నరసింహుడు కేవలం అవతారమూర్తి మాత్రమే కాదు. ఆ స్వామి మంత్రమూర్తి. నరసింహుడి పరబ్రహ్మస్వరూపం, తత్త్వం స్వామి నామ మంత్రాన్ని పరిశీలిస్తే అవగతమవుతుంది.ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుంమృత్యుం నమామ్యహం నరసింహుడి నామ రూపంలో ఉన్న మంత్రం ఇది. ఇందులో ఉన్న ఒక్కొక్క నామం స్వామి ఒక్కో తత్త్వాన్ని ప్రకటిస్తుంది.
ఉగ్రం: స్వామి ఉగ్రమూర్తి. ఈ ఉగ్రత్వమే సకల లోకాలనూ పాలిస్తుంది. నరసింహుడి హుంకారాన్ని విన్నంత మాత్రాన అంతర్గత, బహిర్గత శత్రునాశనం జరుగుతుంది.
వీరం: సకల కార్యకారణాలకు మూలంగా ఉన్న శక్తినే వీరం అంటారు. నరసింహస్వామి వీరమూర్తి. సకల కార్యకారణ స్వరూపుడు ఆయనే.
మహావిష్ణుం: అన్నిలోకాల్లో, అంతటా ఉండే నరసింహ తత్త్వానికి ఈ నామం ప్రతీక. సకల ప్రపంచంలోని జీవరాశులన్నిటిలో తానే వ్యక్తంగాను, అవ్యక్తంగాను పరమాత్మ భాసిస్తాడు. నరసింహ తత్త్వంలోని మరొక విశేషం ఇది.
జ్వలంతం: ఈ నామం నరసింహుడిలోని యోగతత్తాన్ని తెలియజేస్తుంది. సకల లోకాల్లో, సర్వాత్మల్లో తన తేజస్సును ప్రకాశింపజేయటం ద్వారా వాటి ప్రకాశానికి కారణమైన నరసింహ తత్త్వమే ‘జ్వలంతం’ శబ్దానికి అర్థం.
సర్వతోముఖం: ఇంద్రియ సాయం లేకుండా సకల విశ్వాన్ని చూడగల పరమాత్మ తత్త్వమే సర్వతోముఖత్వం. నరసింహుడు సర్వతోముఖుడు. సృష్టి ఆరంభంలో ఉన్న పరమాత్మ, ఆ తర్వాత ప్రపంచ నిర్వహణ కోసం అనేక శక్తులుగా మారిన తత్త్వమే సర్వతోముఖత్వం.
నృసింహం: సకల జంతుజాలంలో సింహం చాలా శ్రేష్ఠమైనది. అందుకనే పరమాత్మ లోకాలను ఉద్ధరించటానికి శ్రేష్ఠమైన సింహాకృతి ప్రధానంగా నరసింహుడిగా ఆవిర్భవించాడు. సింహం పర్వతగుహల్లో నివసిస్తుంది. భక్తుల హృదయగుహల్లో నరసింహుడు కొలువై ఉంటాడు. ఇదీ నరసింహతత్త్వం.
భీషణం: నరసింహుడి శాసనశక్తికి ప్రతీక భీషణత్వం. సూర్యచంద్రాదుల ప్రకాశకత్వం, అష్టదిక్పాలకుల నిర్వహణతో సమస్తం నరసింహుడి భీషణశక్తి కారణంగా నడుస్తున్నాయి. అత్యంత భయంకరమైన స్వరూపం ఇది.
భద్రం: భయాన్ని కలిగించే భీషణుడైన పరమాత్మే, ఆ భయాన్ని పోగొట్టి అభయాన్ని కూడా ఇస్తాడు. అదే భద్రత్వం. నరసింహ తత్త్వంలోని మరో కోణానికి ప్రతీక ఇది. తనను శరణు వేడిన వారికి భద్రతను కల్పిస్తాడు స్వామి.
మృత్యుం మృత్యుం: నామ స్మరణ మాత్రం చేత అపమృత్యువును దూరం చేసేవాడు స్వామి. అందుకే మృత్యువుకే మృత్యువు అన్నారు. స్వాత్మ స్థితిని కలుగజేసి, అమృతత్త్వాన్ని కలుగజేసే స్వరూపం ఆయన.