అమ్మడం మొదలు.. ఫోన్ల రిపేర్లు, బ్లూటూత్ స్పీకర్ల తయారీ, పెయింటింగ్స్ వేయడం.. ఇలా నచ్చిన పనితో నెలనెలా ఆర్జిస్తున్నారు. విద్యార్థులు నిరుద్యోగులుగా మిగలొద్దనే ఉద్దేశంతో కేజ్రీవాల్ ప్రభుత్వం.. ఏడాదికి రూ.3 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాల పిల్లల కోసం ‘బిజినెస్ బ్లాస్టర్స్’ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందుకోసం ఏటా రూ.60 కోట్లు కేటాయిస్తూ.. ప్రతి ఎనిమిది వారాలకు ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నది. ఆ మొత్తంతోనే, ఇంటర్ చదివే 18 ఏండ్ల మర్జీనా తన స్నేహితురాళ్లతో కలిసి ‘సింప్ల్లిఫయర్స్’ అనే స్టార్టప్ ప్రారంభించింది. సరికొత్త డిజైన్ల చీరలను ఆవిష్కరించింది. ఆ ఉత్పత్తులు మార్కెట్లో ట్రెండ్ సృష్టిస్తున్నాయి. ఈ చీరలతో కుచ్చిళ్లు పోసుకునే బాధ ఉండదు. మగవారు ప్యాంటు తొడిగినట్టే.. మహిళలు శారీ, మ్యాచింగ్ బ్లౌజ్ ధరించొచ్చు. కొత్తదనాన్ని కోరుకునేవారికి ఈ చీరెలు తెగనచ్చేశాయి.‘చదువుకొంటూనే మా స్టార్టప్‌ను విస్తరిస్తా’ అంటున్నది మర్జీనా.