దర్శకధీరుడు రాజమౌళి జీవితాశయం ‘మహాభారతం’. ఈ విషయాన్ని ఆయనే పలు సందర్భాల్లో చెప్పారు. ‘మహాభారతం’ తీయడం తన జీవితాశయమని, కాకపోతే దాన్ని తెరకెక్కించాలంటే ప్రస్తుతం తనకున్న అనుభవం చాలదని, మహాభారతాన్ని ఒకట్రెండు భాగాల్లో చెప్పలేమని.. కనీసం అయిదారు భాగాలన్నా తీయాల్సుంటుందని పలు సందర్భాల్లో రాజమౌళి అన్నారు. అయితే.. ఇటీవల ఓ నేషనల్ చానల్ ఇంటర్వ్యూలో ‘మహాభారతం’ గురించి రాజమౌళి చెప్పిన విషయాలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. దాంతో రాజమౌళి ‘మహాభారతం’ ఇప్పుడు మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది.
‘మీరు మహాభారతం తీస్తే.. ఏఏ పాత్రలకు ఎవర్ని తీసుకుంటారు?’ అన్న ప్రశ్నకు రాజమౌళి సమాధానమిస్తూ.. ‘శ్రీకృష్ణ పాత్రకు తారక్‌ని తీసుకుంటా. ఎందుకంటే ఆ పాత్రను తన స్థాయిలో ఎవరూ రక్తికట్టించలేరు. అతనిలో వాళ్ల తాతగారి పోలికలుంటాయి. అతన్ని కృష్ణుడిగా ఆడియన్స్ అంగీకరిస్తారు. అలాగే.. కర్ణుడిగా ప్రభాస్‌ను తప్ప మరొకర్ని ఊహించలేను.’ అని తెలిపారు.
రీసెంట్గా జరిగిన ‘హిట్ 3’ వేడుకలో ‘నా మహాభారతంలో నాని కూడా ఉంటాడు. అయితే ఏ పాత్రో చెప్పను.’ అని వేలాది మంది సమక్షంలో ప్రకటించారు రాజమౌళి. దాంతో నానిని రాజమౌళి ఏ పాత్రకు అనుకుంటున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మొత్తంగా రాజమౌళి ‘మహాభారతం’లో ఎన్టీఆర్, ప్రభాస్, నాని కన్ఫార్మ్ అయ్యారన్నమాట. ఇంకెంతమంది హీరోలు ఈ ప్రస్టేజియస్ ప్రాజెక్టులో భాగం అవుతారో చూడాలి.