నిజామాబాద్, జూన్ 29, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వెలవెల బోతోంది. ఈ సీజన్లో జూన్ నెల ముగింపునకు చేరుకుంది. అయినప్పటికీ ఆశాజనకంగా వర్షాలు కురియలేదు. ఇప్పటి వరకు సంతృప్తికరంగా ఇన్‌ఫ్లో కూడా ఎస్సారెస్పీకి రాలేదు. కేవలం ఒక టీఎంసీ మాత్రమే వరద నీరు వచ్చింది. అయినప్పటికీ డెడ్ స్టోరేజీ ముప్పు నుంచి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బయట పడలేదు. వర్షాకాలంలో భారీ వర్షాలు కురవడం గగనమైన నేపథ్యంలో దిగువ ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈసారి వానలు తక్కువగా కురుస్తాయనే అంచనాల మేరకు రైతులంతా మొగులు వైపు చూస్తున్నారు. కారు మబ్బులు ఊరిస్తున్నప్పటికీ చినుకు రాల్చడం లేదు.
రైతులను సాంత్వన చేకూర్చేలా కొద్ది పాటి వర్షం కురుస్తున్నప్పటికీ ఊరటను ఇవ్వడం లేదు. ఈ పరిస్థితిలో జూలై 1(రేపు మంగళవారం) బాబ్లీ గేట్లు ఎత్తనుండటంతో అందరి చూపు ఎగువ మహారాష్ట్ర వైపే నెలకొంది. బాబ్లీ ప్రాజెక్టు నుంచి వరద ఆశించిన స్థాయిలో రావడం గగనమేనని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు. మహారాష్ట్రలోనూ వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వరద నీరు ఉరకలెత్తడం తక్కువేనని అంచనా వేస్తున్నారు. ఏటా జూలై 1న గేట్లు ఎత్తి నాలుగు నెలల పాటు దిగువకు బాబ్లీ ద్వారా వరదను వదులుతారు. అక్టోబర్ 28న బాబ్లీ గేట్లు మూసేస్తారు. ఈ నాలుగు నెలల కాలంలో మహారాష్ట్రలో కురిసే అతి భారీ వానలపైనే ఎస్సారెస్పీ భవితవ్యం ఆధారపడి ఉంది.
వానాకాలం సీజన్ మొదలైనప్పటికీ పాలకుల్లో ముందు చూపు మాత్రం కనిపించడం లేదు. వానాకాలం సీజన్లో ఎల్‌నినో ప్రభావం ఉంటుందని అంతటా హెచ్చరికలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే ఎలాంటి ప్రణాళికలు రచించాలన్న ఆలోచనపై చర్చించే నాథుడే దిక్కులేకుండా పోయింది. ఇన్ఛార్జీ మంత్రి సీతక్క ఇటువైపు రావడమే లేదు. నాలుగైదు నెలల క్రితం నిజామాబాద్ పర్యటనకు వచ్చి వెళ్లారు.
ఆ తర్వాత కీలకమైన అంశాలపై సమీక్షలు నిర్వహించలేదు. వానాకాలంలో యూరియా ఇక్కట్లతో రైతులు అవస్థలు పడుతున్నారు. మరోవైపు సాగు నీటి కటకట ఎదురవ్వనుండగా అప్రమత్తతపై యంత్రాంగానికి దిశానిర్ధేశం చేసే నాథుడు లేకుండా పోయారు. ఎస్సారెస్పీలో ప్రస్తుతం 1064 అడుగుల నీటి మట్టంతో 15టీఎంసీలు నీటి నిల్వ ఉంది. చిన్నపాటి వానల మూలంగా ఇన్‌ఫ్లో 3,183 క్యూసెక్కులు కొనసాగుతుంది. ఔట్‌ఫ్లో 817 టీఎంసీలుగా ఉంది. నెల రోజుల్లో 1.002టీఎంసీలు వరద వస్తే మిషన్ భగీరథ, కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా 2.184 టీఎంసీలు మేర ఔట్ ఫ్లో కొనసాగింది.