నాగపట్టిణం, మే 3: కోరమాండల్ కోస్తా సమీపంలో సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళనాడు నాగపట్టిణం జిల్లాకు చెందిన 30 మందికి పైగా జాలరులపై శ్రీలంక సముద్రపు దొంగలు దాడి చేశారు. ఈ దాడిలో 17 మంది తమిళ జాలరులు గాయపడ్డారు. ఫైబర్ పడవలో కొడియాక్కరైకి ఆగ్నేయం వైపు ఉన్న జాలరులపై ఓ స్పీడ్ బోటులో వచ్చిన ఆరుగురు సముద్రపు దొంగలు పదునైన ఆయుధాలతో దాడి చేశారు. జాలరుల పడవలోని జీపీఎస్ పరికరాలు, చేపల వలలను లూటీ చేసిన దొంగలు అనంతరం సమీపాన ఉన్న ఇతర పడవలపై దాడి చేశారు. దాదాపు రూ.10 లక్షల వస్తువులను దొంగలు దోచుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన 17 మంది జాలరులను జిల్లా ప్రభుత్వ దవాఖానలో చేర్చి చికిత్స అందచేస్తున్నారు.