వరంగల్, మార్చి 26(నమస్తే తెలంగాణ ప్రతినిధి): హనుమకొండ వేదికగా రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ శనివారం మొదలైంది. రెండు రోజుల పాటు జరుగనున్న టోర్నీని రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘సీఏం కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నది. ప్రతి నియోజకవర్గానికి ఒక స్టేడియం మంజూరు చేశాం. ఇందులో 40 మైదానాలు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి. ప్రతి పాఠశాలలో మైదానం ఉండేలా క్రీడా పాలసీలో ప్రతిపాదించాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో సీఎం కప్ పేరుతో పోటీలను నిర్వహిస్తాం. హైదరాబాద్ తరహాలో వరంగల్‌ను అభివృద్ధి చేస్తాం. రాష్ట్రంలో క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. దేశంలో ఎక్కడా లేని రీతిలో త్వరలో క్రీడాపాలసీ తీసుకురాబోతున్నాం’ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చీఫ్ విప్ వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ ప్రకాశ్, ఎమ్మెల్యే నరేందర్, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి, వరంగల్ మేయర్ సుధారాణి తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు జరిగిన వేర్వేరు పోటీల్లో కొమురయ్య(5కే రన్, స్వర్ణం), లాంగ్‌జంప్, షాట్‌పుట్‌లో శ్రీనివాస్‌రెడ్డి పసిడి పతకాలు సాధించారు.