అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రకటించిన 11 వ పీఆర్సీ వ్యతిరేక జీవోలపై సమ్మె బాట పట్టేందుకు ఏపీలోని పీఆర్సీ సాధన సమితి నాయకులు ఏపీ ప్రభుత్వానికి సమ్మె నోటీసును అందజేశారు. సచివాలయంలోని బ్లాక్ వన్‌లో జీఏడీ సెక్రటరీ శశిభూషణ్‌కు మూడు పేజీలతో కూడిన సమ్మె నోటీసును అందజేశారు. పీఆర్సీ జీతాల విషయంపై ఫిబ్రవరి 6 న అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్నట్లు నోటీస్‌లో పేర్కొన్నారు.
ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని , జనవరి వేతనాన్ని పాత జీతంతో ఇవ్వాలని కోరారు. ఇదివరకే నిర్ణయించిన నిరసనల తేదీల వివరాలను నోటీసులో పేర్కొన్నారు. అన్ని విషయాలు చర్చించాకే సమ్మె నోటీసు ఇచ్చిన తరువాతే సమ్మెకు వెళ్తున్నామన్నారు. నోటీసు ఇచ్చిన తరువాత కూడా ప్రభుత్వంతో జరిపే చర్చల్లో పాల్గొంటామని నాయకులు బండి శ్రీనివాస్, సూర్యనారాయణ, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి తెలిపారు.