షాద్‌నగర్‌టౌన్, జూలై 28 : తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గురుకుల పాఠశాల్లోని విద్యార్థులు ఫుడ్ పాయిజన్‌కు గురయ్యారని ఎస్ఎఫ్ఐ షాద్‌నగర్ డివిజన్ కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. పట్టణంలోని జిల్లా పరిషత్ కుంట ఉన్నత పాఠశాలలో సోమవారం మధ్యాహ్నం విద్యార్థులతో కలిసి భోజనం చేసిన అనంతరం మాట్లాడారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఆహార భద్రతా ప్రమాణాలను ఏమాత్రం పట్టించకోకపోడంతోనే విద్యార్థులు ఫుడ్‌పాయిజన్‌తో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నాణ్యతలేని ఆహారంతో విద్యార్థులు అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. గురుకుల పాఠశాలల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించడంతో పాటు గురుకులాలలో పర్యటించి విద్యార్థుల సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అదిల్, ఖయ్యూం, ఆరీఫ్ పాల్గొన్నారు.