దండేపల్లి : హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థి ఇటీవలే కళాశాల హోమ్సిక్ ( Home Sick ) సెలవులు ఇవ్వడంతో ఇంటికి వచ్చిన అతడిని రోడ్డు ప్రమాదం ( Road Accident ) కబళించింది. వివరాల్లోకి వెళితే లక్షెట్టిపేట పట్టణానికి చెందిన రుద్ర వంశీకృష్ణ (16) ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో చేరాడు.
కళాశాల హోంసిక్ సెలవులు మంజూరు చేయడంతో ఇంటికి వచ్చిన అతడు ఆదివారం తన స్నేహితులతో కలిసి ద్విచక్ర వాహనాలపై దండేపల్లి మండలంలోని గూడెం మేదరిపేట రింగురోడ్డు గుండా బయలు దేరారు. నంబాల గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బావిలోకి పడి పోయింది. దీంతో అతడు బావిలో మునిగిపోయాడు.
అతడి వెనుక కూర్చున్న స్నేహితుడు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సెలవుల కోసం ఇంటికి వచ్చి సంతోషంగా గడిపే సమయంలోనే విషాద ఘటన చోటుచేసుకుంది. 8 నెలల క్రితం తండ్రి మరణించడం, ఇప్పుడు చేతికందిన కొడుకు మరణించడం కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తల్లి రుద్ర నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తహసీనుద్దీన్ తెలిపారు.