హైదరాబాద్, ఆట ప్రతినిధి: జూనియర్ ఫెన్సింగ్ ప్రపంచకప్ పోటీలకు ఎంపికైన తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్ క్రీడాకారిణులను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అభినందించారు. ఈ నెల 7 నుంచి బుడాపెస్ట్ వేదికగా జరుగనున్న మెగాటోర్నీలో తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌కు చెందిన బేబిరెడ్డి, గౌరి భారత జట్టు తరఫున బరిలోకి దిగనున్నారు. ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు హంగేరి వెళ్లనున్న వీరికి క్రీడా శాఖ తరఫున రూ. 3.20 లక్షల చెక్కును ఆదివారం మంత్రి అందించారు. దీంతో పాటు ఫెన్సింగ్ స్టేట్‌మీట్‌లో పతకాలు సాధించిన వారిని కూడా మంత్రి అభినందించారు. స్టేట్ మీట్లో పార్థసారథి, అంజలి స్వర్ణ పతకాలు సాధిచగా.. ప్రకాశ్, సాయి శరణ్య, సిరివెన్నెల, నందిని, త్రివేణి కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ స్కూల్ ఓఎస్డీ హరికృష్ణ, స్పోర్ట్స్ ఆఫీసర్ రతన్ కుమార్ బోస్, కోచ్ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.