చండీగఢ్, ఫిబ్రవరి 17: రైతుల సమస్యలను పరిష్కరించడంలో, ధరలను అదుపు చేయడంలో, నిరుద్యోగాన్ని తగ్గించడంలో కేంద్రంలోని బీజేపీ సర్కారు పూర్తిగా విఫలం అయిందని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్ విమర్శించారు. బీజేపీ అనుసరిస్తున్న విదేశాంగ విధానం దేశానికి కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నదని పేర్కొన్నారు. పొరుగు దేశాలతో సత్సంబంధాలు దెబ్బతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఏడాది కాలంగా చైనా సైన్యం మన భూభాగాన్ని ఆక్రమించుకొంటున్నది. చైనాను నిలువరించడానికి బదులు వాళ్ల ఆక్రమణ బయటకు తెలియకుండా దాచే ప్రయత్నాలు జరుగుతున్నాయి’ అని మన్మోహన్ వ్యాఖ్యానించారు. మోదీ సర్కారు తన తప్పును అంగీకరించడానికి బదులు ప్రజా సమస్యలకు ఇప్పటికి కూడా దేశ మొట్టమొదటి ప్రధాని నెహ్రూనే కారణం అని మొండిగా వాదిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘బీజేపీ జాతీయవాదం బ్రిటిష్ వాళ్లు అనుసరించిన విభజించు.. పాలించు విధానంపై ఆధారపడి ఉంది’ అని విమర్శించారు.
పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో మన్మోహన్ ఈ సందేశం ఇచ్చారు. ప్రధాని మోదీకి భద్రతా వైఫల్యం పేరుతో పంజాబ్ సీఎం చన్నీ, పంజాబ్ ప్రజలపై నింద వేయడానికి ప్రయత్నం జరిగిందని మన్మోహన్ ఈ సందర్భంగా ఆరోపించారు. రైతు ఉద్యమంలోనూ పంజాబ్ గౌరవాన్ని దెబ్బ తీయడానికి కుట్ర జరిగిందన్నారు. ‘పంజాబీల ధైర్యం, దేశభక్తి, త్యాగాలను చూసి ప్రపంచం సెల్యూట్ చేస్తుంది. కానీ మోదీ ప్రభుత్వం దీని గురించి మాట్లాడదు. ఒక పంజాబీగా, నిజమైన భారతీయుడిగా ఇది నాకు తీవ్ర బాధ కలిగిస్తున్నది’ అన్నారు.