
సిటీబ్యూరో, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ ) : కరోనా వైరస్‌పై జీహెచ్ఎంసీ యుద్ధం ప్రకటించింది. కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలపై దృష్టిసారించిన ఎంటమాలజీ విభాగం ఆదిలోనే మహమ్మారిని నియంత్రించడమే లక్ష్యంగా చర్యలను చేపడుతున్నది. పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలతో పాటు ప్రధానంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలపై అధికారులు దృష్టి సారించారు. ఈ మేరకు యుద్ధ ప్రాతిపదికన సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు.
పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాలు, వాటి పరిసరాలు, జనసాంద్రత గల ఏరియాలు, ఆస్పత్రులు, ఇనిస్టిట్యూట్స్, పర్యాటక ప్రాంతాల్లోనూ రసాయనాలను స్ప్రే చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. డీఆర్ఎఫ్, ఎంటమాలజీ డిపార్ట్మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో సికింద్రాబాద్, ఖైరతాబాద్, చార్మినార్, ఎల్బీనగర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి జోన్ల పరిధిలోని 30 సర్కిళ్లు, 150 వార్డుల్లో రోజూ 400 నుంచి 500 లీటర్ల సోడియం హైపోక్లోరైట్ ద్రావణం స్ప్రే చేసేందుకు సిద్ధంగా ఉన్నామని, కరోనా కట్టడికి ముందస్తుగా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎంటమాలజీ చీఫ్ రాంబాబు తెలిపారు.
కాగా ప్రాధాన్యత క్రమంలో భాగంగా ప్రస్తుతం 2173 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో స్పెషల్ డ్రైవ్ ద్వారా పిచికారీ చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో గ్రేటర్ అంతటా రసాయనాలు పిచికారీ చేస్తామని అధికారులు పేర్కొన్నారు.
ఎంటమాలజీ సిబ్బంది మొత్తం 2375. ఆరు జోన్లలో 202 స్పెషల్ టీమ్స్‌గా ఏర్పాటు
యంత్రాల వినియోగంలో భాగంగా న్యాప్సాక్ స్ప్రేయర్స్ -847
పవర్ స్ప్రేయర్స్ -1000
గుల్పర్ భారీ వాహనాలు -7
ఫాగింగ్ మిషిన్లు చిన్నవి -302
పెద్ద ఫాగింగ్ మిషిన్లు -63
కరోనా పాజిటివ్ వస్తున్న ప్రాంతాలు, పరిసర ప్రాం తాలు, కొవిడ్ పాజిటివ్ టెస్టింగ్ సెంటర్లు , అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్సీఎస్, సీహెచ్సీఎస్లతో పాటు ముఖ్యంగా గాంధీ, ఉస్మానియా, నిలోఫర్, ఫీవర్ దవాఖానలు, వీటితో పాటు అన్ని ప్రైవేట్ డయాగ్నోస్టిక్ కేంద్రాలు, ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్‌లో పిచికారీ చేయనున్నారు. జనసాంద్రత గల ప్రాంతాలు, రద్దీగా ఉండే మార్కెట్లు, ఏటీఎం సెంటర్లు, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో నిత్యం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని స్ప్రే చేయనున్నారు. వీటితో పాటు అన్ని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మసీదు, చర్చిలు, దేవాలయాలు, ప్రార్థనా మందిరాలపై దృష్టి సారించి చర్యలు తీసుకోనున్నారు.