భూదేవిని సహనానికి సాక్ష్యంగా భావిస్తుంటాం. గుండెల్లో గునపాలు దించినా, బరువైన కట్టడాలను పేర్చినా ఎదురు తిరగదు సరికదా… మన కడుపు నింపే ప్రయత్నంలోనే ఉంటుంది. అందుకేనేమో!మనిషికి నేల తల్లే అలుసుగా మారిపోయింది. టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలతో, మబ్బులను దాటే విష వాయువులతో భూగోళాన్ని నింపేస్తున్నాం. తన ఊపిరే విషంగా మారిపోతున్నా…మనిషికి ఎరుక రావడం లేదు. తీవ్ర అనారోగ్యాలకూ అతను చలించడం లేదు.
కూర్చున్న కొమ్మని నరుక్కున్న మూర్ఖుడి కథలో పాత్రకు తెలివిలేకపోవచ్చు. మందలించే మార్గదర్శి లేకపోవచ్చు. కానీ, మన కండ్ల ముందు ఎన్నో గణాంకాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ నివేదిక ప్రకారం… ఏటా ఒక్క భారత్‌లోనే 330 కోట్ల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలు విడుదల అవుతున్నాయి. వీటిలో 79 శాతం వృథాగా పేరుకుపోతున్నాయి. అవి డ్రైనేజీలకు అడ్డుపడి వరదలు సృష్టిస్తున్నాయి. సముద్ర జీవులను చిదిమేస్తున్నాయి. ఆఖరికి తల్లిపాలల్లోకి కూడా చేరుకుంటున్నాయి. ఈ సమస్యను నివారించడానికి సూపర్‌మ్యాన్ దిగిరానక్కర్లేదు. మహోద్యమాలూ అవసరం లేదు. అలాంటి అద్భుతాల కోసం ఎదురుచూస్తూ కూర్చుంటే నిరాశ తప్పదు. బదులుగా, మన వంతుగా ఏం చేయగలమా అన్నది ఆలోచించాలి. ఒక్కో అడుగూ ముందుకు వేయాలి. అందుకే వ్యర్థాలను పూర్తిగా అరికట్టాలి (జీరో వేస్ట్) అన్న సిద్ధాంతానికి బదులుగా ‘కొంతమేరకు అయినా వ్యర్థాలను తగ్గించాలి’ (ఇంపర్ఫెక్ట్ జీరో వేస్ట్) అనే సిద్ధాంతం ప్రచారంలోకి వస్తోంది.
పొద్దున్నే లేవగానే సూర్యోదయం, పక్షుల కిలకిలారావాలు, చల్లగా పలకరిస్తున్న గాలి… ఈ వాతావరణం మనకు కొత్తేమీ కాదు. గమనించే ఓపిక ఉండాలే కానీ, ఇలాంటి దృశ్యాలు వేలసార్లు మనల్ని పలకరిస్తాయి. కానీ ఈ అనంత విశ్వంలో, భూమ్మీద తప్ప మరో చోట ఇలాంటి అద్భుతం ఆవిష్కరించే అవకాశం ఉందా? ఆలోచించాల్సిందే! నమ్మకాలను పక్కన పెడితే… శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం మనలాంటి భూమి మరో చోట ఉండే అవకాశం చాలా తక్కువ. డ్రేక్ అనే శాస్త్రవేత్త తేల్చి చెప్పిందీ అదే.. కొన్ని లక్షల కోట్ల గ్రహాలను వెతికితే కానీ, మన పుడమి లాంటి ప్రదేశం దొరక్కపోవచ్చు. దొరికినా దాని మీద బుద్ధి జీవులు ఉంటారనీ, వాళ్లు మనంత సాంకేతికంగా అభివృద్ధి చెంది ఉంటారనీ చెప్పలేం. దీనికి కారణాలు అనేకం. మన భూమి మీద ఉష్ణోగ్రతలు, నీటి లభ్యత, దానికి అనుగుణంగా ఏర్పడిన జీవరాశి, సూర్యుడి నుంచి దూరం, డైనోసార్లు అంతరించిన తర్వాత కొత్త జీవులు ఏర్పడటం, భూ కక్ష్య… ఇలా సవాలక్ష పరిణామాలు అనుకోకుండా మనకు అనుకూలంగా మారాయి. కాబట్టే ఈ రోజున మనం హాయిగా జీవిస్తున్నాం. దీన్నే ‘రేర్ ఎర్త్ హైపోథిసిస్’ అంటారు. ఇంత అపూర్వమైన పుడమిని కాపాడుకునేందుకు వ్యర్థాలను అరికట్టి తీరాల్సిందే! అందుకోసం మొదలైన ఓ వినూత్నమైన ప్రయత్నమే ఇంపర్ఫెక్ట్ జీరో వేస్ట్. అందుకు కొన్ని మార్గాలివే!
తిరస్కరించండి (Refuse)
గుడ్డసంచిని పట్టుకోవడం అంటే చాలామందికి నామోషీ. ఆఫీసు నుంచి వచ్చే దారిలో, నాలుగు రకాల వస్తువులు కొనాల్సి వస్తే… నాలుగూ వేర్వేరు క్యారీ బ్యాగులు ఉండాల్సిందే. ఇక కూల్ డ్రింక్ తాగాలంటే స్ట్రా, టిఫిన్ పార్సిల్లో ప్లాస్టిక్ స్పూన్… ఆఖరికి ప్రసాదం తీసుకోవలన్నా ఓ ప్లాస్టిక్ కప్పు తప్పదు. ఇలా ఒకేసారి వాడి పారేసే ‘సింగిల్ యూసేజ్’ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా చేటు. ఓ అంచనా ప్రకారం సముద్రంలో కలిసే ఈ తరహా ప్లాస్టిక్ 2050 నాటికి ఏ స్థాయికి చేరుకుంటుందంటే… సంద్రంలో చేపల బరువు కంటే ప్లాస్టిక్ వ్యర్థాల బరువే ఎక్కువ అవుతుంది. పోనీ వీటికి ప్రత్యామ్నాయాలు లేవనీ అనుకోవడానికి వీల్లేదు. వాటి వాడకం లేకుండా రోజు గడవదని అనుకోవడమూ కుదరదు. పర్యావరణానికి అనుగుణంగా జీవించడాన్ని ‘సస్టెయినబుల్ లివింగ్’ అని పేరు పెట్టుకున్నాం. దాని కోసం మార్గాలూ వెతుక్కుంటున్నాం. నిజానికి, ఒకప్పుడు మన జీవితాలన్నీ అలా గడిచినవే! స్టీల్ క్యాన్లు, చేతి సంచులు, విస్తళ్లు, మట్టి ముంతలు, గాజు గ్లాసులు… వీటితోనే పని జరిగిపోయేది. వాటిని తిరిగి ఉపయోగించుకోవాల్సిన సమయం వచ్చేసింది. వ్యర్థాలకు ఆస్కారమిచ్చే అలవాట్లకు స్వస్తి పలకాలి. దుకాణదారుడు అందించే క్యారీబ్యాగ్ నుంచి ఉచితంగా దొరికే డిస్పోజబుల్ గ్లాసుల వరకు.. అన్నీ తిరస్కరించాలి.
తగ్గించండి (Reduce)
ఓ ప్రింట్-ఔట్ తీసుకోవాలి. కాగితానికి రెండువైపులా ప్రింట్ వచ్చేలా చూసుకుంటే, సగానికి సగం వనరులు ఆదా అవుతాయి. చిన్నచిన్న దూరాలకు నడిచి వెళ్తే, వ్యాయామం అవుతుంది, పెట్రోలు కూడా మిగులుతుంది. గమనించాలే కానీ ఇలాంటి అవకాశాలు మన రోజువారీ జీవితంలో చాలానే కనిపిస్తాయి. అంతదాకా ఎందుకు? ఓసారి మన ఇంటినే పరీక్షగా చూస్తే.. వృథా తగ్గించుకునే అవకాశాలు అనేకం కనిపిస్తాయి. గదికో గడియారం అవసరం లేదు! వాటి బ్యాటరీ పదిరూపాయలే కావచ్చు. కానీ దాన్ని పారేశాక ఎక్కడికి చేరుతుందన్నదే సమస్య. భారీ బల్బులతో పని లేదు, ఎల్యీడీలతో విద్యుత్ ఖర్చు మాత్రమే కాదు, ఇంధనం తయారీలో విడుదలయ్యే కాలుష్యం కూడా తగ్గుతుంది. ఇంతేనా! షవర్ల బదులు కుళాయిలు, ప్లాస్టిక్ బదులు గాజు సీసాలు… ఇలా మూలమూలనా ఏదో ఒక అవకాశం ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మనం వినియోగించే వనరులన్నీ విలువైనవే. అవసరానికి మించి వాడుతున్నప్పుడు, పర్యావరణానికి నష్టం చేసేవే. ఉదాహరణకు మన కంప్యూటర్లోని అనవసరమైన మెయిల్స్‌నే తీసుకోండి. వీటివల్ల నష్టం ఏముంటుంది? అనిపించవచ్చు. కానీ ఆ మెయిల్స్‌ను భద్రపరిచే భారీ సర్వర్లలో వాడే కూలెంట్ రసాయనాల నుంచి వాటికయ్యే విద్యుత్ ఖర్చు వరకూ పర్యావరణం మీద ప్రభావం చూపేవే! కాబట్టి ప్రతి వనరునీ మితంగా వినియోగించుకోవాలి.
మరోలా వినియోగించండి (Repurpose)
కాస్త సృజన జోడిస్తే ప్రతి వస్తువూ మరోరకంగా ఉపయోగపడుతుంది. ఒకవైపే ప్రింట్ అయిన కాగితాన్ని రెండోసారి ఉపయోగించుకోవచ్చు. కరెంటు తీగను తాడులా మార్చేసుకోవచ్చు. ఇక ఎందుకూ పనికి రావని అనుకున్న వస్తువులతో బొమ్మల దగ్గర నుంచీ రోబోల వరకూ ఏదైనా తయారుచేయవచ్చు. దీన్నే Upcycling గా వ్యవహరిస్తున్నారు. కాస్త మనసు పెడితే, ఈ పద్ధతి వల్ల పర్యావరణంతో పాటు ఆర్థిక లాభం ఉంటుంది. ఓ చిన్న ఉదాహరణ చెప్పుకొందాం! ఏటా కోట్లాది చెప్పుల జతలు సముద్రంలో కలుస్తాయి. అందంగా, మెత్తగా కనిపించే ఆ చెప్పులను ఆహారంగా భ్రమించే జలచరాలు వాటిని తిని ప్రాణాల మీదకు తెచ్చుకుంటాయి. ఇందుకు ఓ చిత్రమైన ఉపాయాన్ని కనిపెట్టారు జూలీ చర్చ్ అనే పర్యావరణవేత్త. ఓషన్ సోల్ అనే సంస్థను స్థాపించాడు. కెన్యా తీరానికి కొట్టుకు వచ్చే చెప్పులను సేకరించి, స్థానికులతో బొమ్మలు తయారుచేయిస్తున్నాడు. మన దేశానికి చెందిన గ్రీన్ సోల్ అనే సంస్థ కూడా… పనికిరాని షూస్ నుంచి పేద పిల్లలకు కొత్త చెప్పులు రూపొందిస్తున్నది. ఇలాంటి చర్యల వల్ల పర్యావరణానికి మేలు జరగడమే కాదు… మరో సామాజిక సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం కూడా ఉంటుంది. అలాగే ఉపాధి కూడా దొరుకుతుంది.
మరో ఉత్పత్తి (Recycle)
చాలామంది గుర్తించని ఓ ముఖ్యమైన విషయం…. మన కండ్లకు కనిపించే ప్రతి వ్యర్థాన్నీ రీసైకిల్ చేయడం సాధ్యం కాదు. ఉదాహరణకు ప్లాస్టిక్‌నే తీసుకుంటే అందులో ‘థర్మోసెట్’ పద్ధతిలో రూపొందించిన వస్తువులను రీసైకిల్ చేయడం మహాకష్టం. వేడిని తట్టుకునేందుకు వాటిని గట్టిపరుస్తారు కాబట్టి, వాటితో మరో పదార్థాన్ని సృష్టించడం దాదాపు అసాధ్యం. దురదృష్టవశాత్తు మనం భోజనం కోసం వాడే పాత్రలు చాలావరకు ఈ కోవలోకే వస్తాయి. అలాగే స్ట్రాలూ, క్యారీ బ్యాగ్‌లను కూడా రీసైకిల్ చేయడం తలకు మించిన భారం. ఇక కాఫీ కప్పులది మరో సమస్య. కాఫీ ఇంకిపోకుండా ఉండేందుకు, దాన్ని వేర్వేరు పొరల్లో, పూతలతో రూపొందిస్తారు. వాటిని విడదీస్తే కానీ రీసైకిల్ సాధ్యం కాదు. ప్లాస్టిక్‌తో మరో సమస్య కూడా ఉంది. దాన్ని రీసైకిల్ చేసే అవకాశం ఉన్నా కూడా… అలా చేసిన ప్రతిసారీ దాని నాణ్యత తగ్గిపోతుంది. పైగా అలా రూపొందించే సమయంలో సరికొత్త ప్లాస్టిక్ కొంత కలపాల్సి ఉంటుంది. ఈ తతంగం అంతా అడుసు తొక్కనేల అనే సామెతను గుర్తుచేయక మానదు.
వినియోగదారులుగా మనం వాడుతున్న వస్తువులు ఎంతకాలం మన్నుతాయనే కాదు! వాటి ఉపయోగం తీరాక పరిస్థితి ఏమిటన్నదీ ఆలోచించాలి. ఉదాహరణకు గాజు లేదా లోహాలతో చేసిన వస్తువులను రీసైకిల్ చేయడం చాలా సులువు. కానీ, ప్లాస్టిక్ విషయంలో ఇందాక చెప్పుకొన్న సమస్యలన్నీ ఎదురవుతాయి. ఒకవేళ ప్లాస్టిక్ వాడితే, అది పెట్ (PET) బాటిల్స్ తరహా రీసైకిల్ చేసేందుకు వీలైన వస్తువులను ఎంచుకోవాలి.
నిర్మూలించండి (Rot)
కొన్ని వ్యర్థాలను పారేయక తప్పని పరిస్థితి. కొన్నిటిని జాగ్రత్తగా రీసైకిల్ చేసుకునే అవకాశం ఉంది. కొన్నిటిని పూర్తిగా నిర్మూలించే అవకాశం మన చేతిలోనే ఉంది. ఇదేమీ కొత్త విద్య కాదు. మన ముందు తరం ఆచరించిందే! పెరట్లో ఓ గొయ్యి తీసి అందులో వ్యర్థ పదార్థాలన్నీ పారేసేవారు. అట్టముక్కలు, ఎండుటాకులు, టీపొడి, కోడిగుడ్డు పెంకులు, రంపపు పొట్టు, పండ్లు, కూరగాయలు… అన్నీ ఇందులోకి చేరేవి. ఇవన్నీ అక్కడి మట్టిలో కుళ్లిపోయి సేంద్రియ ఎరువుగా మారేవి. కాస్త అవగాహన, అనుభవం ఉంటే చాలు… వ్యర్థాలను విలువైన కంపోస్టుగా మార్చేయవచ్చు. ఒకవేళ ఎవరైనా ఈ పద్ధతిని కొత్తగా మొదలుపెడితే బ్రౌన్+గ్రీన్ అనే సూత్రాన్ని ప్రయత్నిస్తే తేలికవుతుంది. ఎండుటాకులు, పేపర్లు, మట్టి లాంటివన్నీ బ్రౌన్ విభాగంలోకి వస్తాయి. తడి పదార్థాలన్నీ గ్రీన్ విభాగంలోకి వస్తాయి. బ్రౌన్ పదార్థాలు ఎక్కువైతే కంపోస్టు తయారు కాదు. గ్రీన్ శాతం ఎక్కువగా ఉంటే, కుళ్లిన వాసన వస్తుంది. ఇందులో వేయకూడని వ్యర్థాల గురించి కూడా అవగాహన ఉండాలి. నూనె పదార్థాలు కంపోస్టును కలుషితం చేసే ప్రమాదం ఉంది. జుట్టు లాంటివాటిని కూడా వేయవచ్చు కానీ, అవి కలవడానికి కాస్త సమయం పడుతుంది. ఎముకలు, గోళ్లు, జీవ వ్యర్థాలు వేయనే కూడదు. పాల పదార్థాలతో సూక్ష్మ క్రిములు, దుర్వాసన లాంటి సమస్యలు వస్తాయి. ఈ జాగ్రత్తలు పాటిస్తే కనుక… ఇంట్లోనే ఓ చిన్న డబ్బాను ఏర్పాటు చేసుకుని కంపోస్టు తయారుచేయవచ్చు.
వ్యర్థాల నియంత్రణలో రీథింక్ అనే సూత్రం వినిపిస్తున్నది. ఒక వనరుని వినియోగించే ముందర మరోసారి ఆలోచించమని ఇది సూచిస్తుంది. ఒక వస్తువుని నిజంగా కొనాల్సిన అవసరం ఉందా, ఒకవేళ కొనాలంటే అది డిస్పోజబుల్ అయ్యుండాలా… లాంటి బేరీజుల రివాజు మంచిదే! ఒక వస్తువును ఉపయోగించేటప్పుడు కూడా కాస్త ఆలోచన ఉండాలి. పాల ప్యాకెట్‌ను కత్తిరించినప్పుడు విడిపోయే ముక్కలు కూడా పుడమికి ప్రాణాంతకమే! చవకైన చైనా బొమ్మను పారేసినప్పుడు అందులో ఉండే బ్యాటరీలు విషమే. మన ముందు తరాల కోసం ఆస్తులు కూడబెడతాం. వారి భవిత బాగుండాలని మంచి చదువు చదివిస్తాం. అలాంటిది వాళ్ల కోసం వారసత్వంగా వచ్చిన పర్యావరణాన్ని కాపాడుకోలేమా! ఎందుకు కాపాడుకోలేం!!
చేయిదాటిపోతోంది!
ఓ నివేదిక ప్రకారం.. 1950 నుంచి 2015 వరకు 8.3 బిలియన్ మెట్రిక్ టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసిందీ లోకం. దీన్ని కిలోల్లోకి మార్చుకుంటే కండ్లు తిరగడం ఖాయం. అందులో 80 శాతం వ్యర్థమేనని భావిస్తున్నారు. ఇంకొంత కాలం ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు ఇలాగే పోగుచేసుకుంటే, ఆ వలయాన్ని ఆపలేమని స్టాక్ హోమ్ విశ్వవిద్యాలయ పరిశోధనలో తేలింది. ప్లాస్టిక్ వ్యర్థాలు చిన్నచిన్న కణాలుగా విడిపోయి, మనం తినే ఆహారంలోకి, తాగే నీటిలోకి చేరుతున్నాయి. ఆఖరికి మనం పీల్చే గాలిలోనూ మైక్రో ప్లాస్టిక్స్ చొరబడుతున్నాయి. దురదృష్టం ఏమిటంటే… పర్యటకులు ఎక్కువగా ఉన్న గోవా లాంటి ప్రదేశాలు, మహారద్దీగా ఉండే ఢిల్లీలాంటి రాష్ర్టాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు అనూహ్యంగా పేరుకుంటున్నాయి. దేశంలో ప్లాస్టిక్ వ్యర్థాల సగటు, ఒక మనిషికి ఎనిమిది గ్రాములు ఉంటే, గోవాలో ఇది 60 గ్రాములుగానూ, ఢిల్లీలో 37 గ్రాములుగాను ఉంది. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణంలో ప్లాస్టిక్ వాడకం తక్కువగా ఉన్నా… అక్కడ దాన్ని సరైన రీతిలో రీసైకిల్ చేసే అవకాశం లేకపోవడం మరో సమస్య!
కొవిడ్ వ్యర్థాలు ఎలా?
పర్యావరణ స్పృహ ఎంతోకొంత మెరుగవుతున్న సమయంలోనే కొవిడ్ విరుచుకుపడింది. టన్నుల కొద్దీ పీపీయీ కిట్లు, మాస్కులు నేలమీద దేవులాడుతున్నాయి. నీళ్లలోకి చేరిపోయి జీవాల మీద కొవిడ్‌ను మించిన ప్రభావం చూపిస్తున్నాయి. ఓ అంచనా ప్రకారం, మన దేశంలోనే రోజుకు 517 టన్నుల కొవిడ్ వ్యర్థాలు వెలువడుతున్నాయి. ఆసుపత్రులు, క్వారంటైన్ కేంద్రాలు వీటిని సేకరించేందుకు రకరకాల జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. భిన్నమైన రంగుల సంచులతో వాటిని వేరు చేసే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ వ్యర్థాల సమస్యను తగ్గించేందుకు అప్‌సైక్లింగ్ లేదా రీసైక్లింగ్ చేసే ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. ఉదాహరణకు థాయ్‌లాండ్‌లోని టఫెటా అనే దుస్తుల కర్మాగారం, ప్లాస్టిక్ బాటిల్స్ నుంచి పీపీయీ కిట్లను తయారుచేస్తున్నది. గుజరాత్‌కు చెందిన బినిష్ దేశాయ్… వాడేసిన మాస్కులు, పీపీయీ కిట్లను ఉపయోగించి ఏకంగా ఇటుకలనే తయారుచేశాడు. ఇక వ్యక్తిగత స్థాయిలో ఎవరు ఎలాంటి చర్యలు తీసుకోగలరన్నది మరింత ముఖ్యం! మళ్లీమళ్లీ ఉపయోగించగలిగే మాస్కులు, తరచూ నింపుకోగలిగే శానిటైజర్ సీసాల తయారీ, క్వారంటైన్ సమయంలో డిస్పోజబుల్ పాత్రల బదులు స్టీల్ పాత్రల వినియోగం… లాంటి చర్యలతో కొవిడ్ వ్యర్థాలను అదుపులో ఉంచవచ్చు.
మళ్లీ వాడండి (Reuse)
ఒకప్పటి సంగతి! ఇంట్లో ఓ వస్తువు ఉపయోగం గడిచాకో, మోజు తీరాకో… దాన్ని మరో విధంగా వాడే ప్రయత్నం జరిగేది. ఒక చీర మసిగుడ్డల్లోకి చేరేలోగా ఎన్నో రూపాలు మార్చేది. ఇప్పుడంతా ‘యూజ్ అండ్ త్రో’ యుగం. కొనుగోలు శక్తి పెరిగిపోవడం, ఎప్పటికప్పుడు సరికొత్త ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో… వస్తువులని తిరిగి వాడుకునే అలవాటు తగ్గిపోతోంది. ఇందుకో మధ్యేమార్గం లేకపోలేదు.
E-వేస్ట్
2017 లెక్కల ప్రకారం, మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఎలక్ట్రానిక్ వ్యర్థాల మోతాదు ఇరవై లక్షల టన్నులు. అవి ఇప్పటికి రెట్టింపు అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. పాత కీబోర్డులూ, సెల్ఫోన్లు,
కేబుల్ వైర్లు… అన్నిటినీ నిర్లక్ష్యంగా పడేయటం మనకు అలవాటే.
కొన్ని మార్గాలు
స్టార్టప్స్‌కు అవకాశం!
భూమి మీద వ్యర్థాలకు కారణం.. వినియోగదారులు మాత్రమే కాదు, వాటిని తిరిగి ఉపయోగించడంలో అశ్రద్ధ చూపే వాణిజ్య సంస్థలు కూడా. నేషనల్ జాగ్రఫిక్ అంచనా ప్రకారం, భూమ్మీద ఇంకా 91 శాతం ప్లాస్టిక్ వృథాగా పడుంది. డంపింగ్ యార్డుల్లోను, సముద్రపు లోతుల్లోనూ పేరుకుపోయింది. దిగ్గజ సంస్థలకు వీటి జోలికి వెళ్లేంత సమయం, సహనం ఉండవు. కానీ స్టార్టప్స్ కనుక పూనుకుంటే,ఆ వ్యర్థాలతో సంపదను సృష్టిస్తూనే, సమస్యను పరిష్కరించవచ్చు.