Sruthi Hassan | నటి శృతి హాసన్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలపై మరోసారి ఓపెన్‌గా మాట్లాడింది. నటి సోహా అలీ ఖాన్ నిర్వహిస్తున్న ‘ఆల్ అబౌట్ హర్’ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న శృతి హాసన్.. పెళ్లి, జీవిత భాగస్వామి, మాతృత్వం, తన ఆరోగ్య సమస్యల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ముఖ్యంగా పెళ్లి విషయంలో తన ఆలోచనలను స్పష్టంగా చెప్పడంతో ఆమె వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. తన జీవితంలో ఒకసారి పెళ్లి వరకు వెళ్లానని, అయితే చివరికి ఆ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చానని శృతి హాసన్ వెల్లడించింది. జీవితంలో ఒక భాగస్వామి ఉండటం తనకు ఇష్టమే కానీ.. పెళ్లి అనే వ్యవస్థలో తప్పనిసరిగా ఇమిడిపోవాల్సిన అవసరం తనకు లేదని చెప్పింది.
సంప్రదాయాలపై తనకు గౌరవం ఉన్నప్పటికీ.. పెళ్లి పేరుతో భారీగా ఖర్చు చేయడం, చట్టపరమైన ప్రక్రియలోకి వెళ్లడం తనకు పెద్దగా నచ్చదని పేర్కొంది. ఆ మొత్తాన్ని ఇతర మంచి పనులకు, ముఖ్యంగా అవసరమైన వారికి సహాయం చేయడానికి ఉపయోగిస్తే మరింత ప్రయోజనకరంగా ఉంటుందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. పెళ్లి అనేది కేవలం ఒక కాగితంపై సంతకం చేయడం కాదని.. ఇద్దరు వ్యక్తులు ప్రతిరోజూ ఒకరినొకరు ప్రేమించుకుంటూ, అర్థం చేసుకుంటూ కలిసి ఉండటమే ముఖ్యమని శృతి హాసన్ చెప్పింది. ఇదే సందర్భంగా తన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా శృతి హాసన్ మాట్లాడింది. తనకు చిన్న వయసులోనే పీసీఓఎస్ (పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్)కు సంబంధించిన సమస్యలు ఉన్నాయో లేదో తెలియని పరిస్థితి ఎదురైందని చెప్పింది. భవిష్యత్తులో పిల్లలను కనడం కష్టమవుతుందని వైద్యులు చెప్పిన సందర్భం కూడా ఉందని వెల్లడించింది.
ఈ కారణంగా మాతృత్వం గురించి మాట్లాడాలన్నా తనలో భయం ఉండేదని శృతి హాసన్ తెలిపింది. అయితే ఇటీవల తన స్త్రీ వైద్య నిపుణురాలితో మాట్లాడిన తర్వాత మాతృత్వంపై తన ఆలోచనల్లో మార్పు వచ్చిందని చెప్పింది. తల్లిగా మారాలన్న కోరిక తనకు ఉందని శృతి హాసన్ స్పష్టం చేసింది. అయితే అందుకు తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాల్సిన అవసరం లేదని ఆమె అభిప్రాయపడింది. తల్లిగా మారేందుకు ప్రస్తుతం ఎన్నో మార్గాలు ఉన్నాయని తెలుసుకున్నానని చెప్పింది. పెళ్లి కాకుండానే తన సొంత బిడ్డకు తల్లి కావడంతో పాటు.. అవసరమైతే ఒక బిడ్డను దత్తత తీసుకోవడానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని శృతి హాసన్ వెల్లడించింది. మాతృత్వానికి జీవసంబంధమైన బిడ్డ మాత్రమే ఏకైక మార్గం కాదని, దత్తత కూడా ఒక మంచి అవకాశమని ఆమె అభిప్రాయపడింది.