Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10 హౌస్‌లో నామినేషన్ల వేడి కొనసాగుతోంది. నిన్న సగం నామినేషన్స్ మాత్రమే పూర్తవ్వగా.. మిగిలిన ప్రక్రియ నేటి ఎపిసోడ్లో కొనసాగింది. అయితే నామినేషన్ల కంటే ముందుగా సుధీర్–సృష్టి మధ్య జరిగిన గొడవకు సంబంధించిన చర్చలే హౌస్‌లో మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. సృష్టి తనపై అరిచిన తీరుపై సుధీర్ బాధపడగా.. వర్షిణితో తన ఆవేదనను పంచుకున్నాడు.కాగా, నిన్నటి నామినేషన్ల సమయంలో సుధీర్, సృష్టి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయంపై వర్షిణి, సుధీర్ మాట్లాడుకున్నారు. సుధీర్‌పై సృష్టి తీవ్ర వ్యాఖ్యలు చేయడాన్ని వర్షిణి తప్పుబట్టింది. మరోవైపు రామ్ ప్రసాద్ కూడా సృష్టి ప్రవర్తనపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. సుధీర్‌ను సృష్టి తీవ్రంగా తిట్టినందుకు ఆమెను నామినేట్ చేయాలని నరేష్‌కు సూచించాడు. డబుల్ నామినేషన్ అవకాశం వస్తే నరేష్ ఆ అవకాశాన్ని సృష్టిపై ఉపయోగించాలని రామ్ ప్రసాద్ చెప్పాడు.
సుధీర్ కూడా రామ్ ప్రసాద్‌తో ఈ విషయంపై మాట్లాడాడు. సృష్టి తనకు నచ్చలేదని రామ్ ప్రసాద్ స్పష్టం చేశాడు. ముఖ్యంగా నాగార్జున కనిపించడం లేదని సృష్టి చెప్పిన సందర్భంలోనే తాను అలా స్పందించిందని భావిస్తున్నట్లు రామ్ ప్రసాద్ సుధీర్‌తో చెప్పాడు. మరోవైపు సృష్టి తన ‘అగ్నిపరీక్ష’ బృందంతో కూర్చొని ఈ వ్యవహారంపై చర్చించింది. ఝాన్సీ సుధీర్‌కు మద్దతుగా మాట్లాడుతోందని సృష్టి చెప్పగా.. రోహిత్ ఝాన్సీపై వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశాడు. అనంతరం సృష్టి వంశీ, త్రిగుణ్‌లతో కూడా ఈ విషయంపై చర్చించింది. రోహిత్ మరోసారి త్రిగుణ్‌ను ‘శకుని’ అంటూ ఇతర కంటెస్టెంట్ల వద్ద ప్రతికూలంగా మాట్లాడటం కనిపించింది. ఆ తర్వాత నిన్న ఆగిపోయిన నామినేషన్ ప్రక్రియ తిరిగి ప్రారంభమైంది. నిన్న జరిగిన ఎన్వలప్ ఆట ఆధారంగానే మిగిలిన నామినేషన్స్ కొనసాగాయి. ముందుగా ముకేశ్‌కు అవకాశం రాగా.. అతను చరణ్‌ను నామినేట్ చేశాడు. రీ ఎంట్రీ తర్వాత కూడా చరణ్ మళ్లీ సైలెంట్‌గా ఉంటున్నాడని, ఆటలో సీరియస్‌గా పాల్గొనడం లేదని ముకేశ్ కారణం చెప్పాడు.
అంతేకాకుండా చరణ్‌కు ‘స్టార్ ప్లేయర్’ గుర్తింపు రావడం తనకు అంతగా నచ్చడం లేదని ముకేశ్ వ్యాఖ్యానించాడు. కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన తప్పులను కూడా ప్రస్తావించాడు. దీనిపై చరణ్ తీవ్రంగా స్పందించాడు. ఆటలో లేని సమయంలో, హౌస్‌లో లేని సమయంలో జరిగిన విషయాల గురించి ముకేశ్ ఎలా మాట్లాడుతున్నాడంటూ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. మరోవైపు వంశీ కూడా ముకేశ్‌తో గొడవకు దిగాడు. తర్వాత షాలినికి నామినేషన్ అవకాశం వచ్చింది. ముందుగా ఊహించినట్టుగానే ఆమె వర్షిణిని నామినేట్ చేసింది. వర్షిణి వెనుక ఉండి ఇతరులను నడిపిస్తోందని, హౌస్‌లో గొడవలు పెరగడానికి ఆమె కారణమవుతోందని షాలిని ఆరోపించింది. దీంతో షాలిని, వర్షిణి మధ్య మరోసారి మాటల యుద్ధం జరిగింది.
అనంతరం సృష్టికి నామినేషన్ అవకాశం రావడంతో ఆమె మరోసారి సుధీర్‌నే టార్గెట్ చేసింది. నిన్నటి గొడవను ప్రస్తావిస్తూ సుధీర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఈసారి సుధీర్ మాత్రం కాస్త ప్రశాంతంగా స్పందించాడు. నామినేషన్స్ ప్రక్రియ పూర్తయ్యే సమయానికి ఈ వారం నామినేషన్లో వంశీ, సుధీర్, షాలిని, అమన్, ఝాన్సీ, త్రిగుణ్, చరణ్, వర్షిణి నిలిచారు.నామినేషన్స్ పూర్తయిన తర్వాత సుధీర్ భావోద్వేగానికి గురయ్యాడు. సృష్టి తనపై అరవడం తనకు బాధ కలిగించిందని వర్షిణి వద్ద చెబుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ సందర్భంగా వర్షిణి కూడా సుధీర్‌కు మద్దతుగా మాట్లాడింది. ఇద్దరూ కలిసి త్రిగుణ్‌పై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఇక నామినేషన్స్ తర్వాత బిగ్ బాస్ ‘టెంప్టేషన్–టెన్షన్’ ఆటను పరిచయం చేశాడు. గార్డెన్, లివింగ్ ఏరియాలో ఏర్పాటు చేసిన రెండు బజర్లలో సైరన్ వినిపించిన వెంటనే ఎవరు ముందుగా బజర్ నొక్కుతారో వారికి టెంప్టేషన్ కోసం పోటీ చేసే అవకాశం ఉంటుందని బిగ్ బాస్ వివరించాడు. ఆ పోటీలో గెలిచిన కంటెస్టెంట్‌కు వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్‌గా నేరుగా అవకాశం లభించడంతో పాటు ఒక టెంప్టేషన్ కూడా దక్కుతుంది. అయితే ఆ టెంప్టేషన్ కోసం మరో కంటెస్టెంట్‌కు టెన్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ బజర్ పోటీలో ముకేశ్, రోహిత్ విజయం సాధించారు. అనంతరం ఇద్దరికీ ప్రత్యేక టాస్క్ ఇచ్చారు. ‘దేవర’ సినిమాలో ఎన్టీఆర్ చేసిన తరహాలో బాక్సులను తోసే ఈ టాస్క్‌లో ఒకే బాక్స్‌ను ఇద్దరూ ఎదురెదురుగా తోసుకుంటూ ప్రత్యర్థిని బయటకు పంపించాల్సి ఉంటుంది. అమన్ ఈ ఆటకు సంచాలకుడిగా వ్యవహరించాడు. చివరికి ముకేశ్ విజయం సాధించాడు. దీంతో ముకేశ్ వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్‌గా నేరుగా అర్హత సాధించాడు. అదే సమయంలో అతనికి ఒక టెంప్టేషన్‌ను కూడా గెలుచుకునే అవకాశం వచ్చింది.