అగ్ర దర్శకుడు రాజమౌళి తన సినిమాల తాలూకు కథా వివరాల్ని వెల్లడించడానికి అంతగా సంకోచించరు. షూటింగ్‌కు ముందే ప్రెస్‌మీట్ ఏర్పాటు చేసి బేసిక్ స్టోరీలైన్‌ను రివీల్ చేస్తుంటారు. కానీ మహేష్‌బాబుతో రూపొందిస్తున్న తాజా చిత్రం ‘వారణాసి’ విషయంలో మాత్రం రాజమౌళి తన రెగ్యులర్ పంథాకు భిన్నంగా వెళ్లారు. ఇప్పటివరకు కథ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. హైదరాబాద్‌లో నిర్వహించిన గ్లోబ్‌ట్రాటర్ ఈవెంట్లో ప్రదర్శించిన గ్లింప్స్‌లో సైతం కథా నేపథ్యాన్ని పూర్తిగా బయటపెట్టలేదు. భారతీయ ఆధ్యాత్మికత, సైన్స్ కలబోసిన కథాంశమని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది.
మొత్తంగా ‘వారణాసి’ సినిమా జోనర్పై ప్రేక్షకులు కన్ఫ్యూజన్లో పడ్డారు. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా జోనర్పై రాజమౌళి స్వయంగా స్పందించారు. ‘వారణాసి’ సైన్స్ ఫిక్షన్ ఫీల్‌తో ఉంటుందని, అయితే పూర్తిగా అదే కాన్సెప్ట్ కాదని అన్నారు. ఫాంటసీ మైథలాజికల్ ఫిల్మ్‌గా రూపొందిస్తున్నామని స్పష్టతనిచ్చారు. దీంతో ఈ సినిమా జోనర్పై క్లారిటీ వచ్చినట్లయింది. దాదాపు 1300కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ప్రియాంకచోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.