బంజారాహిల్స్/జూబ్లీహిల్స్, మార్చి 7: మహిళా దినోత్సవంలో భాగంగా హైదరాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆధ్వర్యంలో ‘ఆడపడుచుతో ఆత్మీయ విందు’ కార్యక్రమాన్ని యూసుఫ్‌గూడలో సోమవారం ఘనంగా నిర్వహించారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల ద్వారా లబ్ధిపొందిన 326 మందికి రూ.3.26 కోట్ల విలువైన చెక్కులను ఎమ్మెల్యే మాగంటి అందజేశారు. అనంతరం లబ్ధిదారులతో పాటు వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఈ విందులో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ లబ్ధిదారులతో భోజనం చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులు అందుకున్న వారికి కుంకుమ భరిణెలు, బహుమతులు అందజేశారు. పేదింటి ఆడపడుచులను టీఆర్ఎస్ ప్రభుత్వం సొంత బిడ్డల్లాగా చూసుకుంటున్నదని, అందుకే వారితో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ పేదింటి ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నారంటూ లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కార్పొరేటర్లు బాబా ఫసీయుద్దీన్, సీఎన్.రెడ్డి, దేదీప్యరావు, రాజ్‌కుమార్ పటేల్‌తో పాటు అన్ని డివిజన్లకు చెందిన నాయకులు పాల్గొన్నారు.