అమరావతి : ఏపీలో కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేకుండా వ్యవహరిస్తుందని వైసీపీ నాయకుడు, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ( Botsanarayana ) ఆరోపించారు. ముఖ్యంగా చంద్రబాబు ( Chandrababu) ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కాశీబుగ్గ ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాంటి (Stampede) ఘటనలు జరుగుతూనే ఉంటాయని విమర్శించారు.
బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాశీబుగ్గ వేంకటేశ్వస్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మృతి చెందితే ఆలయం ప్రైవేట్ ఆలయమని పేర్కొనడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అన్నారు. ఎక్కువ మంది భక్తులు వస్తారని ప్రభుత్వానికి అంచనా లేదా అని ప్రశ్నించారు. తిరుపతి, సింహాచలం ఘటన నుంచి ప్రభుత్వం ఏం నేర్చుకుందని, ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
కూటమి ప్రభుత్వ పాలన వల్ల ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని విమర్శించారు. ప్రకృతి విపత్తు జరిగినప్పుడు ప్రభుత్వ విధానం బాధాకరంగా ఉందని వెల్లడించారు. తుపాను పంట నష్టంపై ప్రభుత్వానికి స్పష్టత లేదని విమర్శించారు. వైఎస్ జగన్ పాలనలో రైతులను అన్ని విధాలుగా ఆదుకున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వమే రైతులకు బీమా చెల్లించి పంట నష్ట పరిహారాన్ని అందజేసిందని గుర్తు చేశారు.
ఇటీవల మొంథా తుపాను వల్ల అన్ని రకాల పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటివరకు ప్రభుత్వం నష్టపరిహారం ప్రకటించకపోవడం దురదృష్టకరమని ఆరోపించారు. లక్షలాధి కోట్లను అప్పులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం రైతుల బీమాను ఎందుకు కట్టడం లేదని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందినప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రతిపక్షాలపై నెపాన్ని వేస్తున్నారని మండిపడ్టారు.