తాంసి : మానవ అక్రమ రవాణా ( Human trafficking ) చేపట్టే వారిపై కఠిన చర్యలు ( Action) తీసుకుంటా మని జిల్లా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారి జోగేంద్ర సింగ్ ( Jogendra Singh) హెచ్చరించారు. బుధవారం తాంసి మండలం పొన్నారి గ్రామంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
బాలల హక్కులు, మానవ విలువలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (DLSA) వాలంటీర్ గంగన్నతో కలిసి గ్రామస్థులకు చైల్డ్ లేబర్, మానవ అక్రమ రవాణా ప్రభావాలు, దీనివల్ల కలిగే నష్టాలను వివరించారు. బాల కార్మికులను పనుల్లో నియమించుకుంటే శారీరకంగా, మానసికంగా నష్టం జరుగుతుందని తెలిపారు.
మానవ అక్రమ రవాణాను అరికట్టేందుకు అనేక కఠిన చట్టాలు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. చిన్నారులను బడులకు కాకుండా పనులకు వెళ్లాలని బలవంతపెడితే, ఇతర ప్రాంతాలకు తరలిస్తే శిక్షలు తప్పవని హెచ్చరించారు. అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గంగన్న, మాజీ ఎంపీటీసీ విలాస్, నాయకులు గడుగు గంగన్న, చింతలపెల్లి రామన్న, శివలింగయ్య, అశోక్, శివన్న, యువకులు లంకేశ్వర్, మల్లన్న పాల్గొన్నారు.