శ్రీ మహా విష్ణువు తాను యాదాద్రి మీద కొలువు దీరానంటూ రామభట్టుకు స్వప్నంలో తెలియజేస్తాడు. స్వామి గురించి సార్వభౌముడికి తెలియజేయడానికి భువనగిరి కోటకు బయల్దేరుతాడు భట్టు. ఆ సమయంలోనూ, ఆ తర్వాత ఎన్నో ఆధ్యాత్మిక సంకేతాలు. అవన్నీ సార్వభౌముడిని ఉలికిపాటుకు గురిచేస్తాయి. నారసింహుడి ఆనవాళ్లను వెతికేలా ఉసిగొల్పుతాయి. ఆ ప్రయాణంలో యాదర్షి కొలిచిన యాదగిరీశుడిని దర్శించుకుని రాజధానికి తిరిగివస్తాడు త్రిభువనుడు. అంతలోనే ఎన్నో మలుపులు. శత్రు రాజ్యం నుంచి కవ్వింపులు. పోరు తప్పదని అర్థమైపోతుంది. ఆ సంక్షోభ సమయంలో నారసింహుడు తన భక్తుడిని రక్షించుకున్న తీరు అమోఘం.
భువనగిరి సామ్రాజ్యంలో ఒక సాధారణ మహిళ తనకోసం తెచ్చుకున్న చద్దిమూట తీసి, ముద్ద కలిపి ఇస్తే.. ‘మహా ప్రసాదం’గా స్వీకరించాడు త్రిభువనమల్లుడు. ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. పైగా ‘నరసింహుడి ప్రసాదం’ అని కళ్లకద్దుకొని మరీ తిన్నాడు.
ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో, ఎవరూ ఊహించలేరు. తాడు అనుకున్నది పాము అవుతుంది. పాము అనుకున్నది తాడు అవుతుంది. మానవ ప్రయత్నం సంపూర్ణంగా ఉండవలసిందే. దానికి దైవానుగ్రహం తోడైతే.. అది సఫలమవుతుంది. ఏది ఏమైనా త్రిభువనమల్లుడు ఊహించని పరిణామాలే జరిగాయి.
ప్రత్యక్షంగా తను యుద్ధంలోకి దిగకముందే ఇకపై యుద్ధాన్ని కొనసాగించాల్సిన అవసరం లేదనే పరిస్థితులు ఏర్పడ్డాయి.
హొయసల రాజ్యాధీశుడు విష్ణువర్ధనుడు సంకల్పించిన యుద్ధంలో అతనిదే పైచేయి అయ్యింది.
దురాక్రమణ కాంక్ష ముందు పరాక్రమం ఓడిపోయింది.
దుర్మార్గుల చేతిలో సన్మార్గం సన్నగిల్లిపోయింది.
వెన్నుపోటుదారుల కుట్రలో అధర్మం ఆధిక్యతలో నిలిచింది.
కానీ, ఇదెలా సంభవం?
అన్యాయం – అధర్మమూ గెలుస్తుంటే, న్యాయమూ, శాంతి విధానమూ పరాజయం పాలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి.
విష్ణువర్ధనుడి బలగాలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాయి.
త్రిభువనుడు తానే స్వయంగా సైన్యానికి సారథ్యం వహిస్తూ ముందుకు సాగుతున్నాడు. కానీ, శత్రు సైన్యాలు పక్కదారిపట్టిస్తూ నగరానికేసి కదులుతున్నాయన్న వార్తలొస్తున్నాయి.
ఒక అర్ధరాత్రి..
అటవీ ప్రాంతంలో.. శిబిరంలో ఉన్న త్రిభువనమల్లుడు ఏదో అలికిడి వినిపించి బయటికి వచ్చాడు.
సాయుధులైన ఆరుగురు దళాధిపతులు.. త్రిభువనుడికి అభివాదం చేశారు.
“ఏమి జరిగింది?” అడిగాడు త్రిభువనుడు.
“ప్రభూ! అన్ని వైపులా విష్ణువర్ధనుడి సైన్యాలు మోహరించి ఉన్నాయి. మిమ్మల్ని ఇక్కడినుంచి సురక్షితంగా రాజధాని నగరానికి చేర్చాలని మహారాణీ వారు, మంత్రిమండలి నుంచి మాకు ఆదేశాలు వచ్చాయి”.
ఆ మాటలు వినడం ఇష్టం లేనట్టుగా, ఆపమని సైగ చేశాడు త్రిభువనుడు.
“మేము ఇక్కడికి వచ్చింది ఓడించడానికి – ఓడిపోవడానికీ, ఓడిపోతామేమో అని భయపడి పారిపోవడానికి కాదు. గెలిస్తే.. విజయం. మరోరకంగా జరిగితే.. భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయమయ్యే విధంగా కడదాకా పోరాటం చేస్తాం” అంటూ ముందుకు నడిచాడు.
అధికార లాంఛనాలతో సంసిద్ధంగా ఉన్న అశ్వాన్ని అధిరోహించాడు.
మరుక్షణంలో వలయాకారంగా ఉన్న విష్ణువర్ధనుడి సేనావాహిని మధ్యలోకి వచ్చాడు.
“మంత్రులారా.. దళపతులారా.. సైనికులారా.. ఈ యుద్ధం నాకూ, విష్ణువర్ధనుడికీ మధ్యనే. పౌరులకు ఏమాత్రం సంబంధం లేదు. మమ్మల్ని విష్ణువర్ధనుడి వద్దకు తీసుకెళ్లండి. అక్కడే మాట్లాడుతాను”.
గంభీర స్వరంతో పలికాడు త్రిభువనుడు.
ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవరించింది.
వృద్ధమంత్రి ముందుకొచ్చి.. సగౌరవంగా వందనం చేశాడు.
“మన్నించాలి.. మిమ్మల్ని ప్రభువులవారి వద్దకు తీసుకెళ్లడానికి మాకు అనుమతి లేదు. అర్హత లేదు” అంటూ ఒకడుగు వెనక్కి వేశాడు.
అనంతపాలుడు, అంగరక్షక దళాలు, ఇతర దళపతులూ కత్తులు చేతబట్టి ముందుకొచ్చారు.
కానీ, సాక్షాత్తూ త్రిభువనమల్ల చక్రవర్తే.. తనను విష్ణువర్ధనుడి సమక్షానికి తీసుకెళ్లమనడంతో ఏం చేయాలో తెలియక నిశ్చేష్టులయ్యారు.
అప్పుడొచ్చిందొక రాజాశ్వం!
హొయసల రాజ్యాధీశుడు విష్ణువర్ధనుడు రాజాశ్వంపై వచ్చాడు.
ఇప్పుడు ఇద్దరూ ఎదురెదురుగా ఉన్నారు.
అందరూ ‘ఏం జరుగుతుందా?’ అన్న ఉత్కంఠతో చూస్తున్నారు.
త్రిభువనమల్లుడు, విష్ణువర్ధనుడు.. ఇద్దరూ ఎదురెదురుగా ఉండటం చరిత్రను మలుపుతిప్పే పరిణామం.
బలాబలాలు, సమయాసమయాలు.. బట్టి చూస్తే, పరిస్థితి విష్ణువర్ధనుడికే అనుకూలంగా ఉన్నట్టుగా తోస్తున్నది అందరికీ!
ఒకవైపు భువనగిరి.. మరొకవైపు
హొయసల!
స్వతస్సిద్ధంగా ఏర్పడిన ఒక రాజ్యం, ఒక పరిపాలన.. మరొకరి చేతుల్లోకి వెళ్తే.. అది ప్రమాదకారి అవుతుంది. మనమీద వేరొకరి పెత్తనం.. మనుగడకే అవరోధం అవుతుంది.
త్రిభువనమల్లుడు ఆలోచిస్తున్నాడు.
తను ఒంటరిగా ఉన్నాడు. తెగించి పోరాడినా కూడా తన వీరమరణం ఒక త్యాగంగా నిలిచిపోతుందే తప్ప.. తన సామ్రాజ్యానికి ఉపయోగం లేదు. అలాగని మరొక మార్గం కూడా లేదు.
కంఠంలో ప్రాణం ఉన్నంతవరకూ, శత్రువు కంఠాన్ని ఉత్తరించేవరకూ పోరాడక తప్పదు.
‘స్వామీ నరసింహా! హిరణ్యకశిపుడు ఆనాడు ఒక్కడే.. నువ్వే సంహరించావు. కానీ, ఈనాడు హిరణ్యకశిపులు ఎందరో! మంచిని అణచివేసేవాళ్లు, తమ ప్రజలకే కంటకంగా మారినవాళ్లు, అహంకారంతో విర్రవీగుతూ.. సన్మార్గులను అణగదొక్కేవాళ్లు ఇంకా ఉండనే ఉన్నారు. వీరి బారినుంచి ప్రపంచాన్ని నువ్వే కాపాడాలి’ అని మనసులోనే ప్రార్థించాడు.
ఈలోగా ఒక వింత జరిగింది.
విష్ణువర్ధనుడు నెమ్మదిగా గుర్రం దిగి.. త్రిభువనుడి దగ్గరికి వచ్చాడు.
త్రిభువనుడు అలాగే కనులు మూసుకొని (దైవ ప్రార్థనలో) ఉన్నాడు. విష్ణువర్ధనుడు త్రిభువనమల్లుడిని సమీపించడం చూసి అందరూ హాహాకారాలు చేస్తున్నారు.
అప్పుడు కనులు తెరిచి చూశాడు
త్రిభువనుడు.
ఎదురుగా..
విష్ణువర్ధనుడు!
గభాల్న అశ్వం నుంచి దూకి.. ఒరలోంచి కరవాలాన్ని లాగబోయాడు.
అప్పుడన్నాడు.. విష్ణువర్ధనుడు.
“నమో శ్రీ నారసింహా”.
ఆ మాట వింటూనే ఆశ్చర్యపోయాడు
త్రిభువనుడు.
“నమో నారసింహా! అగ్రజా.. త్రిభువనమల్ల చక్రవర్తీ! మీకు అనేకానేక నమస్కారాలు..” అని వినయంగా పలికిన విష్ణువర్ధనుడిని చూస్తూ.. ఒక్కడుగు వెనక్కి వేశాడు త్రిభువనుడు.
“విష్ణువర్ధనా! నేను సిద్ధంగా ఉన్నాను. పౌరులను, సైన్యాలను వదిలేద్దాం. ఇద్దరమే పోరు చేద్దాం. నువ్వే గెలిస్తే, నువ్వు. నేను గెలిస్తే, నేను! మనిద్దరం కాకుండా, మరొకరి ప్రమేయం, మరొకరి రక్తమూ మనకు అవసరం లేదు. రా.. నువ్వో, నేనో..” కఠినంగా అన్నాడు
త్రిభువనుడు.
తల పంకించాడు విష్ణువర్ధనుడు.
“అవును.. అన్నగారూ! తేల్చుకోవలసింది మీరు, నేను మాత్రమే! కానీ, తేల్చవలసింది..” అంటూ ఆగాడు.
“ఆ దేవదేవుడైన శ్రీ లక్ష్మీ నరసింహుడే..” అంటూ చేతులు జోడించి అన్నాడు విష్ణువర్ధనుడు.
ఏమీ అర్థం కాలేదు.. త్రిభువనుడికి.
నా స్వామి!
నరసింహస్వామి! తేల్చవలసింది ఆయనా? ఏమిటీ విచిత్రం!
విష్ణువర్ధనుడికి ఏమైంది?
తనను చూడగానే యుద్ధం చేస్తాడనీ, ఓడిపోతే ప్రాణాలతో ఉండనివ్వడనీ, కట్టుబాటుకు సంబంధించి కనికరమేమన్నా ఉంటే.. బందీగా పట్టుకొంటాడనీ తను అనుకున్నాడు.
కానీ, ఇదేమిటిలా?
“సర్వలోక హితార్థాయ – స్వజనస్య ప్రియాయచ
రక్షకస్సన్ నృసింహోత్ర యాదశైలే ప్రకాశతే”
శ్లోకాన్ని పఠిస్తూ అర్థం చెప్పాడు విష్ణువర్ధనుడు.
“అంటే.. సమస్త లోకుల హితం కొరకై, ముఖ్యంగా భక్తజనులను అనుగ్రహించడం కోసమే శ్రీ నరసింహుడు యాదశైల శిఖరాన, నిత్య ప్రకాశితుడై వెలసి ఉన్నాడు. ఆయనను వెలికి తీసింది మీరు. అందరికీ స్వామివారి వెలుగులు పంచుతున్నదీ మీరు! మీతో తెలియక శత్రుత్వాన్ని కొని తెచ్చుకున్నాను. కానీ, తెలిశాక శ్రీ నరసింహుడి భక్తుడిగా మిమ్మల్ని శత్రువుగా ఎలా భావించగలను? అయినా ఆజన్మ శత్రువులైన గరుడ పక్షులూ, సర్పాలు కూడా స్వామి సమక్షాన వైరి భేదం వదిలేసి సఖ్యతగా ఉంటాయి కదా!” వినమ్రంగా పలికాడు విష్ణువర్ధనుడు.
“అవును.. యాదాద్రి స్థల పురాణం అదే చెప్పింది..
మహాసర్పాంత్సుపర్ణాస్తు – పక్షేరాచ్చాదయన్తించ
వినా వైరేన జీవంతి – యాదశైల శిఖోపరి!
పాములూ, పక్షులూ కలిసుండగా లేనిది, మనిద్దరం ఎందుకు కలవగూడదు? యాదగిరీశుడు, శ్రీ లక్ష్మీ నరసింహుడి భక్తులమైనప్పుడు ఆయన నామస్మరణలో గడుపుతున్నప్పుడు?”.
చుట్టూ ఉన్నవారందరూ హర్షధ్వానాలు చేశారు.
“అన్నగారూ! మీరు అనుమతిస్తే మిమ్మల్ని సురక్షితంగా భువనగిరికి పంపించగలను. మనం తొందరగా వెళితే మనం వదినగారి ఆగ్రహానికి గురికాకుండా ఉంటాం..”.
త్రిభువనమల్లుని మనసు సంతోషంతో ఉప్పొంగిపోయింది.
తాను ఒకటి తలచాడు.. భయం!
దైవం ఇంకోటి తలచాడు.. అభయం!
“ఓం నమో నారసింహాయ’
అంటూ విష్ణువర్ధనుడిని ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు.
‘శుభం భూయాత్’
అని ప్రకృతి పలికిందా అన్నట్టు పూల చెట్లు పూలను వర్షించాయి.
మేళతాళాలతో, రాజ లాంఛనాలతో, అత్యంత వైభవంగా భువనగిరి చేరారు భువనగిరీశుడు త్రిభువనమల్లుడు, ఆయన అనుంగు సహచరుడు విష్ణువర్ధనుడు.
భువనగిరి సామ్రాజ్యంలో ఇంటింటా సంతోషం!
దసరా, దీపావళి పండుగలు ఒకేసారి జరుపుకొంటున్నట్టు అందరిలో ఆనంద సందోహమే!
శుభకరమైన మంగళహారతులు ఇచ్చి, ప్రభువులవారిని సాదరంగా ఆహ్వానించి, కోట లోపలికి తోడ్కొని వెళ్లింది మహారాణి.
విష్ణువర్ధన మహారాజుకు కోటలోనే విడిది ఏర్పాటుచేశారు.
అయితే..
మహారాణీ వారికింకా సందేహం నివృత్తి కాలేదు.
ఆంతరంగిక మందిరంలో అడగనే అడిగింది భర్తను.
“స్వామీ! మనం ఓటమి అంచులదాకా వెళ్లిపోయాం. మరి ఇదెలా సంభవమయ్యింది? అసలు దురాక్రమణదారుడు, దుర్మార్గుడు అనుకున్న విష్ణువర్ధనుడిలో ఈ మార్పేమిటి?”.
“రాణీ! అది మార్పుకాదు. సంపూర్ణ పరివర్తన. స్వామి భక్తుడు మరొక భక్తుడితో యుద్ధం చేయడమేమిటి? అన్న వివేచన విష్ణువర్ధనుడిలో ఏర్పడింది. అంతదాకా ఎందుకు? ఆనాడు ప్రహ్లాదుడికి శ్రీ నరసింహస్వామివారే తన భక్తులతో భేదభావం చూపవద్దని ఆదేశించారని, గురుదేవులు చెప్పారు. అది నాకు బాగా గుర్తుంది.
యత్ర యత్రచ మద్భక్తాః ప్రశాన్తాస్సమదర్శినః
సాధన సమ్మితాచార స్తేపూయంతే పిచకీకటాన్
ఎక్కడ సమదర్శనులు, ప్రశాంతమైన మనసు కలిగినవారు, సమ్మతాచారులు, నన్ను నమ్మిన భక్తులు ఉంటారో.. వారు పవిత్రులవడమే కాదు, దేశానికి సైతం పవిత్రతను తీసుకొస్తారు. నరసింహుడి భక్తులు అందరూ సమానమే! అందుకే శత్రువుగా మారిన విష్ణువర్ధనుడు ఇప్పుడు సాటి భక్తుడై, ఆత్మీయుడైనాడు” అని చెప్పాడు త్రిభువనుడు.
“మంచిదే ప్రభూ! యుద్ధం తప్పింది. యుద్ధ నష్టం తప్పింది. మళ్లీ మన రాజ్యంలో శాంతిభద్రతలు సుస్థిరంగా ఉంటాయి. ఇంతకీ తదుపరి కార్యాచరణ ఏమిటి?” అడిగింది రాణీ చంద్రలేఖ.
“యాదాద్రి నాథ సాన్నిధ్యే – ఏకరాత్రం తుయోవసేత్
తస్య జన్మకృతం పాపం – నసంశయ వినశ్యతి॥
యాదాద్రి నాథుని క్షేత్రంలో ఒక రాత్రి అయినా భక్తితో గడిపితే జన్మజన్మల పాపాలు క్షణంలో నశించిపోతాయంటారు. అందుకే, స్వామివారికి ఆలయం నిర్మిస్తే.. ఆ ఫలం మనకే కాక, మన ప్రజలందరికీ చెందుతుంది. అది నా ఆకాంక్ష” తన్మయత్వంతో పలికాడు త్రిభువనుడు.
విష్ణువర్ధనుడు అత్యవసరంగా త్రిభువనమల్లుని కలవాలనుకుంటూ అనుమతి కోరుతున్నాడని వర్తమానం వచ్చింది.
అంత అత్యవసరమేమిటో అర్థంకాలేదు చంద్రలేఖకు.
అప్పుడొచ్చిందొక రాజాశ్వం!
హొయసల రాజ్యాధీశుడు
విష్ణువర్ధనుడు రాజాశ్వంపై వచ్చాడు.
ఇప్పుడు ఇద్దరూ
ఎదురెదురుగా ఉన్నారు.
అందరూ ‘ఏం జరుగుతుందా?’ అన్న ఉత్కంఠతో చూస్తున్నారు.
త్రిభువనమల్లుడు, విష్ణువర్ధనుడు.. ఇద్దరూ ఎదురెదురుగా
ఉండటం చరిత్రను మలుపుతిప్పే పరిణామం.
బలాబలాలు, సమయా
సమయాలు.. బట్టి చూస్తే, పరిస్థితి
విష్ణువర్ధనుడికే అనుకూలంగా
ఉన్నట్టుగా తోస్తున్నది
అందరికీ!
ఒకవైపు భువనగిరి..
మరొకవైపు హొయసల!
“అంటే.. సమస్త లోకుల హితం కొరకై, ముఖ్యంగా భక్తజనులను అనుగ్రహించడం కోసమే
శ్రీ నరసింహుడు యాదశైల
శిఖరాన, నిత్య ప్రకాశితుడై
వెలసి ఉన్నాడు. ఆయనను
వెలికి తీసింది మీరు. అందరికీ స్వామివారి వెలుగులు
పంచుతున్నదీ మీరు! మీతో
తెలియక శత్రుత్వాన్ని కొని
తెచ్చుకున్నాను. కానీ, తెలిశాక
శ్రీ నరసింహుడి భక్తుడిగా మిమ్మల్ని శత్రువుగా ఎలా భావించగలను? అయినా ఆజన్మ శత్రువులైన
గరుడ పక్షులూ, సర్పాలు కూడా స్వామి సమక్షాన వైరి భేదం వదిలేసి సఖ్యతగా ఉంటాయి కదా!”
– అల్లాణి శ్రీధర్