తిరుమల : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ( Salakatla Brahmotsavam ) తిరుమలలో వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల ఎనిమిదో రోజు బుధవారం ఉభయదేవేరులతో శ్రీమలయప్పస్వామి రథోత్సవం ( Rathotsavam ) అంగరంగ వైభవంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి రథాన్ని లాగారు. శ్రీవారికి భక్తులు అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు.
గోవిందనామస్మరణతో ఆలయ మాడవీధులు మారుమోగాయి. ఈ కార్యక్రమంలో తిరుమల పెద్దజీయర్‌స్వామి, చిన్నజీయర్‌స్వామి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పలువురు బోర్డు సభ్యులు, జెఈవో వీరబ్రహ్మం, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.