దుష్టులపై జూలు విదిల్చినా.. శిష్టులపై జాలి కురిపించినా..గోళ్లతో రక్కసుడి పేగులను తుంచినా.. వేళ్లతో బాలభక్తుడి తల నిమిరినా..చండ్రనిప్పుల కండ్లతో ఆగ్రహించినా.. చల్లని చూపులతో అనుగ్రహించినా..నరసింహస్వామికే చెల్లింది. రెండు రూపాల మూర్తికి మెండైన కీర్తి. రణం కోరిన వారికి ఉగ్ర నరసింహుడు. శరణు వేడిన భక్తులకు లక్ష్మీ నరసింహుడు. యాదగిరిపై భవ్యమైన కోవెలలో కొలువుదీరిన నరసింహస్వామి పునర్దర్శనం లభిస్తున్న శుభ తరుణంలో.. ఆ స్వామి అవతార లీలా విశేషాలను,తత్తాన్ని తెలుసుకుందాం.
నరసింహ అవతారం కేవలం రాక్షస సంహారం కోసం ఆవిర్భవించినది మాత్రమే కాదు. దైవచింతన, దైవంపై నమ్మిక ఎంతటి మహత్తును ప్రకటించగలవో, భక్తికి ఎంతటి అపరిమితమైన శక్తి ఉందో నిరూపించటమే స్వామి అవతార లక్ష్యం. నరసింహ తత్త్వం కూడా అదే!
భగవంతుడి సర్వవ్యాపకత్వాన్ని ప్రకటించే అవతారం ఇది. ఆర్తత్రాణ పరాయణుడిగా, భక్తజన పరిపాలకుడిగా నారాయణుడిని నిరూపించిన మూర్తి నరసింహుడు. క్షణాల్లో క్రోధాన్ని ఆవాహం చేసుకుని, తమోగుణ ప్రధాన రూపమై, తానే రుద్రుడై శ్రీహరి.. నరసింహస్వామిగా ఆవిర్భవించాడు. ఉగ్రమూర్తి అయినప్పటికీ ఆయన పూర్తిగా కరుణాంతరంగుడు. కన్నతండ్రి బిడ్డను అదిలించేటప్పుడు ఎలా ఉగ్రత్వాన్ని ప్రదర్శిస్తాడో, పరమాత్మ కూడా అంతే. ఆ ఉగ్రం వెనుకున్న శాంతమూర్తిని దర్శించి, ఉపాసన చేస్తే సకల శుభాలు కలుగుతాయి.
ప్రహ్లాద శరణాగతి
కండ్లు మూసుకుని, మనసు తెరిచి చూడాలే కానీ, రాతిలోనూ భగవంతుడు సాక్షాత్కరిస్తాడు. ‘నువ్వు తప్ప మరోగతి లేద’ని శరణు వేడితే సమయాసమయాలు పట్టించుకోకుండా, భక్తుల రక్షణ కోసం పరమాత్మ ఆవిర్భవిస్తాడు అని నిరూపించిన భక్తాగ్రేసరుడు ప్రహ్లాదుడు. పుట్టుక నుంచే ప్రహ్లాదుడికి విష్ణువుపై చెప్పలేనంత భక్తి. స్వామి తప్ప మరొక భావన అతని మనసుకు అంటలేదు. ‘చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రీ’ అని తాను చదివిన ప్రతి అక్షరంలోనూ అనంతశయనుడిని దర్శించిన భక్తశిఖామణి ఆ బాలుడు. కన్నతండ్రే కష్టాల పాలు చేస్తుంటే ఎవరిని శరణు వేడాలి? ఇక దిక్కెవరు? అంటే… తాను నమ్ముకున్న దైవం నారాయణుడు తప్ప మరొక ఆలోచన లేకపోయింది. ‘ఇందుగలడు అందులేడను సందేహం వలద’ని తన స్వామి సర్వాంతర్యామి అని తేల్చి చెప్పాడు. దైవంపై అంతులేని నమ్మకాన్ని ప్రదర్శించాడు. కాబట్టి, శరణువేడిన ప్రహ్లాదుడు వేలు ఎక్కడ చూపడం ఆపాడో, అక్కడినుంచే అవతరించి భక్తుడి నమ్మకాన్ని నిరూపించిన భక్తపరాధీనుడు నరసింహుడు. ఆ సమయంలో హిరణ్యకశిపుడు ఎటు వైపు చూపిస్తాడో ఎవరికీ తెలియదు. ఎక్కడంటే అక్కడ ప్రత్యక్షమవ్వాలి. అందుకనే, హిరణ్యకశిప, ప్రహ్లాద సంవాద సమయంలో స్వామి అక్కడే పరోక్షంగా కంటికి కనిపించకుండా ఉన్నాడు. సమయం రాగానే స్తంభం నుంచి నరసింహమూర్తిగా ఆవిర్భవించాడు. ఉగ్ర నరసింహుడుగా అవతరించినా ప్రహ్లాదుడి కోరిక మేరకు పరమ శాంతమూర్తిగా మారిపోయాడు. పరిపూర్ణత సాధించిన శరణాగతికి దక్కిన పుణ్యఫలితం ఇది. అందుకనే నవవిధ భక్తిమార్గాల్లో ప్రహ్లాద శరణాగతి అత్యున్నతంగా నిలిచింది.
జగద్గురువుకు రక్ష
అర్ధ మానవ, అర్ధ సింహ రూపంలో అత్యంత అరుదైన రూపం ఇది. ప్రదోషకాలంలో శివునికి ఎలా పూజలు జరుగుతాయో అలాగే నరసింహస్వామికి కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. శివుడే విష్ణువు అని నిరూపించే మరొక లీల ఇది. అటువంటి నరసింహ ఉపాసన చేసి భవసాగరాలు దాటిన మహనీయులు ఎందరో ఉన్నారు. జగద్గురువు ఆదిశంకరాచార్యులు నరసింహుడి కరుణతో అనేకసార్లు రక్షణ పొందాడు. ఉభయభారతిని వాదంలో ఓడించాల్సి వచ్చిన సందర్భంలో పరకాయ ప్రవేశవిద్య ద్వారా అమరకుడి శరీరంలోకి ప్రవేశించాడు శంకరులు. అప్పుడు ఆయన నిజశరీరం నిప్పుల్లో కాలిపోతున్న సందర్భంలో శంకరులు తిరిగి తన శరీరంలోకి ప్రవేశించాడు. అప్పటికే దగ్ధమైన శరీరబాధ నుంచి నరసింహ కరావలంబ స్తుతి పఠించి ఉపశమనం పొందాడు శంకరులు. మరో సందర్భంలో ఓ కాపాలికుడు శంకరులను వధించటానికి సమాయత్తం అవుతుండగా, పద్మపాదాచార్యులు నరసింహస్తుతి చేశాడు. క్షణం ఆలస్యం చేయకుండా స్వామి స్వయంగా ప్రత్యక్షమై కాపాలికుడిని వధించి, శంకరులను రక్షిస్తాడు. కాశ్మీరదేశ పర్యటనలో ఉండగా, ఒక సందర్భంలో శంకరుల మీద విష ప్రయోగం జరుగుతుంది. అప్పుడు కూడా నరసింహస్వామి ఆయనను కాపాడతాడు. ఇదంతా భగవంతుడి లీల మాత్రమే. కేవలం స్మరణ మాత్రంతోనే నరసింహుడు భక్తులను ఆదుకుంటాడనడానికి శంకరుల ఇతివృత్తం ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి మరెన్నో సందర్భాలు ఉన్నాయి.
శ్రీనివాసుడి నివేదన
తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుడు, మధుర భక్తశిఖామణి తరిగొండ వెంగమాంబ, కైవార తాతయ్య ఇలా ఎందరో నరసింహ ఉపాసనతో వేంకటేశుని సన్నిధి చేరి కైవల్యం పొందారు. అన్నమయ్య రాసిన 32వేల సంకీర్తనల్లో ఎక్కువభాగం వేంకటేశ్వరస్వామి మీదే ఉంటాయి. ఆ తర్వాతి స్థానం నరసింహుడిదే. ఉగ్రమూర్తి మహోగ్రతను వివరిస్తూనే, ఆ స్వామి దయార్ద్ర హృదయాన్ని అత్యంత రమణీయంగా వర్ణించాడు అన్నమయ్య. శ్రీనివాసుని కల్యాణ ఘట్టం ఇందుకు సాక్షీభూతంగా నిలుస్తుంది. పద్మావతీదేవితో కల్యాణ సమయంలో అవసరమైన ధనాన్ని శ్రీనివాసుడు కుబేరుడి వద్ద అప్పుగా తీసుకుంటాడు. ఇందుకు బ్రహ్మదేవుడు, అశ్వత్థవృక్షం సాక్షులుగా ఉంటారు. కుబేరుడు ఇచ్చిన ధనంతో ఏర్పాట్లన్నీ అంగరంగవైభవంగా జరుగుతాయి. పెళ్లి భోజనాలు సిద్ధమవుతాయి. ఇంతలో బ్రహ్మదేవుడికి సందేహం వస్తుంది. దేవుడికి నివేదన చెయ్యకుండా, మిగిలిన వారికి భోజనం వడ్డించటం దోషం కాదా? ఎంతకీ తేల్చుకోలేక శ్రీనివాసుడినే నేరుగా అడుగుతాడు. అందుకు స్వామి, ‘ఇది నా వివాహం. మీరంతా అతిథులు కాబట్టి మీరే ముందు ఆరగించండి’ అంటాడు. కానీ, ‘నివేదన చెయ్యని భోజనాన్ని రుషులు స్వీకరించరు కదా?’ అని మళ్లీ సందేహిస్తాడు బ్రహ్మదేవుడు. అందుకు శ్రీనివాసుడు ‘నేనే మరొక రూపంలో అహోబిలంలో నరసింహుడిగా ఉన్నాను. అక్కడ నివేదన చేసి, పెళ్లికి వచ్చిన అతిథులకు భోజనం వడ్డించండి’ అని చెబుతాడు శ్రీనివాసుడు. ‘సరే!’ నంటూ మిగిలిన కార్యాన్ని పూర్తిచేస్తాడు బ్రహ్మదేవుడు. అప్పటినుంచి తిరుమలలోనూ యోగముద్రలో ఉన్న యోగనరసింహుడి అర్చన వాడుకలోకి వచ్చింది. యోగనరసింహస్వామిని ధ్యానించి, ఆనంద నిలయంలో ఉన్న శ్రీనివాసుడి సాక్షాత్కరం పొందిన మహనీయులు కూడా ఉన్నారు. నారాయణుడికి, నరసింహుడికి ఉన్న అభేదభావానికి ఇంతకన్నా మరొక ఉదాహరణ అవసరం లేదు.
శివం-కేశవం నృసింహం
వేదాలు, ఉపనిషత్తులు, పురాణాల్లో అనేక చోట్ల నరసింహుడి ప్రస్తావన, ఆ స్వామి అవతార వైభవ వర్ణన విస్తారంగా కనిపిస్తాయి. ప్రత్యేకించి నృసింహతాపినీ ఉపనిషత్తులో నరసింహ తత్తం ప్రత్యేకంగా కనిపిస్తుంది. కేవలం హిరణ్యకశిపుడి వధ కోసమే నరసింహ అవతారం జరగలేదనే విషయాన్ని ఈ ఉపనిషత్ ఆధారంగా తెలుసుకోవచ్చు. ఆగ్రహం, అనుగ్రహం ఒకే సమయంలో ప్రకటించగల మూర్తి నరసింహస్వామి ఒక్కడే. అంతేకాదు, శివ, విష్ణు అంశల కలయికగా నరసింహస్వామి అవతారం కనిపిస్తుంది. స్థితి కారుడైన విష్ణువు నర రూపం, లయకారుడైన శివుడు సింహ స్వరూపం. రెండూ కలిసి నరసింహంగా ఆవిర్భవించాయి. విష్ణుమూర్తి సర్వాంతర్యామిత్వాన్ని నరసింహ అవతారం చాటి చెబుతుంది. ఇదే పరమాత్మ అంతర్యామిత్వం!
పురాణ పురుషుడు
బ్రహ్మపురాణంలో ప్రహ్లాదుడి ప్రస్తావన ఉండదు. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషి అనే విషయం కూడా ఇందులో ఉండదు. కేవలం రాక్షస సంహారం కోసం విష్ణువు నరసింహుడిగా ఆవిర్భవించినట్లు కనిపిస్తుంది. స్కాందపురాణంలో కూడా ప్రహ్లాదుడి ప్రస్తావన కనిపించదు. భాగవతం ద్వారా నరసింహ అవతార గాథ విస్తారంగా ప్రాచుర్యంలోకి వచ్చింది. శత్రుత్వాన్ని వహించిన వాడైనప్పటికీ హిరణ్యకశిపుడు నిరంతరం విష్ణు నామాన్ని స్మరిస్తూనే ఉంటాడు. భక్తుడైన ప్రహ్లాదుడి దృష్టి మరొక వస్తువు మీద కొన్ని క్షణాలైనా ఉంటుందేమో కానీ, హిరణ్యకశిపుని చిత్తం మాత్రం నిరంతరం విష్ణుద్వేషంతో నిండి ఉండేది. ఫలితంగా నరసింహస్వామి చేతిలో కనక కశిపుడు అంతమయ్యాడు. లౌకిక దేహాన్ని వదిలిన హిరణ్యకశిపుడు వైకుంఠం చేరడం ఆశ్చర్యం అనిపించకమానదు. ద్వేషించిన వాడికి సైతం మోక్షాన్ని ప్రసాదించే అనుగ్రహమూర్తి నరసింహస్వామి అని ఈ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది. భాగవతానికి భిన్నమైన కథ విష్ణుపురాణంలో కనిపిస్తుంది. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని బాధలు పెట్టేవరకు జరిగిన భాగవత కథే విష్ణు పురాణంలోనూ ఉంది. ఆ తర్వాత విష్ణుమూర్తి ప్రహ్లాదుడికి ప్రత్యక్షమై వరాలు కోరుకొమ్మని అడగటం, తండ్రి చేసిన తప్పులను మన్నించమని ప్రహ్లాదుడు అనడం, నారాయణుడు వరం అనుగ్రహించటం, తర్వాత కొంతకాలం తండ్రీతనయులు కలిసి ఉండటం, చివరగా విష్ణువు నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని వధించినట్లు విష్ణుపురాణంలో ఉంది.
శ్రీ భారతి