తెలుగు యూనివర్సిటీ, జూలై 14: ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. గన్‌పార్క్‌లోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం చేపట్టిన నిరసనలో విద్యార్థులు పుస్తకాలు చదువుతూ మా ఫీజులు మాకు ఇవ్వాలంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంఘాల నేతలు విద్యార్థుల నిరసనకు మద్దతు పలికారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కేవలం కాంట్రాక్టర్లకు బిల్లులు ఆపితే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు క్లియర్ అవుతాయని సూచించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఫీజు బకాయిల విడుదలపై చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బకాయిలు విడుదల చేయాలని, లేని పక్షంలో లక్షలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ ముట్టడికి పిలుపు ఇస్తామని హెచ్చరించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ ఫథకాన్ని యథావిధిగా కొనసాగించాలని వీహెచ్ కోరారు. సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, లేని పక్షంలో సెక్రటేరియట్, కలెక్టరేట్ల ముట్టడికి పిలు పు ఇస్తామని జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ హెచ్చరించారు. నిరసనలో బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ గుజ్జకృష్ణ, విద్యార్థి జేఏసీ ప్రధాన కార్యదర్శి నందగోపాల్, ఉదయ్, సానియా పాల్గొన్నారు.

హైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డి మాండ్ చేస్తూ వామపక్ష, విద్యార్థి సంఘా ల ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ‘చలో సచివాలయం’ముట్టడి కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వందలాది మంది విద్యార్థులు, నాయకులు సచివాలయం వైపు దూసుకువెళ్లడంతో సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు విద్యార్థుల నినాదాలతో మారుమోగాయి. శాంతియుతం గా నిరసన తెలుపుతున్న విద్యార్థి నాయకులను పోలీసులు బలవంతంగా అడ్డుకొని అరెస్టు చేశారు. దీంతో పోలీసులు, విద్యార్థుల మధ్య తీవ్ర తోపులాట నెలకొనడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొన్నది. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసుల తీరును విద్యార్థి సంఘాల నేతలు ఖండించారు.
సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ నాయకులు మంగళవారం కరీంనగర్‌లోని మంత్రి పొన్న ప్రభాకర్ ఇంటి ముట్టడికి యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌కు తరలించారు. సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జెల శ్రీకాంత్ డిమాండ్ చేశారు.
– కమాన్‌చౌరస్తా
మెగా డీఎస్సీ కోసం మొదటి సంతకం చేస్తానని చెప్పిన సీఎం ఆ హామీని మరచిపోయినట్టు ఉన్నారంటూ డీఈడీ, బీఈడీ అభ్యర్థులు దుయ్యబట్టారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ప్రభుత్వ తీరును తీవ్రంగా ఎండగట్టారు. విద్యాశాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేయాలని కోరారు. కోట చంటి, సురేశ్, రమ్య, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
– ఖైరతాబాద్