తిరుమల : తిరుమలలో ( Tirumala ) శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలకు ( Teppottsavam ) ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చి 9న రాత్రి 7 గంటలకు తెప్పోత్సవాలు ప్రారంభమవుతాయని టీటీడీ ( TTD ) అధికారులు వివరించారు. ఈనెల 13వ తేదీ వరకు ప్రతిరోజూ రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్లు పుష్కరిణిలో ఆనందవిహారం చేస్తారని వెల్లడించారు.
ప్రతి ఏటా ఫాల్గుణ మాసంలో శుద్ధ ఏకాదశినాడు ప్రారంభమయ్యే తెప్పోత్సవాలు పౌర్ణమి వరకు కొనసాగుతాయని తెలిపారు. తెప్పోత్సవాల సందర్భంగా ఇంజినీరింగ్ అధికారులు తెప్పను సిద్ధం చేసి విద్యుద్దీపాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు.
స్వామి పుష్కరిణిని అందంగా అలంకరించారు. తెప్పచుట్టూ నీటిజల్లులు(షవర్) పడేలా ఏర్పాట్లు చేశారు. తొలిరోజు సాయంత్రం సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీ రామచంద్రమూర్తి, రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు మాడవీధుల్లో ఊరేగుతూ పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు విహరిస్తారని చెప్పారు.
ఆర్జిత సేవలు రద్దు
తెప్పోత్సవాల కారణంగా మార్చి 9, 10వ తేదీల్లో సహస్రదీపాలంకార సేవ, మార్చి 11, 12, 13వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది.