హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ) : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులపై ఎస్టీ వర్గాల పిల్లలు ఆసక్తి చూపడంలేదా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. ఎప్‌సెట్‌కు వచ్చిన దరాఖాస్తులే ఇందుకు నిదర్శనం. రిజర్వేషన్ కోటా 10% కంటే తక్కువ మంది దరఖాస్తుచేసుకోవడం గమనార్హం. ఇప్పటి వరకు 9.05% ఎస్టీ విద్యార్థులు మాత్రమే ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఎప్‌సెట్ దరఖాస్తుల స్వీకరణ గడువు ముగింపునకు చేరుకున్నది. ఇప్పటి వరకు 3.01 లక్షల మంది దరఖాస్తులు సమర్పించారు. మొత్తం దరఖాస్తుల్లో 54% బీసీలే ఉండటం గమనార్హం. ఎస్సీలు 15%, జనరల్ క్యాటగిరీ విద్యార్థులు 21.13% చొప్పున దరఖాస్తు చేసుకున్నారు. ఎప్‌సెట్ పరీక్షలు మే 4 నుంచి జరుగనున్నాయి. మే 4, 5న అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి, మే 9,10, 11న ఇంజినీరింగ్ విభాగానికి పరీక్షలు నిర్వహిస్తారు.
ఎప్‌సెట్‌కు దరఖాస్తు చేసే వారి సంఖ్య తగ్గుతున్నది. ప్రత్యేకించి ఇంజినీరింగ్ విభాగం దరఖాస్తుల సంఖ్య నిరుటితో పోల్చితే తగ్గాయి. నిరుడు ఇంజినీరింగ్ విభాగానికి 2,20,329 మంది దరఖాస్తు చేసుకొంటే, ఈ సారి 2,10,308 మంది మాత్రమే దరఖాస్తు చేసుకొన్నారు. అంటే ఏకంగా 10 వేల దరఖాస్తులు తగ్గాయి. ఫార్మసీ అండ్ అగ్రికల్చర్‌కు నిరుడు 86,765 మంది దరఖాస్తు చేస్తే.. ఈ సారి 90,569 మంది దరఖాస్తు చేశారు. ఈ ఏడాది నాలుగువేలకు పైగా దరఖాస్తులు పెరిగాయి. ఏపీకి చెందిన విద్యార్థులకు దరఖాస్తు చేసుకొనే అవకాశమివ్వలేదు. ఈ నేపథ్యంలో దరఖాస్తుల సంఖ్య తగ్గుతున్నట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు.
