Shanmukha Peetam | హైదరాబాద్ గాజులరామారంలోని షణ్ముఖపురంలో వెలసిన శ్రీ శ్రీ శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవార్ల కళ్యాణోత్సవం కన్నుల పండువలా జరిగింది. స్వస్తిశ్రీ చాంద్రమానేనా శ్రీ క్రోధినామ సంవత్సర మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్టిని పురస్కరించుకొని అంగరంగవైభవంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యానోత్సవం నిర్వహించారు. పుణ్యక్షేత్ర నిర్వాహకులు శ్రీ రమేష్ గురూజీ ఆధ్వర్యంలో ఈ కళ్యాణోత్సవం జరిగింది. ఈ కళ్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుని తరించారు.
ఉదయం 6 గంటలకు గణపతి పూజతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు ప్రారంభమాయ్యాయి. పుణ్యహవచనం, రక్షాబంధనం, పంచగవ్యప్రాసన, దీక్షాధారణ, రుత్విక్ వరుణం, అంకురారోపన, మంటపారాధనలు, కళశస్థాపన, అభిషేకం నిర్వహించారు. ఉదయం 8 గంటలకు సుబ్రహ్మణ్య మూలమంత్ర హోమం, సర్వసూక్త హోమం, కుజదోష నివారణ హోమం జరిపించారు.
ఉదయం 10.30 గంటల నుంచి శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణోత్సవం జరిగింది. కళ్యాణం అనంతరం భక్త కోటికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు చూడముచ్చటగా దీపాలంకరణ సేవ జరిగింది. అనంతరం స్వామి, అమ్మవార్లకు హారతి ఇచ్చి ఉత్సవాలను ముగించారు.