న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రంగం సిద్ధమైంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్, ప్రతిపక్ష ఇండియా కూటమి అభ్యర్థిగా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి బీ సుదర్శన్ రెడ్డి పోటీ పడుతున్న ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన పోలింగ్ మంగళవారం జరగనున్నది. సాధారణ రాజకీయ తంతుగా ముగిసే ఉప రాష్ట్రపతి ఎన్నికను కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి ప్రతిష్టాత్మక పోరుగా మలచింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ తన నామినీగా సీపీ రాధాకృష్ణన్‌ని నిర్ణయించడంతో ప్రతిపక్ష కూటమి కూడా ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని తమ అభ్యర్థిగా సుదర్శన్‌రెడ్డిని ముందుకు తెచ్చింది. బీజేపీ సీనియర్ నాయకుడైన రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఆయన మహారాష్ట్ర గవర్నర్‌గా ఉన్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తున్న సుదర్శన్‌రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న కాలంలో ఆయన పలు కీలకమైన తీర్పులు వెలువరించారు. అందులో సల్వా జుడుంని చట్టవ్యతిరేకంగా ప్రకటించడం కూడా ఉంది.
పార్లమెంట్ హౌస్‌లో మంగళవారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్నది. పార్లమెంట్ ఉభయ సభలకు చెందిన సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమై రాత్రికల్లా ఫలితం వెలువడనున్నది. రొటేషన్ పద్ధతిలో రిటర్నింగ్ అధికారిగా లోక్‌సభ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ని ఎన్నికల కమిషన్ నియమిస్తుంది. ఉభయ సభలలో పార్టీల వారీగా బలాబలాలను పరిగణనలోకి తీసుకుంటే క్రాస్ ఓటింగ్ జరగని పక్షంలో ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కి 439 మంది ఎంపీల బలం ఉంది. కాగా, బీఆర్ఎస్, బీజేడీకి చెందిన 18 మంది ఎంపీలు ఓటింగ్‌కి దూరంగా ఉండనున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. ఇండియా కూటమి నుంచి వైదొలగిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సుదర్శన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించింది. ఏ కూటమిలో ప్రత్యక్షంగా లేని వైఎస్ఆర్సీపీ మాత్రం రాధాకృష్ణన్‌కి మద్దతు ఇవ్వనున్నట్లు తెలిపింది.
ఉప రాష్ట్రపతి అభ్యర్థిని అధికార పక్షం నామినేట్ చేస్తుంది. ఆ అభ్యర్థిపై ప్రతిపక్షం తమ అభ్యర్థిని బరిలో నిలపవచ్చు. ఓటింగ్‌లో పాల్గొనడానికి 543 మంది లోక్‌సభ సభ్యులు, 245 మంది రాజ్యసభ సభ్యులతోసహా మొత్తం 788 మంది పార్లమెంట్ సభ్యులు అర్హులు. ఖాళీలను మినహాయిస్తే 781 మంది ఎంపీలు ఓటు వేయడానికి అర్హులు. రాష్ట్రపతి ఎన్నికలో ఎంపీలు, రాష్ట్ర అసెంబ్లీ సభ్యుల విలువ వేరేగా ఉంటుంది. కాని ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఒక్కో సభ్యుడి విలువ ఒకటి మాత్రమే. సీక్రెట్ బ్యాలెట్ పద్ధతిలో జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఎంపీలకు పార్టీ విప్ వర్తించదు. చెల్లుబాటైన ఓట్లలో 50 శాతానికి మించి ఓట్లను సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.